అబ్రహాము మాతృక
4 1. అయినచో మనజాతికి మానవ సంబంధి అయిన, మూలపురుషుడగు అబ్రహామును గూర్చి ఏమి కనుగొనెనని చెప్పుదము?1
2. తన క్రియల వలన అతడు నీతి మంతుడు కావింపబడినచో, పొగడుకొనుటకు అతనికి కారణము ఉండెడిది. కాని దేవుని ఎదుట పొగడు కొనలేడు.
3. ”అబ్రహాము దేవుని విశ్వసించెను.
అది అతనికి నీతిగా ఎంచబడెను”
అని లేఖనము చెప్పుచున్నది.
4. పని చేయువానికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింప బడదు. అది వాని కష్టార్జితము.
5. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా యెంచబడుచున్నది.
6. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగ చేయబడువాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు.
7. ”ఎవరి అతిక్రమములు దేవునిచే
క్షమింపబడినవో, ఎవరి పాపములు
పరిహరింపబడినవో, వారు ధన్యులు.
8. ఎవని పాపములు ప్రభువు లెక్కపెట్టడో
అతడు ధన్యుడు!”
9. ఈ ధన్యవచనము సున్నతి పొందిన వారికి మాత్రమేనా? సున్నతి పొందనివారికి కూడ చెందునా? ఏలయన, అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుచున్నది గదా!
10. అది ఎప్పుడు ఎంచ బడెను? అబ్రహాము సున్నతిపొందక పూర్వమా? తరువాతనా? తరువాత కాదు, ముందే.
11. సున్నతి పొందక పూర్వమే తాను విశ్వాసము వలన నీతిమంతు నిగా అంగీకరింపబడెనని నిరూపించుటకుగాను అతడు సున్నతిని పొందెను. కనుక, సున్నతిని పొందకయే దేవుని విశ్వసించి ఆయనచే నీతిమంతులుగ అంగీకరింపబడిన వారందరికిని అబ్రహాము తండ్రియగునట్లుగా ఉద్దేశింపబడెను.
12. సున్నతి పొందిన వారికినీ అతడు తండ్రియే. ఏలయన, వారు సున్నతి పొందుటచేత మాత్రమేకాదు, మన తండ్రియగు అబ్రహాము సున్నతిని పొందుటకు పూర్వము ఎట్టి విశ్వాసజీవితమును గడిపెనో అట్టి విశ్వాసమయమగు జీవితమునే వారును గడిపిరి.
దేవుని వాగ్దానము విశ్వాసము ద్వారా పొందనగును
13. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము వుండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను.
14. ఏలయన, దేవుని వాగ్దాన ఫలము ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే ఈయబడవలసియున్న యెడల మానవుని విశ్వాసము నిష్ప్రయోజనమగును, దేవుని వాగ్దానము నిష్ఫలమగును.
15. ధర్మ శాస్త్రము దేవుని ఆగ్రహమును కొని తెచ్చును. కాని ధర్మశాస్త్రమే లేనిచోట దాని ఉల్లంఘన ప్రస్తావనయేలేదుకదా!
16. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వా సముపై ఆధారపడియుండెను. అబ్రహాము సంతతి వారందరికిని దేవునిచే ఒసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడియున్నది. అది ధర్మశాస్త్రము నకు విధేయులగు వారికి మాత్రమే కాదు. అబ్రహాము వలె విశ్వసించువారికి కూడ అది వర్తించును. ఏలయన, అబ్రహాము మనకు అందరికి ఆధ్యాత్మికమగు తండ్రి గదా!
17. ”అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసితిని”
అని వ్రాయబడియున్నది. కనుక దేవునిఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయనయందు విశ్వాస ముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యమునుండి సృష్టిని కలిగించును.
18. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయెను. ”నీ సంతానము ఆకాశము నందలి నక్షత్రముల వలె ఉండును” అని చెప్పబడినది.
19. అతడు దాదాపు నూరేండ్ల ముదుసలి. మృత తుల్యమైన తన శరీరమును తలంచుకొనినపుడును, సారా గొడ్రాలు అని తలచినపుడును అతని విశ్వాసము సన్నగిల లేదు.
20. అతడు దేవుని వాగ్దానమును అనుమానింప లేదు. దేవుని స్తుతించి తన విశ్వాసము నందు దృఢపడెను.
21. ఏలయన, దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకముండెను.
22. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రాహాము ”దేవునిచే నీతిమంతుడుగా అంగీ కరింపబడెను.”
23. కాని, ”అతడు నీతిమంతుడుగా అంగీకరింపబడెను” అను మాటలు అతనికొక్కడి కొరకే వ్రాయబడలేదు. 24. నీతిమంతులుగ అంగీకరింప బడవలసిన మనలనుగూర్చి కూడ అవి వ్రాయ బడినవి. ఏలయన, మన ప్రభువగు యేసును మృతు లలోనుండి లేవనెత్తిన ఆయనయందు మనకు విశ్వాస మున్నది.
25. మన పాపమునకుగాను ఆయన మరణ మునకు అప్పగించబడెను. మనలను దేవునకు అంగీకారయోగ్యులముగ ఒనర్చుటకుగాను ఆయన మరల లేవనెత్తబడెను.