విగ్రహారాధన ఖండనము

6 1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! నీవు యిస్రాయేలు పర్వతముల వైపు చూచి వానిని మందలించుచు ఇట్లు ప్రవచింపుము.

3. యిస్రాయేలు పర్వతములారా! మీరు యావే ప్రభువు మాటవినుడు. ప్రభువు యిస్రాయేలు పర్వతములు, కొండలు, లోయలు, కనుమలతో ఇట్లు చెప్పుచున్నాడు. నేను కత్తిని పంపి జనులు విగ్రహము లను కొలుచు ఉన్నతస్థలములనెల్ల నాశనముచేసెదను.

4. మీ బలిపీఠములను కూలద్రోయుదురు. సాంబ్రాణి పీఠములను నాశనము చేయుదురు. అచట ప్రజలను వారి విగ్రహముల ముందే నేను వధింతును.

5. యిస్రాయేలీయుల కళేబరములను వారి విగ్రహముల యెదుట పడవేసి వారి ఎముకలను బలిపీఠముల చుట్టు పారవేయుదును.

6. యిస్రాయేలీయుల నగరములు నాశనమగును. ఉన్నతపూజా స్థలములు పాడగును. వారి బలిపీఠములు విగ్రహములు ముక్కల గును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. వారు నిర్మించినవెల్ల నాశనమగును.

7. ఎల్లెడల జనులను వధింతురు. అప్పుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు.

8. కాని నేను మీలో కొందరిని ప్రాణములతో బ్రతుకనిత్తును. వారు కత్తిని తప్పించుకొని అన్యజాతుల మధ్య చెల్లాచెదరు అగుదురు.

9. ఆ ప్రవాసము నుండి వారు నన్ను స్మరించుకొందురు. ఆ జనులు అవిశ్వాస హృదయులై నన్ను విడనాడి విగ్రహములను ఎన్ను కొనిరి. కనుక నేను వారిని శిక్షించి అవమానమున ముంచితినని గ్రహింతురు. తమ దుష్టకార్యము లకుగాను, తమ హేయమైన పనులకుగాను వారు తమ్ముతామే అసహ్యించుకొందురు.

10. నేను ప్రభుడ ననియు, నా హెచ్చరికలు వ్టి బెదిరింపులు కావనియు అర్థము చేసికొందురు.”

11. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు: ”నీ చేతులు చరచి చిందులుతొక్కుచూ, యిస్రాయేలీయుల దుష్కార్యములకుగాను, హేయమైన పనులకుగాను విలపింపుము.  వారు కత్తివలన మరియు కరువు వలన, అంటురోగములవలన చత్తురు.

12. దూర మున నున్నవారు రోగమువలన చత్తురు. దగ్గరలో నున్నవారు పోరున కూలుదురు. మిగిలినవారు ఆకలివలన చత్తురు. వారు నా కోపమును చవిచూతురు.

13. విగ్రహములచుట్టును, బలిపీఠములచుట్టును, కొండలమీదను, పర్వతములమీదను, పచ్చనిచెట్ల క్రిందను, సింధూరముల క్రిందను, విగ్రహములకు బలులర్పించిన తావులన్నింటను వారి శవములను పడవేయుదురు. అప్పుడు వారు నన్ను ప్రభుడని గుర్తింతురు.

14. నేను నా చేయిచాచి వారి దేశమును నాశనము చేయుదును. దక్షిణమునందలి ఎడారి నుండి ఉత్తరమునందలి దిబ్లాతావరకు వారి దేశ మును ఎడారి చేయుదును. యిస్రాయేలీయుల వాస స్థలములలో ఎవరును మిగులరు. అప్పుడు వారు నేను ప్రభుడనని గ్రహింతురు.”