ఉపోద్ఘాతము:

పేరు: ‘యిర్మీయా’ అనగా హీబ్రూభాషలో ”యావేదేవుడు విసరివేయును/ స్థిరపరుచును/ ఘనపరుచును” అని అర్థము.  యిర్మీయా అనాతోతు గ్రామ నివాసి (1:1). స్థితిమంతుడు (32:8). తాను బాలుడుగా వున్నప్పుడే దేవుని పిలుపును అందుకున్నవాడు. (1:6). కుటుంబము (12:6), ఇరుగుపొరుగు వారు ఇతనిని వదిలివేసిరి (11:19-21). అవివాహితుడు (16:2). అందరిచే విడనాడబడినవాడు. (20:1-2,10; 36:23; 26:8).  కాని అందరి కొరకు అంగలార్చినవాడు. అందుకే ఈ ప్రవక్త ‘విలపించే ప్రవక్త’ అని పేరుపొందెను.   కాలము: క్రీ.పూ. 626 యోషీయా పాలనకాలములో తన 20వ యేట నుండి పరిచర్యచేశాడు. 

రచయిత: యిర్మీయా ఈ గ్రంథమును క్రీ.పూ. 580లో వ్రాసి వుండునని భావిస్తారు. యిర్మీయా ప్రవక్త కార్యదర్శి అయిన బారుకు కొన్ని భాగాలను వ్రాసి వుండునని పండితుల అభిప్రాయము.

చారిత్రక నేపథ్యము: యిర్మీయా ఐదుగురు యూదారాజుల పాలనలలో సేవలందించెను. వారు: యోషీయ, యెహావాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ రాజుల కాలములో క్రమేణా యూదా సామ్రాజ్యము పతనావస్థకు చేరుకున్నది. జెఫన్యా, హబక్కూకు, యెహెజ్కేలు ప్రవక్తలు యిర్మీయాకు సమకాలీకులు. యూదుల క్లిష్టకాలములో యిర్మీయా ప్రవచన ప్రేషిత కార్యము కావించెను. పిరికివాడైన యిర్మీయాను కఠోర ప్రవచనముల నిమిత్తము దేవుడు వాడుకొనెను.

ముఖ్యాంశములు: సమకాలీన రాజకీయపరిస్థితులదృష్ట్యా యిర్మీయా ప్రాముఖ్యతను బడయనప్పికీ తన జాతి ఆత్మీయఅభ్యున్నతి విషయములో గొప్పవిజయము సాధించెను. దీనిని యూదాజాతి ప్రజలు యిర్మీయా మరణానంతరమున మాత్రమే గ్రహించగలిగిరి.  విగ్రహారాధన, అవిధేయతలవల్ల సీనాయి ఒప్పందము ప్రకారము శిక్షతప్పదని ప్రజలకు పదేపదే గుర్తుచేసాడు.  వ్యక్తిగత సామర్థ్యమువలనగాక, దేవుని అభయహస్త్తాల పైనే ఆధారపడి విజయము సాధించగలమని ఋజువు చేసాడు.  ప్రజల బాగోగుల కొరకు కన్నీరు కార్చిన ఉన్నతవ్యక్తి యిర్మీయా. దేవునితో వ్యక్తిగత సంబంధము  (17:9; 31:29, 80), హృదయ విధేయత, హృదయములో దేవునికి చోివ్వడము ముఖ్యమని తెలిపెను (14:10-22). ‘సువార్తకు ముందు సువార్త’ అని చెప్పబడు  యిర్మీయా ప్రవక్త ప్రవచనము (31:33), దేవున తన రక్షణ ప్రణాళికను మానవహృదయాల్లో లిఖించెనని సూచించెను (24:7).

క్రీస్తుకు అన్వయము: మెస్సయ రాకడ గూర్చిన ప్రత్యక్ష ప్రస్తావనలు (23:1-8; 30:4-11; 31:31; 33:14-26). మెస్సయ కాపరి, నీతిమంతుడుగా అవతరించి దేవునిపాలనను గావించి, భూమిమీద నీతి, న్యాయ తీర్పును అందించును. (23:5-6). ఈ మెస్సయ  పాత నిబంధనను నూత్నీకరించి (ఆది. 12:1-3; 17:1-8; 2 సమూ 7:1-17), నూతననిబంధననొసగును (31:31-34)