ఐగుప్తు సహాయము అక్కరకు రాదు

31 1.       ఐగుప్తును సహాయమర్థింపబోవువారు

                              నశింతురు.

                              వారు ఐగుప్తు అశ్వములను,

                              బలాఢ్యులైన పదాతులను,

                              అధికసంఖ్యాకములైన రథములను

                              నమ్ముచున్నారు, కాని

                              యిస్రాయేలు పరిశుద్ధదేవుని నమ్ముటలేదు.

                              ఆయనను సంప్రతించుట లేదు.

2.           ఆయన వివేకవంతుడు.

               ఆయన నాశనమును రప్పించును.

               ఆయన ఆడినమాట తప్పక దుష్టులదండించును.

               దుర్మార్గులను కాపాడువారిని శిక్షించును.

3.           ఐగుప్తీయులు నరమాత్రులేగాని దైవములుకారు. వారి గుఱ్ఱములు

               మాంసమయములే గాని ఆత్మ గావు.

               ప్రభువు శిక్షించుటకు తన చేయిచాచినపుడు

               సాయము చేయువారును,

               సాయము పొందువారును కూలుదురు.

               ఎల్లరును మూకుమ్మడిగా చత్తురు.

ప్రభువు అస్సిరియాతో పోరాడును

4.           ప్రభువు నాతో ఇట్లు చెప్పెను:

               సింగము లేదా సింగపుకొదమ తానుప్టిన

               యెర దగ్గర నిలుచుండి గర్జించునేకాని,

               తనచుట్టు గుమికూడిన కాపరులను చూచి వెరవదు

               వారి బెదరింపులకును, అరపులకును దడియదు.

               ఆ రీతిగానే సైన్యములకధిపతియైన ప్రభువు

               సియోను కొండను, దాని శిఖరమును

               కాపాడుటకు పోరుసల్పును.

5.           పక్షి తనపిల్లలమీద రెక్కలువిప్పి,

               వానిని కాపాడినట్లే

               సైన్యములకధిపతియైన ప్రభువు

               యెరూషలేమును కాపాడును.

               దానిని శత్రువులకు చిక్కకుండ

               రక్షించి భద్రముగా మనజేయును.

6.           నామీద తీవ్రముగా తిరుగుబాటుచేసిన

               యిస్రాయేలీయులు నా యొద్దకు తిరిగి రావలెను.

7.            ఆ దినమున మీరు వెండిబంగారములతో

               స్వయముగా జేసికొనిన

               పాపపు విగ్రహములనెల్ల ఆవల పారవేయుదురు.

8.           ”అస్సిరియా కత్తివాతబడును,

               కాని ఆ కత్తి నరులు వాడునది కాదు.

               నరులు వాడని ఖడ్గమునకు అది బలియగును.

               అస్సిరియా జనులు పోరునుండి పారిపోవుదురు. వారి యువకులు బందీలగుదురు.

9.           వారి రాజు భయపడి పారిపోవును.

               వారి అధిపతులు వెరగొంది

               తమ జెండాలను వదలివేయుదురు”.

               ఇది ప్రభువు వాక్కు.

               సియోనున ఆయన అగ్నియు,

               యెరూషలేమున ఆయన కొలిమియు ఉన్నవి.