ప్రవాసవాసుల కొరకు

ఉద్దేశింపబడిన రచనలు

బబులోనియా కాడి

27 1. యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైన తొలిరోజులలో ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను: 2. ”నీవు తోలుపలుపు లను, కాడిమానును తయారుచేసికొని, వానిని నీ మెడపై కట్టుకొనుము.

3. అటుపిమ్మట ఎదోము, మోవాబు, అమ్మోను, తూరు, సీదోను దేశముల రాజులకు ఈ వార్తను పంపుము. సిద్కియా రాజును సందర్శించుటకు యెరూషలేమునకు వచ్చిన ఆ రాజుల దూతలద్వారా ఈ కబురు పంపుము.

4. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఆ దూతలు తమ రాజులకు ఈ వృత్తాంత మును తెలియజేయ ఆజ్ఞాపించుచున్నాడని చెప్పుము.

5. ”నేను నా మహా బలముతోను, చాచిన బాహువు తోను భూమిని సృజించితిని. భూమిని దానిమీద సంచరించు నరులను, జంతువులను సృజించితిని. నేను దానిని నా యిష్టము వచ్చిన వారికిత్తును.

6. నేనిపుడు ఈ దేశములన్నిని నా సేవకుడును బబులోనియారాజైన నెబుకద్నెసరునకు ఇచ్చివేసితిని. వన్యమృగములు కూడ అతనిని సేవించునట్లు చేసితిని.

7. ఎల్ల జాతులును అతనికిని, అతని పుత్రపౌత్రు లకును ఊడిగము చేయును. అటుతరువాత అతని దేశము కూలిపోవును. అప్పుడతని దేశము గొప్ప జాతులకును, మహారాజులకును ఊడిగము చేయును.

8. ”ఏ దేశమైన, ఏ జాతియైన బబులోనియా రాజైన నెబుకద్నెసరునకు ఊడిగముచేసి అతనికి లొంగి యుండదేని, నేను వానిని పోరు, కరువు, అంటు రోగములతో శిక్షింతును. ఆ రాజుచే వానిని నాశనము చేయింతును.

9. మీ మట్టుకు మీరు మీ ప్రవక్తలు, జ్యోతిష్కులు, కలలు కనువారు, సోదె చెప్పువారు, మాంత్రికులు మొదలైనవారి పలుకులు ఆలింపకుడు. వారు బబులోనియా రాజు పాలనమునకు లొంగ వలదు అని మీతో చెప్పుదురు.

10. మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా బహిష్కరించునట్లును, మిమ్ములను నేను వెళ్ళగొట్టు నట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచన ములు మీకు ప్రకింతురు.

11. ఏ ప్రజలైనను బబులోనియా రాజు పాలనమునకు లొంగి అతనికి ఊడిగము చేయుదురేని, నేను వారిని తమ సొంత దేశముననే మననిత్తును. వారు తమ సొంత దేశమున సేద్యము చేసికొని అచటనే వసింతురు.

12. యూదా రాజైన సిద్కియాకు నేను ఈ సంగతినే చెప్పితిని. ”ప్రభువు పలుకులివి. నీవు బబులోనియారాజునకు లొంగుము. అతనికిని, అతని ప్రజలకును సేవలుచేసి బ్రతికిపొమ్ము.

13. నీవును, నీ ప్రజలును పోరు, ఆకలి, అంటురోగములవలన చావనేల? బబులోనియా రాజునకు లొంగని జాతుల న్నికిని ఈ  గతియేపట్టునని ప్రభువు పలికెను.

14. ఆ రాజునకు లొంగవలదని చెప్పు ప్రవక్తల మాటలు నీవు నమ్మవలదు. వారు నిన్ను మోసగించుచున్నారు.

15. నేను వారిని పంపలేదు. వారు నా పేరుమీదుగా బొంకులాడుచున్నారు. నేను మిమ్మచినుండి వెళ్ళ గొట్టుదును. మీరును, మీతో కల్లలాడు ప్రవక్తలు కూడ చత్తురు.”

16. అటుపిమ్మట నేను యాజకులకును, ప్రజల కును ప్రభువు వాక్కులిట్లు తెలియజేసితిని. ”మీరు పవిత్రపాత్రములను శీఘ్రమే బబులోనియానుండి కొనివత్తురని చెప్పు ప్రవక్తల మాటలను నమ్మకుడు. వారు మిమ్ము మోసగించుచున్నారు.

17. వారి మాటలు నమ్మకుడు. మీరు బబులోనియా రాజునకు లొంగి బ్రతికిపొండు. ఈ నగరము పాడుబడిపోనేల?

18. వారు ప్రవక్తలగుదురేని, వారికి నా సందేశము విన్పించియుండెనేని దేవాలయమునను, రాజ ప్రాసా దమునను మిగిలియున్న పవిత్ర పాత్రములను, శత్రువులు బబులోనియాకు కొనిపోరాదని నాకు మనవి చేయుదురుగాక! సైన్యములకు అధిపతినైన నన్ను బ్రతిమాలుకొందురుగాక!

19. యెహోయాకీము కుమారుడును, యూదా రాజగు యెహోయాకీనును, యూదా యెరూషలేములందలి ప్రముఖవ్యక్తులను బబులోనియా రాజు తన దేశమునకు బందీలనుగా కొనిపోయెనుగదా!

20. కాని అతడు స్తంభములను, ఇత్తడిత్టొిని, బండ్లను, మిగిలిన దేవాలయ పాత్రము లను కొనిపోలేదు.

21. యిస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభుడనగు నేను దేవాలయమునను, రాజప్రాసాదమునను ఇంకను మిగిలియున్న పవిత్ర పాత్రములను గూర్చి చెప్పు మాటలు వినుడు.

22. వానిని బబులోనియాకు తీసి కొనిపోవుదురు. నేను వానిని జ్ఞప్తికి తెచ్చుకొనువరకును అవి అచటనే ఉండును. నేను వానిని గుర్తుకు తెచ్చు కొనిన పిదప,  వానిని మరల ఈ తావునకు గొని వత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”