19 1. అనంతరము, దివియందు ఒక గొప్ప ప్రజాసమూహపు కలకల ధ్వనివంటిది ఏదో నాకు వినబడెను. ”అల్లెలూయా! రక్షణ, మహిమ, శక్తి మన దేవునకే చెల్లును!

2. ఆయన తీర్పులు న్యాయాన్వితములు, సత్యోపేతములు. ఏలయన, తన జారత్వముతో భువిని కలుషిత మొనర్చుచున్న ఆ మహావేశ్యను ఆయన శిక్షించెను గదా! ఆమె చిందించిన తన సేవకుల రక్తమునకు దేవుడు ఆమెను దండించెను” అని వారు పలుకుచుండిరి.

3. మరలవారు ఇట్లు బిగ్గరగాపలికిరి: ”అల్లెలూయా! ఆ మహానగరము నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండునుగాక!”

4. అప్పుడు ఇరువది నలుగురు పెద్దలును, నాలుగు జీవులును సింహాసనాసీనుడగు దేవునిముందు సాగిలపడి ఆయనను ఆరాధించి ”ఆమెన్‌! అల్లెలూయా!” అని పలికిరి.

గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవము

5. అంతట సింహాసనమునుండి ఒక స్వరము ఇట్లు వినబడెను: ”మన దేవుని స్తుతింపుడు! ఆయన సేవకులును, ఆయనయందు భయభక్తులుగల పిన్నలును, పెద్దలును, అందరును స్తుతింపుడు!”

6. అంతట ఒక గొప్ప జనసమూహముయొక్క ధ్వనివంటిదియు, భయంకర జలపాత గర్జనను పోలినదియు, గొప్ప ఉరుమువలె ఉన్న ఒక స్వరమును నేను వింటిని. ”అల్లెలూయా! మన  దేవుడు,  ప్రభువు, మహాశక్తిమంతుడు పరిపాలించును.

7. మనము ఆనందింతము,  సంతోషింతము, ఆయన ఘనతను స్తుతింతము! గొఱ్ఱెపిల్ల వివాహమహోత్సవము ఆసన్నమయినది, వధువుసిద్ధమైనది.

8. ఆమె స్వచ్ఛమును, ప్రకాశవంతమును అయిన అమూల్య నారవస్త్రములు ధరింప అనుమతింపబడినది. పరిశుద్ధుల సత్కార్యములే ఆ అమూల్యవస్త్రములు” అని ఆ స్వరము పలికెను.

9. అప్పుడు ఆ దేవదూత, ”గొఱ్ఱెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడినవారు ధన్యులు అని వ్రాయుము” అని నాతో చెప్పెను. ”ఇవి దేవుని సత్యమగు పలుకులు” అనియు ఆ దేవదూత నాతో వచించెను.

10. అంత నేను అతని పాదములపై పడి ఆరాధింపబోగా అతడు, ”నీవు అట్లొలనర్పరాదు! నీకును, యేసు సాక్ష్యముకలిగిననీ  సోదరులకును  నేను తోటిసేవకుడను మాత్రమే.దేవుని ఆరాధింపుము. ఏలయన, యేసు సాక్ష్యమే ప్రవచన ఆత్మ” అని పలికెను.

ధవళాశ్వపు అశ్వికుడు

11. అంతట దివి తెరువబడి అట ఒక తెల్ల గుఱ్ఱము నాకు కాననయ్యెను. ఆ అశ్వికుడు విశ్వాసపాత్రుడు, సత్యవంతుడు అని పిలువబడును. ఆయన న్యాయముగా విచారించి యుద్ధములందు పోరాడును.

12. ఆయన కన్నులు అగ్నిజ్వాలవలెఉండెను. ఆయన తన శిరస్సున పెక్కు కిరీటములు ధరించిఉండెను. ఆయన ఒక నామమును ధరించి ఉండెను. కాని అది ఏమియో ఆయన తప్ప అన్యులెరుగరు.

13. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. ”దేవుని వాక్కు” అను నామమున ఆయన పిలువబడును.

14. దేవసైన్యములు ఆయనను అనుసరించుచుండెను. వారు పరిశుద్ధ ధవళవస్త్రములను ధరించి ధవళాశ్వములపై పయనించు చుండిరి.

15. ఒక వాడియైన కత్తి ఆయన నోటినుండి వెలువడెను. దానితో ఆయన సమస్తజాతులను జయించును. ఆయన ఇనుపదండముతో వారిపై అధికారము నెరపును. సర్వశక్తిమంతుడగు దేవుని ప్రచండ ఆగ్రహమను మద్యపు తొట్టిని  త్రొక్కును.

16. ”రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” అను పేరు ఆయన దుస్తులపైనను, ఆయన తొడపైనను వ్రాయబడి ఉండెను.

17. అప్పుడు సూర్యగోళముపై నిలిచియున్న ఒక దేవదూతను కనుగొంటిని.  గాలిలోఎగురుచున్న పక్షిజాలముతో అతడు బిగ్గరగా ”రండు! దేవుని  మహావిందుకు సమావేశమగుడు!

18. రాజులయొక్కయు,  బలిష్ఠులయొక్కయు, నాయకులయొక్కయు, అశ్వికుల యొక్కయు, బానిసలు, స్వతంత్రులు, పిన్నలు, పెద్దల సమస్త జనుల మాంసమును ఆరగింపరండు!” అని పలికెను.

19. అంతట ఆ అశ్వికునితోను, ఆయన సైన్యముతోను పోరాడుటకై ఆ మృగమును, భూపాలురును, వారి సైన్యములును సమాయత్తమగుట నేను గమనించితిని.

20. ఆ మృగమును, దాని సమక్షమున మాయలు ప్రదర్శించిన ఆ అసత్య ప్రవక్తయు బంధింపబడిరి (అతడు ఆ మృగనామమును ధరించిన వ్యక్తులను, ఆ మృగవిగ్రహమును పూజించిన వ్యక్తులను, ఆ మాయల చేతనేగదా మోసగించినది!). అప్పుడు ఆ మృగమును, ఆ అసత్య ప్రవక్తయును సజీవులుగనే సలసలకాగు గంధకముతో కూడుకొని ఉన్న అగ్ని గుండములోనికి త్రోయబడిరి.

21. మిగిలిన వారు అశ్వికుని నోటినుండి వెలువడిన ఖడ్గముచే వధింపబడిరి, పక్షులన్నియు వాని మాంసమును కడుపార ఆరగించినవి.