దేవుని ఆగ్రహపాత్రలు

16 1. అప్పుడు ఆ దేవాలయమునుండి ఒక గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో పలుకుట వినబడెను. ”దేవుని ఆగ్రహముతో కూడిన సప్త పాత్రలను భూమిపై కుమ్మరింపుడు, పొండు” అని ఆ స్వరము పలికెను.

2. కావున మొదటి దేవదూత భువిని చేరి తన చేతి పాత్రను కుమ్మరించెను. ఆ మృగము ముద్రను ధరించిన వారికిని, దానిని ఆరాధించిన వారికిని శరీరములపై భయంకరములును బాధాకరములగు పుండ్లు పుట్టెను.

3. అంత రెండవ దేవదూత తన పాత్రను సముద్రముపై కుమ్మరించెను. దానితో ఆ జలమంతయు మృతుని రక్తమువలె మారిపోయెను. ఆ సముద్రములోనున్న జీవులన్నియు చనిపోయెను.

4. పిమ్మట మూడవ దేవదూత తన చేతి పాత్రను నదులపైనను, నీటి ఊటలపైనను కుమ్మరించెను. దానితో అవి రక్తమయములయ్యెను.

5. అపుడు జలాధి దేవదూత ఇట్లు పలుకుట వింటిని. ”భూత వర్తమాన కాలములలో నున్న ఓ పవిత్రుడా! నీవు న్యాయవంతుడవు. ఏలయన,  నీవు అటుల  తీర్పు విధించితివి.

6. ఏలయన, వారు పరిశుద్ధుల, ప్రవక్తల రక్తమును చిందింపచేసితిరి గదా! కనుకనే వారు త్రాగుటకు రక్తమును ఒసగితివి. వారికి యోగ్యమైన దానినే వారు పొందుచున్నారు!”

7. అంతట బలిపీఠమునుండి ఒక కంఠస్వరము ”సర్వశక్తిమంతుడవగు ఓ దేవా! ఓ ప్రభూ! నీ నిర్ణయములు సత్యాన్వితములు, న్యాయసమ్మతములు” అని పలుకుట నాకు విదితము అయ్యెను.

8. పిమ్మట నాలుగవ దేవదూత తన చేతి పాత్రను సూర్యునిపై క్రుమ్మరించెను. తన ప్రచండమగు ఉష్ణ ముతో సూర్యుడు మానవులను దహింప అనుమతి పొందెను.

9. ఆ ఉష్ణ తీవ్రతచే మాడిపోయిన మానవులు ఈ జాడ్యములకు అధిపతియగు దేవుని నామమును దూషించిరి. కాని వారు తమ పాపములకు పశ్చాత్తాపపడుటగానీ, దేవుని మహిమను స్తుతించుటగానీ చేయలేదు.   

10. అనంతరము ఐదవ దేవదూత తన చేతి పాత్రను ఆ మృగముయొక్క సింహాసనముపై క్రుమ్మరించెను. ఆ మృగరాజ్యమును అంధకారము ఆవరించెను. బాధచే జనులు తమ నాలుకలను కొరుకు కొనిరి.

11. తమ బాధలకును, కురుపులకును దివి యందలి దేవుని దూషించిరి. కాని తమ దుర్మార్గముల నుండి వారు మరల లేదు.

12. అప్పుడు ఆరవ దేవదూత యూఫ్రటీసు మహానదిపై తన పాత్రను కుమ్మరించెను. తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధముచేయ ఆ నది ఎండిపోయెను.

13. అంతలో కప్పలవలె కానవచ్చుచున్న మూడు అపవిత్ర ఆత్మలను చూచితిని. అవి సర్పము నోటినుండియు, మృగము నోటినుండియు, అసత్య ప్రవక్త నోటినుండియు ఒకటొకటిగా వెలువడెను.

14. మాహాత్మ్యములను ప్రదర్శించు దయ్యముల ఆత్మలే అవి. అవి భువియందలి రాజుల దరిచేరును. సర్వశక్తిమంతుడగు దేవుని మహా దినమున ఆయనతోయుద్ధము ఒనర్పవారిని కూడదీయుటకై అవి ప్రయత్నించును.

15. ”ఆలకింపుడు! నేను దొంగవలె వచ్చుచున్నాను. మెలకువగఉండి తన వస్త్రములను కాపాడు కొనువాడు ధన్యుడు. అప్పుడు అతడు దిగంబరిగా తిరుగవలసిన అవసరము తప్పును, పదిమందిలోసిగ్గుపడవలసిన అవసరమును తప్పును!”

16. అప్పుడు ఆత్మలు ఆ రాజులనందరిని ఒక చోటచేర్చెను. ఆ ప్రదేశము హీబ్రూభాషలో ఆర్మెగెడ్డోను అని పిలువబడును.

17. అంతట ఏడవ దేవదూత తన చేతి పాత్రను గాలిలో కుమ్మరించెను. అప్పుడుదేవాలయములోని సింహాసనమునుండి ఒక గంభీరధ్వని ఇట్లు వినబడెను: ”సమాప్తమైనది!” అని ఆ స్వరము పలికెను.

18. అంతట మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు సంభవించెను. సృష్ట్యాదినుండియు  అట్టిభూకంపము ఎన్నడును కలుగలేదు. ఇది భయంకరమగు భూకంపము.

19. ఆ మహానగరము మూడు విభాగములుగా చీలిపోయెను. అన్ని దేశముల యందలి నగరములును ధ్వంసమయ్యెను. మహానగరమగు బబులోనియాను దేవుడు మరువలేదు. తన ప్రచండ ఆగ్రహమను మద్యమును, ఆ నగరము తన మద్యపాత్రనుండి త్రాగునట్లు దేవుడొనర్చెను.

20. ద్వీపములు అంతరించెను. పర్వతములు అదృశ్య మయ్యెను. 

21. ఆకాశమునుండి మనుష్యుల మీద వడగండ్లవాన కురిసెను. అందు ఒక్కొక్క శిలయు ఒక మణుగు బరువు కలదైనట్లు తోచెను. ఆ వడగండ్ల జాడ్యము మహాదారుణమైనది. కనుకనే ఆ వడగండ్ల వానకు మానవులు దేవుని దూషించిరి.