విమోచితుల స్తుతిగానము

14 1. అంతట నేను అటుచూడగా, సియోను పర్వతముపై నిలిచి ఉన్న గొఱ్ఱెపిల్ల గోచరించెను. ఆయనతోపాటు నూట నలువది నాలుగువేలమంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్ళపై ఆయన పేరును, ఆయన తండ్రి పేరును ఉండెను.

2. అంతట దివి నుండి వెలువడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వనిని పోలిఉండెను, పెద్ద ఉరు మువలె ఉండెను. నేను వినిన ఆ స్వరము మీటిన వీణానాదము వలె ఉండెను.

3. వారు సింహాసనము వంకకు తిరిగి, నాలుగుజీవులకును, పెద్దలకును ఎదురుగా నిలిచి ఒక క్రొత్తపాటను పాడిరి. భువినుండి విమోచనము నొందిన ఆ నూటనలువది నాలుగు వేలమంది ప్రజలు తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి.

4. తమను తాము స్త్రీ  సాంగత్యముతో అపవిత్రము కావించుకొననివారు. వారు అవివాహితులు. ఆ గొఱ్ఱెపిల్ల ఎటు పోయినవారు దానిని అనుసరింతురు. వారు మిగిలిన మానవాళినుండి విముక్తులైరి. దేవునికిని, గొఱ్ఱెపిల్లకును అర్పింపబడుటలో వారే ప్రథమ ఫలములు.

5. వారు ఎన్నడును అసత్య మాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు.

ముగ్గురు దేవదూతలు

6. అంతట మధ్యాకాశములో ఎగురుచున్న ఒక దేవదూతను చూచితిని. అతనియొద్ద భువియందలి ప్రజలకు-అన్ని జాతులకును, తెగలకును, అన్ని భాషా వర్గములకును – ప్రకింపబడవలసిన నిత్య సువార్త ఒకటి ఉండెను.

7. అతడు పెద్దగా ఇట్లు పలికెను: ”దేవునకు భయపడుడు. ఆయన మహిమను స్తుతింపుడు! ఏలయన, ఆయన మనుజులకు తీర్పుచెప్పుదినము ఆసన్నమైనది. దివిని, భువిని, సముద్రమును, నీటి ఊటలను సృష్టించిన ఆ దేవునిఎదుట భక్తితో వినమ్రులుకండు!”

8. అంత మరియొక దేవదూత అనగా రెండవ దూత అతని వెంబడివచ్చి ”అది పతనమయ్యెను! మహానగరమగు బబులోనియా కూలిపోయెను! జాతులన్నింటికి మహోద్రేకముతో కూడిన వ్యభిచారమను మద్యమును త్రాగించినది” అని పలుకుచుండెను.

9. అంతట మరియొక దేవదూత, మూడవది, వారిరువురిని అనుసరించెను. అది గంభీర స్వరముతో ఇట్లు పలికెను: ”ఆ జంతువునుగాని దాని విగ్రహమునుగాని పూజించి, దాని ముద్రను తన చేతిమీద గాని, నొసటి మీదగాని పొందువాడు, 10. దేవుని కోపము అను మద్యమును, తనంతట తాను త్రాగవలసివచ్చును. ఆ క్రోధమను  మద్యమును ఆగ్రహమను పాత్రలో తానే పోసికొనెనుగదా! ఇట్లు చేయువారు అందరును అగ్నిలోను, గంథకము నందును, పవిత్రు లగు దేవదూతల ఎదుటను, గొఱ్ఱెపిల్ల సమక్షమునను హింసింపబడుదురు.

11. వారిని హింసించు ఆ నిప్పు నుండి వెలువడు పొగ సదా పైకెగయుచునే ఉండును. ఆ మృగమునుగాని, దాని విగ్రహమునుగాని ఆరాధించిన వారికిని, దాని నామముద్రను ధరించిన వారికిని రాత్రిగాని, పగలు గాని విశ్రాంతి ఉండదు.”

12. దేవుని శాసనములకు విధేయులును, యేసునకు విశ్వాసపాత్రులు అగు పరిశుద్ధులు దీని కొరకై సహనమును వహింపవలెను.

13. అంతట నేను పరమునుండి ఒక దివ్య స్వరమును వింటిని. ”ఇప్పటినుండియు ప్రభువునందు మరణించువారు ధన్యులు అని వ్రాయుము” అని ఆ దివ్యవాణి పలికెను. ”నిజముగనే ధన్యులు. వారివారి శ్రమలనుండి వారు విశ్రాంతిని పొందుదురుగాక! ఏలయన, వారి కృషి ఫలితము వారి వెంటపోవును” అని ఆత్మ పలికెను.

పొలము పంట

14. అంతట నేను అటు చూడగ అటనొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్యకుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణకిరీటము ఉండెను. చేతి యందు వాడియైన కొడవలి ఒకటిఉండెను.

15. అంతలో దేవాలయమునుండి మరియొక దేవదూత వెలువడి మేఘారూఢునితో, ”ఇది తగిన సమయము. కోతకు పైరు సిద్ధముగ ఉన్నది. నీ కొడవలితో పైరు కోయుము” అని పలికెను.

16. వెంటనే మేఘా రూఢుడు తన కొడవలిని  భూమిపై  విసరగా, భూమిపై పైరు కోయబడెను.

17. అంతలోనే పరలోకమునందున్న ఆలయ మునుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడ ఒక వాడియైన కొడవలి ఉండెను.

18. అగ్నికి అధిపతియగు మరియొక దేవదూత బలిపీఠమునుండి వెలువడెను. చేత వాడియైన కొడవలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ”ద్రాక్ష పండ్లు పండినవి. భువియను ద్రాక్షతోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము” అని చెప్పెను.

19. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భువిపైకి విసరి భువిమీది ద్రాక్షలను కోసి, దేవుని మహాఆగ్రహమను యంత్రమునవేసెను.  

20. నగరమునకు వెలుపలనున్న యంత్రాగారములో ఆ ద్రాక్షపండ్లనుండి రసము తీయబడెను. అప్పుడు ఆ యంత్రమునుండి రెండువందల మైళ్ల పొడవున, గుఱ్ఱపు కళ్లెమంత ఎత్తున, రక్తము వరదైప్రవహించెను.