ఊచ చేయి గలవానికి స్వస్థత

(మత్తయి 12:9-14; లూకా 6:6-11)

3 1. యేసు మరల ప్రార్థనామందిరములో ప్రవేశించెను.  అచట ఊచచేయిగలవాడు ఒకడుండెను.

2. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా? లేదా? అని అచి జనులు కొందరు పొంచి, ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి.

3. అపుడు ఆయన ఆ ఊచచేయిగలవానిని చూచి ”ఇచటకు రమ్ము” అని వానిని పిలిచెను.

4. అంతట ఆయన జనులను చూచి, ”విశ్రాంతిదినమున మేలుచేయుటయా? లేక కీడు చేయుటయా? ప్రాణరక్షణ మొనర్చుటయా? లేక ప్రాణనష్టమొనర్చుటయా? ఏది చేయదగినపని?” అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి.

5. అంతట ఆయన కోపముతో నలుదెసలు చూచి, ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి, రోగితో ”నీ చేయి చాపుము” అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను.

6. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి, యేసును చంపుటకు తరుణో పాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి.

సరస్సు తీరమున జనసమూహము

7.  యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా, గలిలీయ, యూదయానుండికూడ అపార జనసమూహము ఆయనయొద్దకు వచ్చెను.

8. ఆయన చేసిన గొప్పకార్యములను అన్నిటిని గూర్చి విని యెరూషలేమునుండియు యూదయా, ఇదూమయ ప్రాంతములనుండియు, యోర్దాను నదీతీరమునకు ఆవలనుండియు, తూరు, సిదోను పట్టణ ప్రాంతములనుండియు గొప్ప జనసమూహము అచటకు వచ్చెను.

9.జనసమూహము తనపై విరుగబడునేమోయని యేసు తనకు ఒక పడవను సిద్ధముచేయుడని శిష్యులను ఆజ్ఞాపించెను.

10. ఏలయన, ఆయన రోగులను అనేకులను స్వస్థపరచియుండెను. అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు, పైపై పడుచుండిరి.

11. దయ్యములు పట్టినవారు ఆయనను చూడగనే ఆయనముందు సాగిలపడి, ”నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేసిరి.

12. కాని, తనను ప్రకటింప వలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను.

శిష్యులను నియమించుట

(మత్తయి 10:1-4; లూకా 6:12-16)

13. పిదప, ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయనయొద్దకు వచ్చిరి.

14. తనతో నుండుటకును, సువార్త ప్రకటనకు పంపుటకొరకును ఆయన పన్నిద్దరు శిష్యులను నియమించెను. (వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను).

15. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను.

16. ఆ పన్నిద్దరు ఎవరనగా:  పేతురు అనబడు సీమోను, 17. జెబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు  యోహాను.  ఆయన  వారికి ”బోవనేర్గెసు” అను పేరు పెట్టెను. దీనికి ”ఉరిమెడివారు” అని అర్థము. 18. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడగు సీమోను, 19. ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు.

యేసు – బెల్జబూలు

(మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12:10)

20. వారు ఇల్లు చేరగనే, తిరిగి జనసమూహము గుమిగూడినందున, భోజనము చేయుటకైనను వారికి వీలుపడలేదు.

21. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని, ఆయనకు మతిచలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచటి నుండి తీసికొనివెళ్ళుటకు వచ్చిరి.

22. యెరూషలేమునుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియు చెప్పిరి.

23. అపుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను:  ”సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును?

24. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల అది నిలువ జాలదు.

25. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల అది నిలువజాలదు.

26. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును.

27. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప, ఆ బలశాలి   ఇంిలో ప్రవేశించి, సామగ్రిని దోచుకొనజాలడు.  నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది!

28. మానవులు చేసిన ఏ పాపమైనను, పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును.

29. కాని, పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపియైయుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

30. ఆయన అపవిత్రాత్మ ఆవహించినవాడని వారు అనుటవలన యేసు ఇట్లు పలికెను.

యేసు తల్లి, సోదరులు

(మత్తయి 12:46-50; లూకా 8:19-21)

31. అపుడాయన తల్లియు, సోదరులును వచ్చి, వెలుపల నిలిచి, ఆయనను పిలువనంపిరి.

32. జనసమూహము ఆయన చుట్టును కూర్చుండి యుండెను. ”నీ తల్లియు, నీ సోదరులును (మరియు నీ సహోదరీలును) వచ్చి వెలుపల నీ కొరకు వేచి యున్నారు” అని కొందరు చెప్పిరి.

33. అందుకు యేసు ”నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?” అని 34. తన చుట్టు నున్న జనులను చూచి, ”ఇదిగో! వీరే నా తల్లియు, నా సోదరులును.

35. ఏలయన, దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అని పలికెను.