1 1. యేసుక్రీస్తు అపోస్తలుడగు పేతురు, పొంతు, గలతీయ, కప్పదోసియ, ఆసియా, బితూనియాల యందు చెదరిపోయి, వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది: 2. పితయగు దేవుని సంకల్ప ఫలముగనే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసు క్రీస్తునకు విధేయులగుటకును,ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మవలన పవిత్రులనుచేసెను.

               మీకు కృపయు, సమాధానము లభించునుగాక!

సజీవమగు నిరీక్షణ

3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! మృతులలోనుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థాన మొనరించి, దాని మూలమున మనకు నూత్న జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును.

4. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీకొరకై పరలోకమున  భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు.

5. మీరు యుగాంతమున ప్రకటింపబడెడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసముద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే.

6. మీరు ఎదుర్కొనవలసిన పలువిధములగు పరీక్షలవలన తాత్కాలికముగ మీకు బాధ కలిగినను, దీనిని గూర్చి సంతోషింపుడు.

7. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడ అగ్నిచే పరీక్షింపబడును కదా! అట్లే బంగారముకంటె ఎంతో విలువైన మీ విశ్వాసము కూడ పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్ఠలును, మహిమయు కలుగును.

8.  మీరు ఆయనను చూడకలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు.వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు.

9. ఏలయన, మీ విశ్వాసమునకు ఫలితముగ మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు.

10. ఈ రక్షణను గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగ అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చెడి ఈ అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగ చెప్పిరి.

11. క్రీస్తు అనుభవింపవలసిన కష్టములను, తదుపరి మహిమనుగూర్చి వారు ప్రవచించినపుడు వారియందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించెనో వారు తెలిసికొన ప్రయత్నించిరి.

12. మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే గదా! అట్లు ప్రబోధించునపుడే  దేవుడు వారికి  ఒక విషయము స్పష్టపరచెను. ప్రవక్తల కృషి మీకొరకేగాని వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదిత మొనర్చెను. సువార్తను గొనివచ్చిన దూతలుమీకీ సత్యములను బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లొనర్చిరి. ఈ సత్యములనే దేవదూతలు సహితము చూడగోరిరి.

పవిత్ర జీవమునకై పిలుపు

13. కనుక కృషియొనర్ప సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు. క్రీస్తుయేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు.

14. దేవునకు విధేయులై ఉండుడు. మీరు అజ్ఞానదశలో ఉన్నపుడు మీకు కొన్ని కోరికలు ఉండెడివి గదా! ఆ కోరికలకు బానిసలు కాకుండుడు.

15. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు. కనుక మీ ప్రవర్తనయందు మీరును పవిత్రులై ఉండుడు.

16. ”నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులై ఉండుడు”.

17. దేవుని ప్రార్థించునపుడు మీరు ఆయనను ‘తండ్రీ’ అని పిలిచెదరు. వారివారి ప్రవర్తనలను బట్టిదేవుడు అందరికి పక్షపాతములేక తీర్పుచెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయనయందు భయభక్తులతో గడుపుడు.

18. ఏలయన, మీ పూర్వులనుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితమునుండి మీకు విముక్తి లభింప చేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియును.  అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారములవంటిది కాదు.

19. నిష్కళంకమైన గొఱ్ఱెపిల్లవంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి.

20. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుదికాలమున విదితమొనర్చబడెను.

21. దేవుడు ఆయనను మృతులలోనుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు. కనుకనే మీ విశ్వాసమును, నమ్మకమును, దేవునియందు స్థిరపడినవి.

22. ఇప్పుడు సత్యమునకు విధేయులై మిమ్ము మీరు శుద్ధి ఒనర్చుకొనినారు. తోడి విశ్వాసులపై  నిజమైన ప్రేమను కలిగియున్నారు. కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగ గాఢముగ ప్రేమింపుడు.

23. ఏలయన, క్షయమగు బీజము ద్వారాగాక, సజీవమును, శాశ్వతమును అగు దేవునివాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మము నొందితిరి. అమరుడగు పితకు సంతానమైతిరి.

24. ”మానవులందరు గడ్డిమొక్కలవంటివారు; వారి వైభవము గడ్డిపూలవంటిది; గడ్డి నశించును, పూలురాలిపోవును,

25. కాని దేవుని వాక్కు ఎల్లప్పుడును నిలుచును” సువార్త మీకు అందించిన సందేశము ఇదియే.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము