పవిత్రాత్మ వరములు

12 1. సోదరులారా! ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు.

2. మీరు అన్యులుగా ఉన్న కాలమున మీరు మూగవిగ్రహముల ప్రభావమునకు లోనై యుటింరి. అవి మిమ్ము అన్యమార్గములకు కొనిపోయెడివి. ఇది మీకు తెలియును.

3. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు, ‘యేసు నాశనమగునుగాక!’ అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు ‘యేసే ప్రభువు’ అని అంగీకరింపజాలడు.

4. కృపావరములు అనేకములు ఉన్నవి కాని, వానిని ఒసగు ఆత్మ ఒక్కడే.

5. సేవలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి. కాని సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే.

6. సేవచేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి. కాని అన్ని సేవలకును, అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును.

7. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహింపబడినది.

8. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరియొకనికి విజ్ఞాన పూర్వకమగు వాక్కును ఒసగు చున్నాడు.

9. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి యొకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు.

10. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయుశక్తిని, మరి యొకనికి ప్రవచనశక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించుశక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మ్లాడగలశక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింప గల శక్తిని ఇచ్చుచున్నాడు.

11. కాని వీనిని అన్నింని చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క  వరమును ఆయన ఒసగుచున్నాడు.

క్రీస్తు – జ్ఞాన శరీరము

12. క్రీస్తు పెక్కు అవయవములుగల ఒకే శరీరము వింవాడు. పెక్కుఅంగములతో కూడినను శరీరము ఒకియే కదా!

13. అట్లే, యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను, మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరము లోనికి జ్ఞానస్నానమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి.

14. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు. అది పెక్కుఅంగములతో కూడినది.

15. ”నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను” అని పాదము పలికినచో, అది శరీర మున ఒక భాగము కాకపోదు.

16. ”నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను” అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు.

17. శరీరము అంతయును ఒక్క నేత్రమే యైనచో అది ఎట్లు వినగలదు? శరీరము అంత యును ఒక్క చెవియేయైనచో అది ఎట్లు వాసన తెలిసి కొనగలదు?

18. కాని, తన సంకల్పానుసారముగ ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. 19. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు.

20. కనుకనే పెక్కు అవయవములు గలవు కాని శరీరము ఒక్కటే.

21. కాబ్టి, ”నీతో నాకు అవసరము లేదు!” అని కన్ను చేతితో పలుకజాలదు. అట్లే, ”మీతో నాకు పనిలేదు!” అని శిరస్సు పాదములతో పలుకజాలదు.

22. అంతేకాక, బలహీనముగ తోచు అవయవములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. 23. ముఖ్యమని మనము భావింపని అవయవములనే ఎంతయో శ్రద్ధగా చూచుకొందుము. అంద విహీనములైన శరీరభాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా,  24. అందముగా ఉన్న శరీర అవయవములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములగు అవయవములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అటుల ఏర్పరచెను.

25. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని యందలి విభిన్న అవయవములన్నియు ఒకదానిపై ఒకటి సమానశ్రద్ధను కలిగియుండుటకు ఆయన అటుల చేసెను.

26. శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములును బాధపడును. ఒక అవయవము గౌరవము పొంది నచో, దాని ఆనందమున మిగిలిన అవయవము లన్నియు పాలుపంచుకొనును.

27. కావున మీరు అందరును క్రీస్తు శరీరము. ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే.

28. దేవుడు శ్రీ సభలో మొదట కొందరిని అపోస్తలులనుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలనుగాను, తదుపరి కొందరిని బోధకులనుగాను, ఆపైన కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థతకూర్చు శక్తిగలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయు వారినిగాను, కొందరిని పరిపాలకులనుగాను, కొందరిని వివిధములగు భాషలు మ్లాడువారిని గాను నియమించెను.

29. అందరును అపోస్తలులా? అందరును ప్రవక్తలా? అందరును బోధకులా? అందరును అద్భుతములు చేయుదురా?

30. స్వస్థపరచు శక్తి అందరికిని కలదా? అందరును వివిధములగు భాషలలో మాటలాడుదురా? అందరును వాని అర్థ మును తెలియజేయుదురా?

31. కనుక శ్రేష్ఠమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్ని కంటె శ్రేష్ఠమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము