రాజును న్యాయాధిపతియునైన ప్రభువు

96 1.     ప్రభువు మీద క్రొత్తపాట పాడుడు. విశ్వధాత్రీ!

                              నీవు ప్రభువుమీద పాట పాడుము.

2.           ప్రభువుపైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు.

3.           ఆయన కీర్తిని ఎల్లజాతులకు తెలియజేయుడు.

               ఆయన మహాకార్యములను

               ఎల్ల జనులకు విశదము చేయుడు.

4.           ప్రభువు మహామహుడు,

               గొప్పగా స్తుతింపదగినవాడు.

               దైవములందరికంటెను

               ఎక్కువగా గౌరవింపదగినవాడు.

5.           అన్యజాతుల దైవములు

               అందరును వ్టి విగ్రహములు.

               కాని ప్రభువు ఆకసమును చేసెను.

6.           తేజస్సును, ప్రాభవమును

               ఆయనయెదుట బంటులవలె నిల్చును.

               శక్తియు, సౌందర్యమును

               ఆయన మందిరమును నింపును.

7.            సకలజాతులకు చెందిన నిఖిల వంశజులారా!

               మీరు ప్రభువును వినుతింపుడు.

               కీర్తియు బలమునుగల ప్రభువును కొనియాడుడు.

8.           ప్రభువు మహిమాన్వితనామమును స్తుతింపుడు. సమర్పణలతో ఆయన దేవాలయములోనికి రండు

9.           పవిత్రవస్త్రములు తాల్చి ప్రభువును వందింపుడు.

               విశ్వధాత్రీ ! అతనిని చూచి గడగడ వణకుము.

10.         ”ప్రభువు రాజు, అతడు నేలను

               కదలకుండునట్లు పదిలపరచెను.

               అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పుచెప్పును” అని మీరు అన్యజాతులతో నుడువుడు.

11.           ప్రభువు విజయము చేయుటను గాంచి

               ఆకాశము ఆనందించునుగాక!

               భూమి హర్షించునుగాక!

               సాగరమును, దానిలోని ప్రాణులును

               హోరుమని నినదించునుగాక !

12.          పొలములును వానిలోని పైరులును

               సంతసించునుగాక!

               అరణ్యములలోని వృక్షములు

               ఆనందనాదము చేయునుగాక!

13.          ప్రభువు లోకమునకు తీర్పుతీర్చుటకు వేంచేయును

               ఆయన న్యాయముగను, నిష్పక్షపాతముగను

               లోకములోని జాతులకు తీర్పుతీర్చును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము