బెతానియాలో అభిషేకము

(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)

12 1. పాస్క పండుగకు ఆరుదినములు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలోనుండి  లేపబడిన లాజరుయొక్క స్వగ్రామము.

2. అక్కడ యేసుకు విందుచేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను.

3. అపుడు మరియమ్మ విలువైన, స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును శేరున్నర తెచ్చి యేసుపాదములను అభిషేకించి, తన తలవెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను.

4. అంతట ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింప నున్న యూదాఇస్కారియోతు, 5. ”ఈ పరిమళ తైలము మూడువందల దీనారములకు అమ్మి పేదలకు ఈయ గూడదా?” అనెను.

6. అతడు పేదలపట్ల జాలితో ఇట్లు అనలేదు. ఏలయన, వాడు దొంగ. తన యొద్ద నున్న డబ్బులసంచి నుండి దొంగిలించుచుండును.

7. అపుడు యేసు ”ఆమెను అటుల చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు.

8. పేదలు ఎల్లపుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను” అనెను.

లాజరుపై కుట్ర

9.యేసు అక్కడ ఉన్నాడని యూద జనసమూ హము తెలిసికొని వారు యేసునే కాదు ఆయనచే మృతులలోనుండి లేపబడిన లాజరునుకూడ చూచు టకు వచ్చిరి.

10. అంతట ప్రధానార్చకులు లాజరును కూడ చంపుటకు కుట్రచేసిరి. 

11. ఏలయన, అతని మూలమున యూదులలో పలువురు తమవారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి.

పురప్రవేశము

(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; లూకా 19:28-40)

12. మరునాడు పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చియు న్నాడని వినెను. 13. వారు ఖర్జూరపు మట్టలు పట్టు కొని యేసునకు ఎదురేగి,

” ‘జయము!

ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక!

యిస్రాయేలు రాజు స్తుతింపబడునుగాక!”

అని ఎలుగెత్తి చాటిరి.

14. యేసు ఒక చిన్న గాడిదను చూచి, దానిపై కూర్చుండెను. లేఖనమందు ఇట్లు వ్రాయబడియున్నది:

15.          ”సియోను కుమారీ, భయపడకుము

               ఇదిగో! నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు.

               గాడిదపిల్లపై కూర్చుండి వచ్చుచున్నాడు.”

16. ఆయన శిష్యులు మొదట దీనిని గ్రహింప లేకపోయిరి. కాని, యేసు మహిమపరుపబడినప్పుడు ఆయనను గురించి ఇటుల వ్రాయబడియున్నదనియు, అట్లే ప్రజలు ఆయన పట్ల వ్యవహరించిరనియు, వారికి స్ఫురణకు వచ్చెను.

17. సమాధినుండి లాజరును వెలుపలకు పిలిచి, వానిని మృతులలోనుండి పునర్జీవుని చేసినపుడు ఆయనవెంట ఉన్నవారు సాక్ష్యము పలికిరి.

18. ఆయన ఈ సూచకక్రియలు చేసెనని విని, జనసమూ హము ఆయనను చూడబోయెను.

19. అంతట పరిసయ్యులు ఒకరితో ఒకరు ”మన ప్రయత్నము ఎట్లు నిష్ఫలమయ్యెనో చూడుడు. లోకమంతయు ఆయన వెంటపోవుచున్నది” అని చెప్పుకొనిరి.

గ్రీకుల విన్నపము

20. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి.

21. వారు గలిలీయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో ”అయ్యా! మేము యేసును చూడగోరు చున్నాము” అనిరి.

22. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పెను. అంద్రెయ, ఫిలిప్పు ఆ విషయ మును యేసుతో చెప్పిరి.

23. అందుకు యేసు ఇట్లనెను: ”మనుష్యకుమారుడు మహిమ పొంద వలసిన గడియవచ్చినది.

24. నేను మీతో నిశ్చయ ముగ చెప్పునదేమన: గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించినయెడల విస్తారముగ ఫలించును.

25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని, ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు  దానిని  నిత్యజీవమునకై కాపాడుకొనును.

26. నన్ను సేవింప గోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన యెడల వానిని నాతండ్రి గౌరవించును.

మరణమును గూర్చిన ప్రస్తావన

27. ఇపుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను! ఓ తండ్రీ! ఈ గడియనుండి నన్ను కాపా డుము. లేదు. నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా!

28. ఓ తండ్రీ! నీ నామమును మహిమ పరుపుము” అనెను. అంతట ఆకాశమునుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను: ”నేను దానిని మహిమ పరచితిని. మరల మహిమపరచెదను”.

29. అక్కడ ఉన్న జనసమూహము అది విని ”మేఘము గర్జించినది” అనిరి. కొందరు ”దేవదూత ఆయనతో మాట్లాడెను” అనిరి.

30. కాని యేసు, ”ఈ శబ్దము నా కొరకు రాలేదు. అది మీ కొరకే వచ్చినది.

31. ఇపుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసి వేయబడును.

32. నేను భూమినుండి పైకి ఎత్తబడిన ప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షింతును” అని పలికెను.

33. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను.

34. జనసమూహము ఆయనను, ”క్రీస్తు ఎల్లప్పుడును ఉండునని మేము ధర్మశాస్త్రమున వినియుంటిమి. మరి మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు ఎట్లు చెప్పుచున్నావు? ఈ మనుష్యుకుమారుడు ఎవడు?” అని ప్రశ్నించిరి.

35. అందుకు యేసు ”ఇంకను కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును. చీకటి  మిమ్ము క్రమ్ముకొనకముందే, వెలుగు ఉండగనే నడువుడు. చీకటిలో నడుచువానికి, తాను  ఎటు  వెళ్ళు చున్నాడో తెలియదు.

36. మీరు వెలుగుపుత్రులుగా వుండుటకు వెలుగు ఉండగనే మీరు ఆ వెలుగునందు విశ్వాసముంచుడు” అనెను. ఈ మాటలు చెప్పి యేసు వారికి కనుమరుగైపోయెను.

యూదుల అవిశ్వాసము

37. యేసు వారి ఎదుట ఎన్నో సూచకక్రియలు చేసినను వారు ఆయనను విశ్వసింపలేదు.

38.  యెషయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను:

               ”ప్రభూ! మా సందేశమును ఎవరు విశ్వసించిరి?

               ప్రభువు తన శక్తిని ఎవరికి బయలుపరచెను?”

39. ఇందువలన వారు విశ్వసింపలేకపోయిరి. ఏలయన, యెషయా ప్రవక్త  మరల ఇట్లు పలికెను:            

40.        ”వారు కన్నులతో చూచి,

               హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని,

               నాచేత స్వస్థత పొందకుండునట్లు,

               ఆయన వారి కనులకు అంధత్వము కలుగజేసి

               వారి హృదయమును కఠినపరచెను.”

41. యెషయా ఆయన మహిమను చూచెను. కనుక ఆయన విషయమై ఇట్లు పలికెను.

42. అయినను అధికారులలో కూడ పలువురు ఆయనను విశ్వసించిరి. కాని, ప్రార్థనామందిరమునుండి వెలివేయబడుదు మేమో అని పరిసయ్యులవలన భయముచే ఆయనను అంగీకరింపరైరి.

43. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పునే ఎక్కువగ కాంక్షించిరి.

యేసు వాక్కు – తీర్పు

44. యేసు ఎలుగెత్తి ఇట్లనెను: ”నన్ను విశ్వసించు వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించు చున్నాడు. 45. నన్ను చూచువాడు నన్ను పంపినవానిని చూచుచున్నాడు.

46. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. 47. నా మాటలు ఆలకించి, ఆచరించని వానిని ఖండించునది నేను కాదు.  నేను  వచ్చినది లోకమును రక్షించుటకేగాని,  ఖండించుటకు  కాదు.

48. నన్ను తృణీకరించి, నా మాటలు ఆల కింపని వానికి తీర్పుతీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్కే అంతిమదినమున వానిని ఖండించును.

49. నా అంతట నేను ఏమియు మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమిచెప్పవలయునో, ఏమి మాట్లాడవలయునో ఆజ్ఞాపించి ఉన్నాడు.

50. ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును. కనుక, నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను.”