కూషు దేశమును గూర్చి దైవవాక్కు

18 1. కూషు నదులకు ఆవల రెపరెప కొట్టుకొను రెక్కలుగల దేశమా! నీకు శ్రమ.

2.           రెల్లుతో అల్లిన పడవలలో సముద్రమార్గమున

               అది రాయబారులను పంపుచున్నది.

               వేగముగా వచ్చిన దూతలారా!

               మీరు మరలిపొండు.

               నునుపైన చర్మముకలిగి పొడవుగానుండి

               ఎల్లరికిని భీతికలిగించు బలాఢ్యులు,

               శక్తిమంతులునై అలరారు ప్రజలయొద్దకును,

               నదులతో నిండియున్న దేశమునకును

               మీరు తిరిగిపొండు.

3.           లోకములోని ప్రజలెల్లరును,

               భూమిమీద వసించు నరులెల్లరును వినుడు.

               అదిగో! కొండల మీద జెండానెత్తినారు చూడుడు.

               బాకాను ఊదినారు వినుడు.

4.           ప్రభువు నాతో ఇట్లనెను:

               ”పగి వేడిమిలో సూర్యుడు నిశ్చలముగా

               ప్రకాశించునట్లును, పంటకాలపు వేడిరాత్రులలో

               మంచు నెమ్మదిగాపడినట్లును

               నేను ఆకాశము నుండి

               ప్రశాంతముగా భూమిమీదికి చూతును.

5.           ద్రాక్షపండ్లను కోయకమునుపే,

               పూవులురాలి కాయలు పక్వమగుచుండగనే

               ఆయన వాడియైన  వంకికత్తులతో

               ద్రాక్షతీగలను నరికివేయును.

                వాని రెమ్మలనుకోసి ఆవలపారవేయును.

6.           కొండలలోని పకక్షులకును, వన్యమృగములకును

               వానిని మేతగా వదలి వేయును.

               వేసవిలోపకక్షులు వానిని తినును.

               శీతకాలమున వన్యమృగములు

               వానిని మేయును.

7. అప్పుడు నునుపైనచర్మము కలిగి పొడవుగా నుండి ఎల్లరికిని భీతి కలిగించుచు, బలాఢ్యులుగా శక్తిమంతులుగా అలరారు ప్రజలనుండియు, నదులతో నిండియున్న దేశమునుండియు సైన్యములకధిపతియైన ప్రభువునకు కానుకలు ఆయన నామమునకు నివాస ముగా నుండు సీయోనుకొండకు తీసుకొనివత్తురు.”