వివాహసంబంధమును గూర్చి ప్రశ్నలు

7 1. ఇక మీరు వ్రాసిన విషయములను గూర్చి:  స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

2. కాని వ్యభిచారమునకు లొంగకుండుటకుగాను, ప్రతి పురుషునకు సొంతభార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. 3. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి వివాహధర్మములను నెర వేర్చుచూ, ఒకరి అవసరములను మరియొకరు తీర్చు చుండవలెను.

4. స్త్రీ తన శరీరమునకు యజమాను రాలు కాదు. భర్తయే ఆమె శరీరమునకు యజమా నుడు. అట్లే పురుషుడు తన శరీరమునకు యజమా నుడు కాడు. భార్యయే అతని శరీరమునకు యజమానురాలు.

5. ప్రార్థనచేయుటకు ఉభయులు అంగీకరించిన సమయములందు తప్ప ఒకరికొకరు దూరము కారాదు. అప్పుడు ఆత్మనిగ్రహములేని మీరు సైతాను ఆకర్షణకు లోనుగాకుండునట్లు తిరిగి కలిసి కొనుడు.

6. అయినను ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు.

7. నిజమునకు అందరు నావలెనే ఉండవలెనని నా కోరిక, కాని, ఒక్కొక్కవ్యక్తి ఒక్కొక్క ప్రత్యేకమగు దేవుని వరమును పొందిఉన్నాడు. ఒకనికి ఈ వరము, వేరొకనికి ఆ వరము.

8. అవివాహితులకును, విధవలకును నేను చెప్పునదేమన, వారు నావలెనే ఒంటరిగ జీవించుట ఉత్తమము.

9. కాని, నిగ్రహశక్తి లేకున్నచో వారు వివాహమాడవలెను. వ్యామోహము వలన వ్యధ చెందుటకంటె వివాహమాడుట మేలు.

10. వివాహితులను నేను ఇట్లు ఆజ్ఞాపించు చున్నాను. ఈ ఆజ్ఞ నాది కాదు. అది ప్రభువునకు చెందినదే. భార్య భర్తను విడనాడరాదు.

11. ఒకవేళ విడనాడినచో మరల వివాహమాడరాదు. లేదా భర్తతో సమాధానపడవలెను. పురుషుడు భార్యను విడనాడరాదు.    

12. ఇతరులకు నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది నా మాటయే. ప్రభువు పలుకు కాదు. ఒక క్రైస్తవునికి  అవిశ్వాసురాలగు భార్య ఉన్నచో, ఆమె అతనితో జీవించుటకు ఇష్టపడినచో, అతడు ఆమెను విడనాడ రాదు.

13. ఒక క్రైస్తవ స్త్రీ అవిశ్వాసియగు పురుషుని వివాహమాడి ఉన్నచో, అతడు ఆమెతో జీవించుటకు ఇష్టపడినపుడు, ఆమె అతనిని విడువరాదు.

14. ఏలయన, అవిశ్వాసియగు భర్త తన క్రైస్తవభార్యతో ఏకమగుటద్వారా పరిశుద్ధుడగును. అట్లే అవిశ్వాసి యగు భార్య తన క్రైస్తవభర్తతో ఏకమగుటద్వారా పరిశుద్ధురాలగును. ఇది ఇట్లు కానిచో మీ బిడ్డలు అన్యమతస్థుల బిడ్డలవంటివారగుదురు. కాని వారు దేవునకు స్వీకారయోగ్యులుగా ఉన్నారు.

15. కాని అవిశ్వాసియగు ఒక వ్యక్తి తన క్రైస్తవభార్యనుగాని, భర్తనుగాని విడనాడదలచినచో అట్లే చేయనిండు. అట్టి సందర్భములలో క్రైస్తవభర్తగాని, భార్యగాని కట్టువడి యుండనక్కరలేదు. ఏలయన, దేవుడు మిమ్ము ప్రశాంతముగా జీవించుటకు పిలిచెను.

16. ఓ స్త్రీ! నీ భర్తను నీవు రక్షింపగలవో లేవో నీకు ఎట్లు తెలియును? ఓ పురుషుడా! నీ భార్యను నీవు రక్షింపగలవో లేవో నీకు ఎట్లు తెలియును?

దేవుని పిలుపు – జీవిత విధానము

17. ప్రతివ్యక్తియు, తనకు ప్రభువు ఒసగిన వర మును అనుసరించియు, దేవుడు తనను పిలిచిననాడు తానున్న స్థితినిబట్టియు జీవించుచుండవలెను. దైవ సంఘములో సర్వత్ర నేను ఈ సూత్రమునే బోధింతును.

18. ఎవడైనను తాను పొందిన పిలుపునకు పూర్వమే సున్నతి చేయబడియుండినయెడల అతడు సున్నతి చిహ్నములను తీసివేయ ప్రయత్నింపరాదు. ఎవడైనను తాను పొందిన పిలుపునకు పూర్వము సున్నతి చేయబడనియెడల అతడు సున్నతి పొందరాదు. 19. ఏలయన, సున్నతి పొందుట, పొందకపోవుట ముఖ్యము కాదు. దేవుని శాసనములకు విధేయత చూపుటయే  ముఖ్యము.

20. ప్రతివ్యక్తియు, దేవుని పిలుపును స్వీక రించిననాడు తాను ఎట్లుండెనో అట్లే ఉండవలెను.

21. దేవుడు పిలిచిననాడు నీవు ఒక బానిసవా? లెక్కచేయకుము. కాని స్వతంత్రుడవగుటకు అవకాశము ఉన్నచో, దానిని ఉపయోగించుకొనుము.

22. ఏలయన, ప్రభువుచే పిలువబడిన సేవకుడు ప్రభువునకు చెందిన స్వతంత్రుడు. అట్లే క్రీస్తుచే పిలువబడిన స్వతంత్రుడు ఆయనకు సేవకుడే.

23. దేవుడు మిమ్ము వెలను ఇచ్చి కొనెను. కనుక మానవులకు దాసులు కారాదు.

24. సోదరులారా! తాను పిలువబడిననాడు ఉన్న విధముననే ప్రతి వ్యక్తియు దేవుని సహవాసములో నిలిచిపోవలయును.

అవివాహితలను

విధవరాండ్రను గూర్చిన సమస్యలు

25. ఇక అవివాహితల విషయము. నాకు ఈ విషయమున ప్రభువు శాసనము లేదు. కాని ప్రభువు కృపచే విశ్వాసపాత్రుడగు వ్యక్తిగ నేను నా అభిప్రాయమును తెలుపుచున్నాను. 

26. ప్రస్తుత విషాద పరిస్థితులనుబట్టి, పురుషుడు తాను ఉన్నవిధముగ ఉండుటయే మంచిదని నా అభిప్రాయము.

27. కాని నీకు భార్య ఉన్నదా? ఆమెను వదలించుకొనుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా? భార్యకొరకు యత్నింపకుము.

28. కాని నీవు వివాహమాడినచో పాపము చేయుటలేదు. అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు. కాని అట్టి వ్యక్తులకు కలుగు దైనందిన కష్టములనుండి మిమ్ము తప్పింపవలయున నియే నా తలంపు.

29. సోదరులారా! నేను చెప్పునదేమనగా  ఇంక ఎంతో సమయము లేదు. కనుక ఇప్పటినుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగను, 30. ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగలేనట్లును, కొనువారు తాము కొనినవానికి సొంతదారులు కానట్లును, 31. లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. ఏలయన, ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంక ఎంతో కాలము ఉండబోదు.

32. మీరు విచారమునుండి దూరము కావలె ననియే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు, అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును.

33. కాని, భార్యను సంతోషపెట్టవలెనను తలంపు గలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకికవ్యవహారములలో చిక్కుకొని, 34. రెండు ప్రక్కలకు లాగబడుచుండును. శారీరక ముగను,  ఆత్మయందును  కూడ  అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక, ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకికవ్యవహారము లలో చిక్కుకొనును.

35. నేను మీ ప్రయోజనము నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. నేను మీపై నిబంధనలు విధించుట లేదు. మీరు ప్రభువు సేవకు సంపూర్ణముగ సమర్పించు కొనవలయునని, చక్కని క్రమశిక్షణ అలవరచుకొన వలయునని నేను ఇట్లు చెప్పుచున్నాను.

36. ఎవడేని ఒకతెను ప్రధానము చేసికొన్నపిదప ఆమె ఈడుమించిపోవుచున్నదని భావించినయెడల  ఆ యువతిని వివాహమాడుట మంచిదని తలంచినచో అతడు తాను ఆశించినట్లే చేయవచ్చును. అందు పాపములేదు.

37. కాని, ఎవడైన హృదయ స్థిరత్వము కలిగి బలవంతముగా కాక, తన సంకల్పమును నెరవేర్చు కొను స్వేచ్ఛగలవాడై, తన కోరికను నిగ్ర హించుకొని, తాను కృతనిశ్చయముతో ప్రదానము చేయబడిన తన కన్యకను నిశ్చితార్థురాలిగా ఉంచదలచినచో అది మంచిదే.

38. కనుక తన కన్యకను వివాహమాడువాడు మంచిపనియే చేయును. వివాహమాడనివాడు మరింత మంచి పనిచేసినట్లగును.

39. వివాహిత స్త్రీ తన భర్త జీవించి ఉండునంత కాలము స్వతంత్రురాలు కాదు. కాని, ఆమె భర్త మరణించినచో, తాను కోరిన వ్యక్తిని వివాహమాడుటకు ఆమెకు స్వేచ్ఛ కలదు. కాని  అది క్రైస్తవ వివాహమై ఉండవలెను.

40. కాని, ఉన్నట్లే ఉండినచో ఆమె ఎంతయో సంతోషింపగలదు. అది నా అభి ప్రాయము. నాయందుకూడ దేవుని ఆత్మ ఉన్నదని నాతలంపు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము