6 1. కావున క్రీస్తు సందేశమునందలి ప్రారంభదశనువదలి, పరిపక్వమైన బోధనలవైపుకు సాగిపోదము. ప్రయోజన రహితములగు పనులనుండి విముఖులమై, దేవుని విశ్వసింపవలెనను విషయమును తిరిగి మనము ప్రస్తావింపరాదు.
2. అట్లే బప్తిస్మ బోధనలను గూర్చియు, హస్త నిక్షేపణమును గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు, శాశ్వతమగు తీర్పును గూర్చియు తిరిగి మనము ప్రస్తావింపరాదు.
3. దేవుని అనుమతి ఉన్నచో ముందుకు సాగుదము.
4. పతితులైన వారిని తిరిగి పశ్చాత్తాప మార్గమునకు తెచ్చుట ఎట్లు? ఒకప్పుడు వారు జ్ఞానజ్యోతిని పొంది, పరలోక వరమును చవిచూచిరి. పవిత్రాత్మలో భాగస్వాములైరి.
5. దేవుని సువార్తను, భవిష్యత్కాలపు శక్తుల ప్రభావములను రుచిచూచిరి.
6. అయినను భ్రష్టులైరి. వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయుచు, బహిరంగముగ అవమానములపాలు చేయుచున్నందున, వారిని పశ్చాత్తాపమునకు తిరిగి మరల్చుట అసాధ్యము.
7. ఏలయన, భూమి తనపై తరచుగా కురియు వాన నీటిని గ్రహించి, వ్యవసాయము చేయువారికి అనుకూలమైన పంట పండించినయెడల దేవుని దీవెనను పొందును.
8. కాని అది ముళ్ళపొదలు, కలుపు మొక్కలు పెరుగు భూమియైనచో విలువలేనిది అగును. అట్టిదానికి దేవునిచే శపింపబడు ప్రమాదమున్నది. అది అగ్నిచే దహింపబడినాశనము చేయబడును.
9. ప్రియ సోదరులారా! మేమిట్లు మాట్లాడుచున్నను, మీరు ఇంతకంటెను మంచిదియు, రక్షణకర మైనదియు అయిన స్థితిలో ఉన్నారని మాకు గట్టి నమ్మకము.
10. దేవుడు అన్యాయము చేయువాడు కాడు. మీరు చేసిన పనులను, తోడి సోదరులకు మీరొనర్చిన, ఒనర్చుచున్న సహాయముల ద్వారా ఆయనయందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మరచిపోడు.
11. అయినను మీలో ఒక్కొక్కడు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరివరకు ప్రదర్శింపవలెనని మేము కోరుచున్నాము.
12. మీరు సోమరిపోతులు కారాదు. అంతేకాక, విశ్వాసముతోను, ఓర్పుతోను దేవుని వాగ్దానములకు వారసులగువారిని మీరు అనుసరింపుడు.
దేవుని దృఢవాగ్దానము
13. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినపుడు, తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటె అధికుడు మరియొకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ యొనర్చెను.
14. ”నేను నిన్ను దీవించి, నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దాన మొనర్చుచున్నాను” అని దేవుడు చెప్పెను.
15. అబ్రహాము చాల ఓర్పుగల వాడగుట వలన, దేవుని వాగ్దానఫలమును అతడు పొందెను.
16. సర్వసాధారణముగా మానవులు ఒక ప్రతిజ్ఞ చేయునపుడు తమకంటె ఉత్తమమగు నామమును ఉపయోగించుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును.
17. అటులనే తన వాగ్దానఫలమును పొందబోవువారితో, తన ఉద్దేశములో ఎట్టి మార్పుకలుగబోదని స్పష్టముచేయ దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణమును కూడ జోడించెను.
18. కావున ఈ రెండు విషయములు మార్పులేనివి. ఇవి దేవుడు అసత్యమాడజాలని విషయములు. కనుక శరణాగతులమైన మనము, మన ముందుంచబడిన ఈ నిరీక్షణను దృఢముగ నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సహింపబడుచున్నాము.
19. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడయొక్క లంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయములోనికి చొచ్చుకొనిపోవును.
20. మన కొరకై, మన కంటె ముందే యేసు అచట ప్రవేశించెను. ఆయన మెల్కీసెదెకు యాజకక్రమమున, శాశ్వతముగ ప్రధానయాజకుడయ్యెను.