ఉపోద్ఘాతము:

పేరు: ‘ఎఫెసు’ గ్రీకుపదం. ఎఫెసు పట్టణం ప్రసిద్ధ రేవుపట్టణం. రోమా సామ్రాజ్యంలోని ఆసియా భూభాగంలో వుంది. ఈ పట్టణంలో క్రైస్తవ సంఘాలు వెలిశాయి (1:1,15; 6:21-23).

కాలము: క్రీ.శ. 60-62లో రోములో పౌలు తన చెరసాల వాసంలో రాశాడు (3:1; 4:1; 6:20).

రచయిత: పునీత పౌలు.

చారిత్రక నేపథ్యము: క్రీస్తు రాయబారి  పౌలుకి ఎఫెసు నగరంతో పరిచయం వుంది (అ.కా. 18:19-21). ఎఫెసు నందు మృగములతో పోరాడవలసి వచ్చిందని చెప్పుకున్నాడు (1 కొరి. 15:32). ఎఫెసు శ్రీసభ దైవదర్శనం పొందిన సప్తసంఘాలలో ఒకి. ఎఫెసీయులను దైవ ప్రజలుగా సంబోధించాడు (1:1). పౌలుగారి ఇతర లేఖలలోని చారిత్రక నేపథ్యం ఈ గ్రంథంలో కనిపించదు. పౌలు ఎఫెసు సంఘం నాయకులను కలుసుకొని మున్ముందు రాబోయే అవాంతరాలను, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో సలహాలిచ్చాడు. సంఘంలోని చిన్నచిన్న ముఠాలను విడదీసి అందరి మధ్య ఐక్యత నెలకొల్పడానికి కృషిచేశాడు.

ముఖ్యాంశములు:  క్రీస్తు అనుచరులు వెలుగు సంబంధమైన బిడ్డలుగాను క్రీస్తు శరీరముగాను జీవించాలి (4:1-6:24), క్రీస్తు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు (1:1-23). క్రీస్తు దేవుని ప్రజలకు శాంతిని, ఐక్యతను ప్రసాదిస్తారు (2:1-3:21), స్త్రీ, పురుష సంబంధం సంఘ జీవనానికి పునాదివంటిది (5:21-23).

క్రీస్తు చిత్రీకరణ: క్రైస్తవత్వానికి, క్రైస్తవులకు క్రీస్తు కేంద్రబిందువు. ప్రతిదీ ‘క్రీస్తునందు’ జరగాలి అని పౌలు బోధించాడు. క్రీస్తునందు, క్రీస్తులో (1:1): ఏర్పాటు (1:4); పుత్రులు (పుత్రికలు-బిడ్డలు)గా స్వీకరణ (1:5); క్రీస్తునందే విమోచన (1:7); నిరీక్షణ ఏర్పాటు (1:12); ఆత్మముద్రణ (1:13, 14); ఉపకారము/కరుణ/దయ (2:6); పునరుత్థానం (2:7); క్రీస్తునందు సృష్టి (2:10); పవిత్ర దేవాలయమగుట (2:21)  పాలివారమవుట (3:6).