దేవుని సేవలో జీవనము
12 1. కాబ్టి సోదరులారా! పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవయాగముగ మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను.
2. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని, మీలో మానసికమైన మార్పుద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అపుడే మీరు దేవుని సంకల్పమును, అనగా ఉత్తమమైనదియు, ఆయనకు సమ్మతమైనదియు, సంపూర్ణమైనది అగు దానిని తెలిసికొనగలరు.
3. ఏలయన, నాకు ఒసగబడిన దేవుని దయచేత మీ అందరికి నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి, మిమ్ము మీరు గొప్పగ భావించుకొన కుడు. దానికి బదులుగా, మీ ఆలోచనలలో అణకువ చూపుడు. మీలో ప్రతివ్యక్తియు దేవుడు తనకొసగిన విశ్వాసమును బట్టి తన్ను ఎంచుకొన వలయును.
4. ఒక్క శరీరమున అనేక అవయవములున్నవి. ఆ అవయవములన్నికి ప్రత్యేకింపబడిన విధులున్నవి.
5. అటులనే మనము చాలమందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరమును ఒకే శరీరము. ఒక శరీరముయొక్క వేరువేరు అంగముల వలెనే మనము అందరమును పరస్పర సంబంధ మును కలిగి యున్నాము.
6. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగియున్నాము. కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుటయైనచో, మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను.
7. సేవ చేయుట యైనచో తప్పక సేవ చేయవలెను, బోధించుటయైనచో తప్పక బోధింపవలెను, 8. ఇతరులను ప్రోత్సహించుట యైనచో తప్పక అటులే చేయవలెను, తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొను వాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను, అధికారము కలవాడు కష్టపడి పని చేయవలెను, ఇతరులపై కనికరము చూపువాడు, సంతోషముగ అటుల చేయవలెను.
9. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి, మంచిని అంటిపెట్టుకొని ఉండుడు.
10. ఒకరిని ఒకరు సోదరభావముతో ప్రేమించు కొనుడు. ఒకరిని ఒకరు గౌరవించు కొనుటకై త్వరపడుడు. 11. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తి పూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు.
12. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు.
13. అవసరము లోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కార ములను ఆచరింపుడు.
14. మిమ్ము హింసించువారిని దీవింపుడు. వారిని శపింపకుండ దీవింపుడు.
15. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించువారితో దుఃఖింపుడు.
16. అందరియెడల సమతా భావము కలిగియుండుడు. హెచ్చైన వానియందు మనస్సు ఉంచక, తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనకుడు.
17. ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకుడు. అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపుడు.
18. అందరి తోడను సౌమ్యముగా జీవించునట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు.
19. ప్రియులారా! ఎన్నటికిని మీరు పగతీర్చు కొనక, దేవుని ఆగ్రహమునకే దానిని వదలి వేయుడు. ఏలయన, వ్రాయబడియున్నట్లుగ:
”పగదీర్చుట నా పని.
నేనే ప్రతిఫలము ఇచ్చెడి వాడను
అని ప్రభువు పలుకుచున్నాడు.”
20. అంతేకాక వ్రాయబడియున్నట్లుగ:
”నీ శత్రువు ఆకలిగొని యున్నచో
వాని ఆకలి తీర్పుము.
దాహముగొని యున్నచో దాహము తీర్పుము. ఏలయన, ఇట్లు చేయుటవలన నీవు వానినెత్తిన మండుచున్న నిప్పుకణికలను కుప్పగా పోయుదువు.
21. కీడు వలన జయింపబడక, మేలుచేత కీడును జయింపుము.