ఉపోద్ఘాతము:

పేరు: మొదటి లేఖ వివరణను చూడాలి.

కాలము: క్రీ.శ. 57లో మాసిడోనియా నుండి రాసినది.

రచయిత: పునీత పౌలు.

చారిత్రక నేపథ్యము:  పౌలు లేఖలోని కొంత భాగంలో వ్యక్తిగత విషయాలనుగూడ ప్రస్తావించాడు. తన యోగ్యతను, ప్రేషిత పరిచర్యను కొరింతీయులు ప్రశ్నించినపుడు పౌలు తన్ను తాను సమర్థించుకున్నాడు (10:1-11:32). కొరింతు క్రైస్తవ సంఘంలోని అరాచకాలను, అన్యాయాన్ని ఖండించాడు. సంఘంలో తనను ఎదురించిన వారికి పౌలు ఈ లేఖ ద్వారా జవాబిచ్చాడు. ఈ నేపథ్యంలో పౌలు క్రైస్తవ విశ్వాసానికి అనువైన కొన్ని అంశాలను ప్రస్తావించి మార్గ దర్శకాలను సూచించాడు.

ముఖ్యాంశములు: కొరింతు సంఘానికి చైతన్యం కలిగించడానికి పౌలు ఈ లేఖద్వారా ప్రయత్నించాడు. తాను  నిజమైన క్రీస్తు అపోస్తలుడనని సమర్థించుకోడానికి కృషిచేశాడు. అపోస్తోలికత్వం, నిజమైన ప్రేషితకార్యం, మట్టి పాత్రల్లో నిధి, క్రొత్త సృష్టి అనే అంశాలను చర్చించాడు.  బాధలు కలిగినప్పుడు దేవుని మీద నమ్మకముంచి క్రీస్తు అనుగ్రహంతో ఎదుర్కోవాలని పౌలు ఉవాచ (12:8). వ్యంగ్యోక్తులతో (11 అధ్యా.) పౌలు తన వ్యతిరేకులను ఎదుర్కొన్న విధానం గమనించదగినది. ప్రేషిత పరిచర్య  ఆత్మతో కూడిన క్రొత్త నిబంధన (3:6, 7-14), సేవ ఆధ్యాత్మికమైనవిగా వుండాలి (3:4-11). తోటి క్రైస్తవులకు సహకారం అందించడం మన కర్తవ్యం (9:1-15).

క్రీస్తు చిత్రీకరణ: ఈ లేఖలో క్రీసును విశ్వాసిగా ఆత్మీయుడుగా చిత్రిస్తాడు. అదెట్లన: క్రీస్తు విశ్వాసుల ఆదరణ (1:5), విజయవీరుడు (2:14), ప్రభువు (4:5), వెలుగు (4:6), న్యాయాధిపతి (5:10), సమాధానకారకుడు (5:19), పాప పరిహారకుడు (5:21), అమూల్య వరం (9:15), అధికారం గలవాడు (10:8), కృప, శక్తి (12:9).