దేవాలయము చేరువలోని రెండు కట్టడములు

42 1. అంతట ఆ మనుష్యుడు నన్ను  ఉత్తరము వైపునుండి వెలుపలి ఆవరణములోనికి కొనిపోయి మందిరమునకు ఉత్తరమున వేరుగానున్న భవనము లోనికి తీసుకొనిపోయెను. అది ఉత్తరము వైపుననున్న కట్టడమునకు ఎదురుగానున్నది.

2. వెలుపలకు దాని పొడవు ఉత్తరమువైపున వందమూరలు కలిగి, వెడల్పు ఏబది మూరలుండెను.

3. అది ఒక వైపున దేవాలయము ప్రక్కనున్న ఇరువది మూరల ఖాళీస్థలమును ఆనుకొని యుండెను. మరియొక  ప్రక్కన వెలుపలి ఆవరణములో రాళ్ళుపరచిన తావునానుకొని యుండెను. అది మూడు అంతస్థులుగా నిర్మింపబడెను. ఒక్కొక్క అంతస్తు దాని క్రింది అంతస్తుకంటె వెనుకకు వచ్చునట్లు నిర్మింప బడెను.

4. ఈ కట్టడమునకు ఉత్తరదిక్కున ఒకవసారా కలదు. దాని పొడవు వందమూరలు, వెడల్పు పది మూరలు. దాని తలుపులు ఉత్తరదిక్కుననే గలవు.

5. ఆ కట్టడము పై అంతస్తులోని గదులుమధ్య, క్రింది అంతస్తులలోని గదులకంటే ఇరుకుగానుండెను. వానిని వెనుక ప్రక్కకు జరుగునట్లుగా నిర్మించిరి.

6. ఆ మూడు అంతస్తులలోని గదులును కప్పులపై నిర్మింప బడెను. ఆవరణములోని ఇతర కట్టడములకువలె  వానికి స్తంభములు లేవు.

7-8. ఆ భవనము క్రింది అంతస్తులోని వెలుపలి గోడ ఏబదిమూరల పొడవున గ్టిగానుండెను. అది ఆ కట్టడములో సగము పొడవుండెను. మిగిలిన ఏబదిమూరల దూరములో గదులు నిర్మింపబడెను. మీది విభాగములో కట్టడము ఎంత పొడవుండెనో అంతవరకు గదులుండెను.

9-10. ఈ గదుల క్రింద కట్టడమునకు తూర్పుదిక్కున వెలుపలి ఆవరణము లోనికి ద్వారముండెను. ఇచటనే ఆవరణపు గోడకూడ ప్రారంభమయ్యెను.

దేవాలయమునకు దక్షిణదిక్కునగూడ ఇటువిం కట్టడమే కలదు. అది దేవాలయమునకు  పశ్చిమమున నున్న కట్టడమునకు దగ్గరగానుండెను. దాని గదులకు ముందట ఉత్తరదిక్కునవలె దారి కలదు.

11. దాని కొలతలు, ఆకారము, ద్వారములు ఉత్తర దిక్కునవలె నుండెను.

12. దేవళమునకు దక్షిణమున నున్న గదుల క్రింద ఒక ద్వారము కలదు. అచటనే తూర్పుదిక్కున గోడ ప్రారంభమయ్యెను.

13. ఆ నరుడు నాతో ఇట్లనెను: ”ఈ రెండు కట్టడములును పవిత్రమైనవి. దేవుని సన్నిధిలోనికి పోవు యాజకులు వానిలో పవిత్రమైన నైవేద్యములను భుజింతురు. ఆ గదులు పవిత్రమైనవి కనుక యాజకులు పరమ పవిత్రవస్తువులను, అనగా ధాన్యబలులను,  పాపపరిహారబలి మాంసమును, ప్రాయశ్చిత్తబలి మాంసమును వానిలోనుంచుదురు. ఆ స్థలము పరమ పవిత్రము.

14. యాజకులు దేవళములో అర్చన చేసినపిదప వెలుపలి ఆవరణములోనికి పోగోరెదరేని, అర్చన సమయములో తాము ధరించిన పవిత్ర వస్త్ర ములను ఈ గదులలోనుంచవలెను. అవి నివేదింప బడినవి కనుక, ప్రజల సంబంధమైన దేనినైనను వారు ముట్టునపుడు వారు వేరు వస్త్రములు ధరించు కొనవలెను.

దేవాలయప్రదేశపు కొలతలు

15. అతడు దేవాలయము లోపలి భాగమును కొలిచి ముగించిన పిదప తూర్పు ద్వారముగుండ నన్ను బయికికొనిపోయి వెలుపలిభాగమును కొలిచెను.

16. అతడు తన కొలబద్దను తీసికొని తూర్పుభాగమును కొలువగా అది ఐదువందల మూర లుండెను.  

17-19. తరువాత అతడు ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిక్కులందు కొలిచెను. అన్ని ప్రక్కలందును ఐదువందల మూరలే ఉండెను.

20. కనుక ఐదు వందల మూరల నలుచదరమును దానిచుట్టును గోడయు కలదు. ఆ గోడ సాధారణ స్థలమునుండి నివేదితస్థలమును ప్రత్యేకపరుచుచుండెను.