విజయగీతము

26 1.      ఆ దినమున యూదాలో

                              ఈ పాట పాడుదురు:

                              ”మాకొక బలమైనపట్టణము కలదు. 

                              ప్రభువే దాని ప్రాకారములను,

                              బురుజులను కాపాడును.

2.           నగరద్వారములు తెరువుడు!

               సత్యమును ఆచరించు నీతిగల జాతి

               లోనికి ప్రవేశించునుగాక!

3.           ప్రభూ! స్థిరమనస్సుతో నిన్ను నమ్మువారికి

               నీవు పరిపూర్ణ శాంతినొసగుదువు.

4.           మీరు సదా ప్రభువును నమ్ముడు.

               ఆయన మనకు శాశ్వతమైన రక్షణదుర్గము.

5.           ఆయన ఉన్నత భవనములతో ఒప్పు నగరమున

               వసించువారిని మన్నుగరపించెను.

               ఆ నగరమును కూలద్రోసి మ్టిలోకలిపెను.

6.           పీడనకు గురియైన దీనాత్ములు

               ఆ నగరమును తమ కాళ్ళతో త్రొక్కుదురు.”

కీర్తనము

7.            ప్రభూ! నీవు సజ్జనుల త్రోవను

               సమతలమైనదిగా చేయుదువు.

               నీతిమంతుల మార్గము నునుపుగా ఉండును.

8.           మేము నీ ఆజ్ఞలు పాించి నిన్నునమ్మితిమి.

               నీ నామమును, నీ స్మరణమును మాత్రమే

               మేము కోరుకొందుము.

9.           రేయి పూర్ణహృదయముతో

               నేను నిన్ను అభిలషించితిని.

               వేకువవేళ పూర్ణమనస్సుతో నిన్ను ఆశించితిని.

               లోకములో నీ విధులు చెల్లుబడియైనపుడు

               భూలోకవాసులు

               నీ న్యాయమును అర్థము చేసికొందురు.

10.         నీవు దుష్టులకు కరుణచూపినను

               వారు న్యాయమును గ్రహింపజాలరు.

               నీతిమంతుల దేశమునగూడ

               నీ మాహాత్మ్యమును అర్ధము చేసుకొనక

               వారు దుష్క్రియలు చేయుదురు.

11.           నీవు దుర్మార్గులను శిక్షించుటకు చేతులెత్తితివి.

               కాని, వారు ఆ విషయమును గ్రహింపరైరి.

               ప్రభూ! వారు సిగ్గుచెందుదురుగాక!

               నీవు నిర్ణయించిన శిక్షను అనుభవింతురుగాక!

               నీ జనులపై నీకుగల అపారప్రేమను

               అర్థము చేసికొందురుగాక!

12.          ప్రభూ! నీవు మాకు శాంతి దయచేయుదువు.     

               మా క్రియలకు తగిన ప్రతిఫలమొసగుదువు.

13.          మా ప్రభువైన దేవా!

               నీవుగాక ఇతర ప్రభువులును మమ్మేలిరి.

               కాని మేము నిన్ను మాత్రమే

               ప్రభునిగా అంగీకరించితిమి.

14.          చచ్చినవారు మరల బ్రతుకరు.

               వారి ప్రేతములు మరల జీవముతో లేవవు.

               నీవు వారిని శిక్షించి సర్వనాశనము చేసితివి.

               నేలమీద వారిపేరు కూడ

               విన్పింపకుండపోయినది.

15.          ప్రభూ! నీవు నీ ప్రజలను విస్తరింపజేసితివి.

               వారి సరిహద్దులు పొడిగించితివి.

               దీనివలన నీకు కీర్తి కలిగెను.

16.          ప్రభూ! వారు ఆపదలలో నున్నప్పుడు

               నీకొరకు గాలించితిరి. నీవు శిక్షించినను,

               వారు నీకు విశేషముగా దీనప్రార్ధనలు చేసిరి.

17.          గర్భవతి ప్రసవకాలమున వేదనతో మూల్గినట్లే

               మేమును నీ  సమక్షమున  బాధతో మూల్గితిమి.

18.          మేము గర్భముదాల్చి

               ప్రసవవేదనను అనుభవించితిమి.

               కాని దేనిని ప్రసవింపజాలమైతిమి,

               మేము మా దేశమునక్టిె

               విజయమును చేకూర్చిపెట్టలేదు.

               మేము సాధించినదేమియు లేదు.

19.          మృతులైన నీ ప్రజలు మరల జీవింతురు.

               వారి మృతశరీరములు జీవముతో లేచును.

               మ్టిలో కలిసిపోయిన వారందరు మరల లేచి,

               సంతోషముతో పాటలు పాడుదురు.

               తళతళలాడు మంచు, నేలకు జీవమొసగినట్లే

               చిరకాలము క్రితమే చనిపోయిన వారికి

               ప్రభువు ప్రాణమొసగును.

దైవోక్తి

20.        నా ప్రజలారా! మీరు మీ ఇండ్లలోనికి వెళ్ళి

               తలుపులుమూసికొనుడు.

               ప్రభువు కోపము చల్లారువరకును

               కొంతకాలముపాటు అచట దాగుకొనుడు.

21.          అదిగో! భూలోకవాసులు చేసిన

               పాపములనుగాంచి, వారిని దండించుటకుగాను

               ప్రభువు తన నివాసమునుండి

               వేంచేయుచున్నాడు చూడుడు.

               భూమిమీద రహస్యముగా జరిగిన

               హత్యలన్నియు వెల్లడియగును,

               ఎవరెవరు మృతులైరో తెలిసిపోవును.