యెరూషలేము సంతానవతియగును

54 1.      ”గొడ్రాలవైయున్నదానా!

                              సంతసముతో పాటలు పాడుము.

                              ఎప్పుడును ప్రసవవేదన అనుభవింపనిదానా!

                              ఆనందముతో పాడుము.

                              కాపురముచేయు భార్యకంటెను

                              పరిత్యక్తయైన భార్యకు ఎక్కువమంది బిడ్డలు

                              కలుగుదురని ప్రభువు పలుకుచున్నాడు.

2.           నీవు వసించు గుడారమును విశాలము చేసికొనుము

               దాని తెరలను పెద్దవి జేసికొనుము.

               దాని త్రాళ్ళను పొడిగింపుము.

               దాని మేకులను గ్టిగా బిగగొట్టుము.

3.           నీవు నీ సరిహద్దులను విస్తృతము చేసికొందువు. అన్యజాతులు ఆక్రమించుకొనిన తావులను

               నీ ప్రజలు మరల స్వాధీనము చేసికొందురు.

               పాడువడియున్న నీ నగరములు

               మరల ప్రజలతోనిండును.

ప్రభువు ప్రేమ

4.           భయపడకుము, నీవు అవమానము చెందవు.

               నీవు పరాభవమునకు గురియై

               లజ్జ చెందనక్కరలేదు.

               నీవు పడుచుభార్యవుగా నున్నప్పుడు

               సిగ్గులేని దానివిగా ప్రవర్తించిన తీరును,

               వితంతువుగా నుండి

               నిందను తెచ్చుకొనిన తీరును ఇక విస్మరింతువు.

5.           నిన్ను సృజించినవాడు నీకు భర్తయగును.

               సైన్యములకధిపతియైన ప్రభుడని

               ఆయనకు పేరు.

               యిస్రాయేలు పవిత్రదేవుడు నిన్ను రక్షించును. విశ్వధాత్రికిని దేవుడని ఆయనకు పేరు.

6.           నీవు భర్తచే పరిత్యక్తయై దుఃఖాక్రాంతురాలైన

               పడుచుభార్య విందానవు.

               కాని ప్రభువిపుడు నిన్ను మరలచేపట్టును.

               ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు:

7.            ‘నేను నిన్ను ఒక క్షణకాలము విస్మరించితిని.

               గాఢానురాగముతో

               నిన్నిపుడు మరల స్వీకరింతును.

8.           కోపమువలన ఒక్క క్షణకాలము

               నా మొగమును నీ నుండి మరుగుజేసికొింని.

               కాని ఇపుడు శాశ్వతకృపతో నిన్ను కరుణింతును’

               అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు.

9.           నా దృష్టిలో ఇవి నోవా దినములవింవి.

               జలప్రళయము మరల భూమిని ముంచివేయదని

               నోవాతో నాడు నేను ప్రమాణము చేసితిని.

               ఇపుడు నీతో నేను బాసచేయుచున్నాను.

               నేను నీమీద మరలకోపింపను.

               నిన్ను మరల చీవాట్లు పెట్టను.

10.         పర్వతములు గతించిన గతింపవచ్చునుగాక!

               కొండలు చలించిన చలింపవచ్చునుగాక!

               నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు.

               సమాధానపూర్వకమైన

               నా నిబంధనము తొలగిపోదు అని

               నీ మీద నెనరు జూపు ప్రభువు పలుకుచున్నాడు.”

క్రొత్త యెరూషలేము

11.           బాధలకు గురియై విచారమునజిక్కి

               ఓదార్చువారులేక యున్నదానా!

               నేను విలువగల మణులతో

               నిన్ను పునర్నిర్మింతును.

               నీలమణులతో నీకు పునాదులెత్తుదును.

12.          మాణిక్యములతో నీ బురుజులు కట్టుదును.

               అరుణకాంతులీను మణులతో

               నీ ద్వారములు కట్టుదును.

               ప్రశస్తరత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును.

13.          నీ ప్రజలందరికి ప్రభువే ఉపదేశము చేయును,

               వారు మిక్కుటముగా వృద్ధిజెందుదురు.

14.          నీవు న్యాయమును పాించి

               స్థిరముగా నెలకొందువు.

               నిన్ను పీడించువారును

               భయపెట్టువారును ఉండరు.

               భీతి నీ చెంతకు రాజాలదు.

15.          నీ మీదికి దండెత్తు వారు

               నా ఆజ్ఞ లేకయే దండెత్తినట్లగును.

               నిన్ను ముట్టడించు వారు ఓడిపోవుదురు.   

16.          నిప్పును రగుల్కొనజేసి ఆయుధములు

               తయారుచేయు కమ్మరిని నేనే చేసితిని.

               ఆ ఆయుధములను ఉపయోగించి

               నరులను చంపు సైనికునిగూడ నేనే చేసితిని.

17.          కాని నీ మీద ప్రయోగించుటకు చేసిన

               ఆయుధమేదియు నీకు కీడు చేయజాలదు.

               నీ మీద నేరముమోపు

               ప్రతివానికి నీవు నేరస్థాపన చేయుదువు.

               ప్రభువు సేవకులకు సిద్ధించుభాగ్యమిది.

               నేనే వారికి నీతిని ఒసగెదను.

               ఇదియే వారి స్వాస్థ్యము” ఇది ప్రభువు పలుకు.