యెరూషలేము

13 1. అప్పుడు తోబీతు ఇట్లు ప్రార్ధించెను:

               ”నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక!

               ఆయన ఎల్లకాలము పరిపాలనచేయును.

2.           ఆయన నరులను శిక్షించును.

               మరల వారిని కరుణించును.

               నరులను పాతాళమునకు అణగద్రొక్కును.

               మరల వారిని అచినుండి పైకికొనివచ్చును. ఆయన నుండి తప్పించుకొను వాడెవడునులేడు.

3.           యిస్రాయేలీయులారా!

               ప్రభువు మిమ్ము ప్రవాసమునకు పంపిన

               జాతులమధ్య నుండియే

               మీరతనిని సన్నుతింపుడు.

4.           ఈ ప్రవాసమునందుగూడ ప్రభువు

               తన మాహాత్మ్యమును ప్రదర్శించెను.

               బ్రతికున్న వారందరికిని మీరు

               ఆయన స్తుతులు విన్పింపుడు.

               ఎల్లకాలము ఆయన మనకు యజమానుడు,

               మనకు దేవుడు, జనకుడుగూడ.

5.           ఆయన మీ దుర్వర్తనమునకు

               మిమ్ము శిక్షించినను,

               మిమ్ము మరల కరుణతో ఆదరించును.

               మీరు చెల్లాచెదరైయున్న అన్యజాతుల

               నడుమనుండి మిమ్ము మరల

               స్వదేశమునకు కొనిపోవును.

6.           మీరు పూర్ణహృదయముతో

               ప్రభువును ఆశ్రయించి

               చిత్తశుద్ధితో ఆయనకు విధేయులుకండు.

               అప్పుడు ఆయన మీనుండి

               మొగము మరల్చుకొనక

               మిమ్ము ఆదుకొనుటకు సంసిద్ధుడగును.

               ప్రభువు మీకుచేసిన ఉపకారములకుగాను

               ఆయనకు వందనములు అర్పింపుడు.

               న్యాయమును జరిగించు ప్రభువును కీర్తింపుడు.

               శాశ్వతుడైన రాజును వినుతింపుడు.

               నామట్టుకు నేను ఈ ప్రవాసభూమినుండి

               ప్రభువును స్తుతించెదను.

               పాపపు జాతియైన ఈ ప్రజకు,      

               ఆయన మహాశక్తిని ఎరిగించెదను.

               పాపాత్ములారా! మీరు దుష్కార్యములను విడనాడి ప్రభువునకు ప్రీతికలిగించు పనులుచేయుడు.             అప్పుడు ఆయన మీపై కరుణబూని,

               మిమ్ము దయతో మనునట్లు చేయునేమో!

7.            నామట్టుకు నేను ప్రభువును కీర్తింతును.

               ఆకాశాధిపతియైన రాజును

               తలంచుకొని ఆనందింతును.

8.           ఎల్లరును ఆయన మాహాత్మ్యమును

               ఉగ్గడింతురుగాక!

               యెరూషలేములో ఆ ప్రభువును కీర్తింతురుగాక!

9.           పవిత్రనగరమైన యెరూషలేమా!

               నీ ప్రజల దుష్కార్యములకుగాను

               ప్రభువు నిన్ను శిక్షించెను.

               కాని సద్వర్తనులందరిని ఆయన కరుణించును.

10.         ప్రభువు మంచివాడు కనుక

               ఆయనను వినుతింపుడు.

               శాశ్వతుడైన రాజును వినుతింపుడు.

               యెరూషలేమూ!

               నీ దేవాలయమును పునర్నిర్మింతురు.

               నీ పౌరులు ప్రమోదము చెందుదురు.

               ప్రవాసమునకు పోయిన నీ ప్రజలను

               ప్రభువు ఆనందభరితులను చేయును.

               వ్యధలను అనుభవించు నీ ప్రజలను

               ప్రభువు కలకాలము వరకును ఆదరించును.

11.           యెరూషలేమూ! ప్రతిదేశమున

               నీ వెలుగు దేదీప్యమానముగా ప్రకాశించును.

               దూరప్రాంతములనుండి

               పలుజాతులు నీ చెంతకువచ్చి

               నీ ప్రభువైన దేవుని కొనియాడుదురు.

               వారు ఆకాశాధిపతికి కానుకలు గూడ కొనివత్తురు. నీ వీధులలో పలుతరముల

               ప్రజలు సంతసముతో ప్రభువును కీర్తింతురు.

               నీవు దేవుడు ఎన్నుకొనిన నగరముగా

               కలకాలమువరకు కీర్తిని పొందుదువు.

12.          నిన్ను ముట్టడించువారు శాపగ్రస్తులగుదురుగాక!

               నిన్ను నాశనముచేసి నీ గోడలను కూల్చువారు,

               నీ బురుజులను పడగ్టొి

               నీ ఇండ్లను కాల్చివేయువారు

               శాపము పాలగుదురుగాక!

               నిన్ను పునర్నిర్మాణము చేయువారు

               దీవెనలు పొందుదురుగాక!

13.          యెరూషలేమా! ధర్మవర్తనులైన

               నీ ప్రజలను చూచి సంతసింపుము.

               వారు ప్రవాసమునుండి తిరిగివచ్చి

               నీ వీధులలో శాశ్వతుడైన

               ప్రభువును సన్నుతింతురు.

14.          నిన్ను ఆదరాభిమానములతో చూచువారు

               నీవృద్ధిని చూచి ఆనందించువారు ధన్యులు.

               నీప్రస్తుత శ్రమలను చూచి వ్యధచెందువారు

               నీకు ప్రాప్తించు సౌభాగ్యములను చూచి

               అచిరకాలముననే ఆనందము చెందుదురు.

15.          నేను మహాప్రభువైన

               దేవుని సన్నుతింతును.

16.          యెరూషలేమును పునర్నిర్మాణము చేయుదురు.

               ఆ నగరము

               కలకాలము ప్రభువునకు వాసస్థలమగును.

               యెరూషలేమూ! నీ భావిసంతానము

               నీ వైభవమును కన్నులార గాంచి                 

ఆకాశాధిపతియైన దేవుని సన్నుతించునపుడు

               నేనెంతగా ప్రమోదము చెందుదునో!

               నీ ద్వారములను నీలమణులతోను,

               పచ్చలతోను పునర్నిర్మింతురు.     

               నీ ప్రాకారములను

               విలువగల రాళ్ళతోకట్టుదురు.

               నీ కోటలను బంగారముతో కట్టుదురు.

               వాని బురుజులను

               మేలిమి బంగారముతో నిర్మింతురు.

17.          నీ వీధులలో గోమేధికములను,

               చలువరాళ్ళను పరుచుదురు.

               నీ వీధులలో సంతోషగీతములు విన్పించును. నీ గృహములన్నినుండి

               ”యిస్రాయేలు ప్రభువునకు స్తుతికలుగునుగాక!”     అను నినాదము పిక్కిల్లును.

               యెరూషలేమూ!

               ప్రభువు నీ ప్రజలను దీవించును.

               వారు అతని దివ్యనామమును సదా కీర్తింతురు.