ఉపోద్ఘాతము:
పేరు: జెకర్యా అను పదమునకు ”యావే జ్ఞాపకముంచుకొనును” అని అర్థము. జెకర్యా యాజక కుటుంబములో పుట్టెను (నెహ.12:16). ఇతడి తండ్రి బెరాక్యా, ఇద్దోకు మనుమడు (1:1; ఎజ్రా 5:1; 6:14). పిన్న వయస్సులోనే దేవుని పిలుపునందుకున్నాడు.
కాలము: దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. గ్రంథములోని 1-8 అధ్యాయములు క్రీ.పూ. 520-518 మధ్యకాలములోను, 9-14 అధ్యాయములు క్రీ.పూ. 480-470 లో గ్రంథస్తమైనవని కొందరు పవిత్రగ్రంథ పండితుల అభిప్రాయము.
రచయిత: జెకర్యా (మరియు జెకర్యా శిష్యులు) .
చారిత్రక నేపథ్యము: క్రీ.పూ.539వ సంవత్సరమున యూదులు తమ మాతృభూమికి తిరిగి వెళ్ళడానికి కోరేషు అనుమతినిచ్చాడు. దీనిననుసరించి సెరుబ్బాబేలు, యెహోషువ నాయకత్వమున సుమారు 50 వేలమంది యెరూషలేమునకు తిరుగుప్రయాణము క్టారు. ప్రవాసము నుండి తిరిగివచ్చిన వీరిలో జెకర్యా కూడా వున్నాడు. దేవాలయము పునర్నిర్మాణానికి పునాదులు వేశారు. జెకర్యా ఆ పనిని కొనసాగించెను (1:1). యావే దేవుడు తన పితరులకు ఇచ్చిన వాగ్ధానాన్ని గౌరవించి నెరవేర్చునని జెకర్యా ప్రవచించెను.
ముఖ్యాంశములు: ప్రవచన సాహిత్యములో లభించే వివిధరకాల రచనారీతులు (ప్రవచనాలు, దర్శనములు, దైవసూక్తులు) జెకర్యాగ్రంథములో కనపడతాయి. యావే దేవుడు దుర్మార్గమును రూపుమాపి, నూతనసృష్టిని నెలకొల్పే ‘అంత్యదినము’ గురించిన ప్రవచనములు ఈ గ్రంథములో ఉన్నాయి. ప్రవాసకాలము అనంతరము తిరిగి వచ్చిన యూదాప్రజల చారిత్రక జీవితవిశేషాలను జెకర్యా తెలియజేస్తాడు. పునరుద్ధరణలో దేవునిప్రణాళిక ఏమిో తెలుపుతాడు. దేవునియందు విశ్వాసముంచి యెరూషలేము పునర్నిర్మాణానికి అందరు చేయూతనివ్వాలని జెకర్యా పునరుద్ఘాించెను. రానున్న అభిషిక్తుణ్ణి (మెస్సయ) గురించి ఈ గ్రంథములో పలుచోట్ల ప్రస్తావించబడినది.
క్రీస్తుకు అన్వయము: జెకర్యా గ్రంథములో మెస్సయాను గూర్చిన పలు ప్రవచనములు కలవు. 1. ప్రభువుదూత (3:1-2); 2. నీతి చిగురు (3:8; 6:12-13); 3. ఏడుకన్నులు గల రాయి (3:9); 4. యాజకుడైన రాజు (6:13); 5. దీనత్వము గల రాజు (9:9-10); 6. మూలరాయి, గుడారపు మేకు, యుద్ధపు విల్లు (10:4); 7. వెండి నాణెములకు అమ్మబడిన కాపరి (11:4-13); 8. పొడవబడిన వాడు (12:10); 9. పాపపరిహారపు ఊట (13:1); 10. గొఱ్ఱెలు చెదరిపోయి హతము చేయబడిన కాపరి (13:7); 11. రాబోవు న్యాయాధిపతి, నీతిగల రాజు (అధ్యా. 14). ఈ లక్షణములన్నియు క్రీస్తులో మిక్కుటముగా కనబడును. క్రీస్తు దేవుడుగా, మనుష్యుడుగా మరియు రాజుగా, సేవకుడుగా దర్శనమిస్తాడు.