5 1. యెరూషలేమూ!

                              నీవు విచారవస్త్రములను తొలగించి

                              దైవవైభవమనెడు

                              శాశ్వత సౌందర్యమును ధరింపుము.

2.           నీవు దేవుని నీతివస్త్రము కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమను

               కిరీటమును తలపై పెట్టుకొనుము.

3.           దేవుడు ఆకాశము క్రింద నరులకెల్ల

               నీ సౌందర్యవైభవమును చూపించును.

4.           నీ నీతినుండి శాంతిని, నీ భక్తినుండి కీర్తిని

               బడయుదానవని ఆయన

               నీకు శాశ్వతముగా పేరు పెట్టును.

5.           యెరూషలేమూ! నీవు లేచి కొండపై

               నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను

               తూర్పు పడమరలనుండి

               కొనివచ్చుటను చూడుము.

               ప్రభువు తమను జ్ఞప్తికి తెచ్చుకొనెనని

               వారు ప్రమోదము చెందుదురు.

6.           పూర్వము శత్రువులు నీ బిడ్డలను

               నడిపించుకొని పోగా,

               వారు కాలినడకన వెళ్ళిపోయిరి.

               కాని దేవుడిప్పుడు వారిని

               నీ చెంతకు తీసికొనివచ్చుచున్నాడు.

               రాజవైభవములతో జనులు వారిని

               మోసికొని వచ్చుచున్నారు. 

7.            యిస్రాయేలీయులు దైవమహిమతో

               సురక్షితముగా తిరిగివచ్చుటకై

               ఉన్నతపర్వతములను, శాశ్వత నగరములను

               చదును చేయవలెననియు, లోయలను

               పూడ్చి నేలనుసమతలము చేయవలెననియు

               దేవుడు ఆజ్ఞాపించెను.

8.           దేవుని ఆనతిపై సుగంధవృక్షములతో

               కూడిన అడవులు పెంపుజెంది

               యిస్రాయేలీయులకు నీడనిచ్చును. 

9.           దేవుడు యిస్రాలియేలీయులను

               తొడ్కొని వచ్చును.

               ఆయన కరుణయు, నీతియు

               వారిని నడిపించుకొని వచ్చును.

               ఆయన మహిమాన్విత కాంతి

               వారినింయుండును.

               వారు మహానందముతో తిరిగివత్తురు.