సహచరులకై అర్పణ

16 1. ఇక దేవుని ప్రజలకు సాయపడు విష యము: గలతీయలోని క్రైస్తవ సంఘములను నేను ఏమి చేయుమని చెప్పితినో మీరు అది చేయవలెను.

2. వారములో మొదటి రోజున ప్రతివ్యక్తియు తాను సంపా దించిన దానికి అనుగుణముగ కొంతధనమును ప్రక్కన పెట్టి దాచిఉంచవలెను. అటులైనచో నేను వచ్చినప్పుడు డబ్బు ప్రోగుజేయవలసిన అవసరము ఉండదు.

3. నేను వచ్చిన పిదప మీ ఆమోదమును పొందిన వ్యక్తులకు పరిచయపత్రముతో మీ దానములను ఇచ్చి యెరూషలేమునకు పంపుదును.

4. నేనును పోవుట మంచిదనిపించినచో వారు నావెంట వత్తురు.

పౌలు ఆలోచనలు

5. మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళ ఉద్దేశించుచున్నాను గనుక, మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళినపుడు మీయొద్దకు వచ్చెదను.

6. మీతో కొంతకాలము గడపగలననుకొనుచున్నాను. ఒకవేళ చలికాలమంతయు అచటనే  ఉందునేమో. తరువాత నేను పోవలసిన ప్రదేశమునకు పయనించుటలో మీరు తోడ్పడ వచ్చును.

7. మార్గమధ్యమున మిమ్ము చూచి, వెంటనే దాటిపోవుట నాకు ఇష్టములేదు. ప్రభువు అనుగ్రహించినచో మీతో కొంతకాలము గడపగలనను కొనుచున్నాను.

8. పెంతెకోస్తు దినము వరకు ఎఫెసులోనే గడిపెదను.

9. పెక్కు మంది విరోధులున్నను సముచితమగు కృషిసలుపుటకు ఇక్కడ ఎంతయో అవకాశము వున్నది. దానికి తగిన విశాలమైన తలుపు నా కొరకు తెరువబడి వున్నది.

10. తిమోతి అటు వచ్చినచో అతడు మీతో నిర్భయముగ సంచరించునట్లు చూడుడు. అతడును నావలెనే ప్రభువుకొరకు కృషి సలుపుచున్నాడు.

11. ఎవరును అతనిని అవమానింపరాదు. అతడు నన్నుచేరుకొనుటకై ప్రశాంతముగ తన ప్రయాణమును సాగించుకొనుటకు మీరు అతనికి సాయపడవలెను. సోదరులతో పాటు అతనికొరకై నేను ఎదురుచూచు చున్నాను.

12. సోదరుడగు అపొల్లో విషయము: ఇతర సోదరులతోపాటు అతడును మిమ్ము చూడ బోవలెననిన పెక్కుమార్లు అతనిని నేను ప్రోత్సహించితిని. కాని, ఇప్పుడే బయలుదేరుట అతనికి ఏ మాత్రము ఇష్టము లేదు. సరియైన అవకాశము లభించినపుడు అతడు రాగలడు.

తుది పలుకులు

13. జాగరూకులై ఉండుడు. విశ్వాసమున దృఢముగ ఉండుడు. ధైర్యము కలిగి బలవంతులై ఉండుడు.

14. ప్రేమపూర్వకముగ అన్ని పనులు చేయుడు.

15. స్తెఫాను, అతని కుటుంబము మీకు తెలిసినదే. అకాయియలో వారే మొదట క్రీస్తును స్వీకరించిరి. దేవుని ప్రజల సేవకు వారు తమను అర్పించు కొనిరి.

16. సోదరులారా! అట్టి వారికిని, వారితో పాటు నిష్ఠగా సేవచేయువారి నాయకత్వమునకు మీరు లోబడియుండుడని నేను మిమ్ము అర్థించుచున్నాను.

17. స్తెఫానా, ఫోర్తునాతు, అకయికూసు రాకడ నాకు ఆనందదాయకము. మీరు లేని లోపమును వారు తీర్చి, 18. మిమ్ము ఆనందింపజేసినట్లే నన్నును ఆనందింపజేసిరి. ఇట్టివారు గుర్తింపదగినవారు.

19. ఆసియా మండలములోని క్రీస్తు సంఘ ములు మీకు తమ శుభాకాంక్షలను పంపుచున్నవి. అక్విల, ప్రిస్కా, వారి యింటియందు సమావేశమగు దైవసంఘము మీకు ప్రభువునందు హృదయపూర్వక శుభాకాంక్షలు అందించుచున్నారు.

20. ఇచ్చ సోదరులందరు మీకు శుభాకాంక్షలను అందించు చున్నారు. సోదరులవలె మీరు ఒకరిని ఒకరు పవిత్ర మైన ముద్దుపెట్టుకొని శుభాకాంక్షలను తెలుపుకొనుడు.

21. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభవచనములు వ్రాయుచున్నాను.

22.  ప్రభువును ప్రేమింపనివాడు శపింప బడునుగాక! మరనాత1

23. యేసుప్రభువు అనుగ్రహము మీతో ఉండునుగాక!

24. క్రీస్తు యేసునందు నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక! ఆమెన్‌.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము