సజీవ శిల, పవిత్ర జాతి

2 1. సమస్త దుష్టత్వమునకు దూరముగ ఉండుడు. ఏ మాత్రము అబద్ధము ఆడకుడు. కపటము గాని అసూయగాని ఉండరాదు. పరదూషణ మానివేయుడు.

2. నూతనముగా జన్మించిన శిశువుల వలె కల్మషములేని వాక్కు అను పాలకొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుటవలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు.

3. ఆ విధముగనే ప్రభువుయొక్క కృపను రుచి చూచినవారగుదురు.

4. నిరుపయోగము అయినదిగ మనుజులచే తిరస్కరింపబడి, అమూల్యమైనదిగ దేవునిచే ఎన్నుకొన బడిన సజీవశిలయగు ప్రభువును సమీపింపుడు. 

5.ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవశిలలుగ మిమ్ము ఉపయోగింపనిండు. యేసు క్రీస్తు ద్వారా, ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగ చేయనిండు.

6. ”నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని; దానిని సియోనులో మూలరాయిగ స్థాపించుచున్నాను; ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు” అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది.

7. విశ్వాసులగు మీకు ఈ రాయి అమూల్యమైనది. కాని అవిశ్వాసులకు ”ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయెను.”

8. ”మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడచేయునది ఈ రాయియే; వారిని పడద్రోయునదియు ఈ రాయియే” ఆ వాక్కును విశ్వసింపకుండుటచేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవసంకల్పము అట్టిది.

9. కాని మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజకబృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుతకార్యములను ప్రకటింప ఏర్పరుపబడినవారు. ఆయనయే మిమ్ము చీకటినుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను.

10. ఒకప్పుడు మీరు ప్రజ కారు. కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు మీరు కనికరమును ఎరుగరు. కాని ఇప్పుడు మీరు ఆ కనికరమును కనుగొంటిరి.

దేవుని దాసులు

11.  మిత్రులారా! ఇహలోకమున పరదేశులుగ, వలసదారులుగ ఉన్న మీకు నేను మనవి చేసికొనుచున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడును ఆత్మతో పోరాడుచుండును. కనుక వ్యామోహితులు కాకుండుడు.

12. మీరు సత్ప్రవర్తన గలవారై ఉండవలెను. అన్యులు మిమ్ము దుష్ప్రవర్తకులని దూషించు నెడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించునట్లు ప్రవర్తింపుడు. అప్పుడు వారు దర్శనము ఇచ్చు దినమున దేవుని మహిమపరుపగలరు.

13. ప్రభువు నిమిత్తమై మానవులగు అధికారులకు అందరకు లోబడియేఉండుడు. సర్వాధిపతి చక్రవర్తికి వినమ్రులై ఉండుడు.

14. దుష్టులను శిక్షించుటకును, శిష్టులను మెచ్చుకొనుటకును పంపబడిన పాలకులకు విధేయులై ఉండుడు.

15. మీరు మీ సత్కార్యములవలన మూర్ఖప్రజల జ్ఞానహీన మాటలను అణచివేయవలెను. ఇది దేవుని చిత్తము. 16. స్వేచ్ఛా జీవులుగ బ్రతుకుడు. కాని మీ స్వేచ్ఛ ద్వారా దౌష్ట్యమునుకప్పిపుచ్చకుడు. దేవుని దాసులుగనే జీవింపుడు.

17. అందరిని గౌరవింపుడు. తోడి విశ్వాసులను ప్రేమింపుడు, దేవునియందు భయభక్తులు కలిగి ఉండుడు. చక్రవర్తికి మర్యాదచూపుడు.

క్రీస్తుయొక్క బాధల  దృష్టాంతము

18. సేవకులారా! మీ యజమానులకు మీరు విధేయులు కావలెను. వారికి సమస్త మర్యాదలను చూపుడు. దయాపరులును, సౌమ్యులును అగువారికి మాత్రమే కాదు, కుటిలమనస్కులగువారికి కూడ మర్యాద చూపుడు.

19. ఎవడైనను అన్యాయముగ శ్రమపొందుచు, దేవుని ఎడల నిష్కపట మనస్సాక్షి కలిగి, దానిని ఓర్పుతో సహించినయెడల దేవుని అంగీకారమును పొందును.

20. ఏలయన, తప్పొనర్చి దానికి ప్రతిఫలముగ శిక్షను ఓర్పుతో భరించినచో దానియందు ఏమి గొప్పతనము ఉన్నది? కాని మంచినే చేసియు, దానికై బాధను అనుభవింపవలసి వచ్చినపుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును.

21. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏలయన, క్రీస్తే మీకొరకు బాధపడి, ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించుటకు గాను, ఒక ఆదర్శమును ఏర్పరచెను.

22. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడును ఎట్టి అసత్యమును వెలువడ లేదు.

23. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింప లేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగ తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకము ఉంచెను.

24. మనము పాపమునకు మరణించి నీతికి జీవించునట్లుగ, ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువమ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత  నొందితిరి.

25. మీరు త్రోవతప్పిన గొఱ్ఱెలవలె ఉంటిరి. కాని ఇప్పుడు, మీ ఆత్మలకు రక్షకుడును, కాపరియు అగువానియొద్దకు మీరు మరలి ఉన్నారు

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము