కిర్యత్యారీము నుండి మందసమును కొనివచ్చుట

13 1. దావీదు వందమందికి, వేయిమందికి అధికారులుగానున్న తన సైన్యాధిపతులను ఇతర నాయకులను సంప్రదించెను.

2. అంతట అతడు యిస్రాయేలీయులతో ”ఈ ఆలోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యావేవలన కలిగినచో దూతలను పంపి మన దేశమున మిగిలియున్న మన సహోదరులను, తమతమ నగరములలోను, పల్లెల లోను వసించు యాజకులను, లేవీయులను ఇచ్చటకు పిలిపింతము.

3. మనమెల్లరము పోయి ప్రభుమందస మును కొనివత్తము. సౌలు పరిపాలనాకాలమున దానియొద్ద మనము సంప్రదించకపోతిమి” అనెను.

4. ప్రజలకు ఆ ఆలోచన నచ్చెను గనుక వారెల్లరును సమ్మతించిరి.

5. కనుక దావీదు మందసమును కొనివచ్చుటకై దక్షిణమున సీహోరు అను ఐగుప్తు పొలిమేరనున్న నదినుండి ఉత్తరమున హమాతు పొలిమేర వరకు గల యిస్రాయేలీయులను అందరిని ప్రోగుచేసెను.

6. దావీదు, యిస్రాయేలీయులు కలిసి దైవమందస మును కొనివచ్చుటకై యూదా మండలములోని బాలా అనబడు కిర్యత్యారీమునకు వెళ్ళిరి. కెరూబుదూతల నడుమ ఆసీనుడైఉండు ప్రభువు పేరుతో ఆ మందసము విరాజిల్లుచుండెను.

7. వారు అబీనాదాబు గృహము నుండి మందసమును వెలుపలికి తీసికొనివచ్చి క్రొత్త బండిమీద ప్టిెరి. ఉస్సా, అహ్యోలు బండి తోలించు చుండిరి.

8. దావీదు, యిస్రాయేలీయులు మందసము ముందు ఉత్సాహముతో నాట్యముచేసిరి. స్వరమండల ములు, మృదంగములు, బూరలు, తాళములు వాయించుచు గానముచేసిరి.

9. బండి కీదోను కళ్ళము చెంతకు రాగానే ఎద్దులకు కాలుజారగా మందసము ప్రక్కకు ఒరిగెను. కనుక ఉస్సా చేయిచాచి దానిని పట్టుకొనబోయెను.

10. ప్రభువు ఉస్సా మీద ఆగ్రహముచెంది మందసమును ముట్టుకొనినందులకుగాను అతనిని చంపివేసెను. అతడు అక్కడికక్కడే ప్రభువు సమక్షమున కన్నుమూసెను.

11. ఆ రీతిగా ప్రభువు ఆగ్రహముతో ఉస్సాను చంపివేసెను గనుక దావీదు దుఃఖాక్రాంతుడయ్యెను. ఆ ప్రదేశము నకు నేి వరకు ”పెరెస్‌ ఉస్సా”1 అని పేరు.

12. ప్రభువునకు భయపడి మందసమును దావీదు తన ఇంికి కొనిపోవుట మేలాయని సంశయించెను.

13. కనుక అతడు దానిని దావీదు దుర్గమునకు కొనిపోకుండ గాతు పౌరుడైన ఓబేదెదోము అనువాని నింట వదలిపెట్టెను.

14. అది మూడునెలలపాటు అతని ఇంటనుండెను. ప్రభువు ఓబేదెదోము కుటుంబ మును అతని ఆస్తిపాస్తులను దీవించెను.