నీతిగల రాజు

32 1.      ఇదిగో వినుడు.

                              రాజు నీతితో పరిపాలించును.

                              అధిపతులు న్యాయముతో ఏలుదురు.

2.           వారు గాలినుండి తప్పించుకొను గుడిసెవలెను,

               గాలివాననుండి తప్పించుకొను ఆశ్రయమువలెను

               ఉందురు.

               మరుభూమిలో పారెడుకాలువలవలెను,

               ఎడారిలో నీడనిచ్చు పెద్దబండవలెను ఒప్పుదురు.

3.           చూచువారి కన్నులు జాగ్రత్తగా చూచును.

               వినువారి చెవులు అవధానముతో  వినును.

4.           తొందరపడువారు వివేకముతో ప్రవర్తింతురు. నత్తివారు స్పష్టముగా మాటలాడుదురు.

5.           మందమతిని ఘనునిగా ఎంచరు.

               దుర్మార్గుని సజ్జనునిగా గణింపరు.

మూర్ఖుడు – సజ్జనుడు

6.           మూర్ఖుడు మూర్ఖముగా మ్లాడును,

               దుష్కార్యములు చేయనెంచును.

               అతడు దుష్టవర్తనమునకు పాల్పడును

               ప్రభువును గూర్చి చెడుగా మ్లాడును.

               అతడు ఆకలిగొనిన వారికి అన్నముపెట్టడు.

               దప్పిక గొనినవారికి దాహమీయడు.

7.            మూర్ఖుడు దుష్టుడు,

               దుష్కార్యములు చేయువాడు.

               అతడు కొండెములతో పేదలను

               నాశనము చేయుటకు పన్నాగములు పన్నును.

               వారికి న్యాయము జరుగనీయడు.

8.           కాని సజ్జనుడు యోగ్యముగా ప్రవర్తించును.

               యోగ్యుడుగా మనును.

సోమరులైన స్త్రీలకు హెచ్చరిక

9.           హాయిగా కాలము వెళ్ళబుచ్చు ఉవిదలారా!

               లెండు, నా పలుకులులాలింపుడు!

               చీకు చింతలేని మహిళలారా!

               నా మాటలు వినుడు!

10.         మీరిపుడు నిశ్చింతగా ఉన్నారు గాని

               ఒక యేడాది గడవకమునుపే

               మీరు తల్లడిల్లుదురు.

               ద్రాక్షపంట అడుగంటును.

               ద్రాక్షపండ్లు సేకరించు కాలము ఇక రాదు.  

11.           హాయిగా కాలము వెళ్ళబుచ్చు మీరు భీతిల్లుడు.

               చీకు చింతలేని మీరు గడగడవణకుడు.

               మీ వస్త్రములను తొలగించి గోనె ధరింపుడు.

12.          మీ రొమ్ములు బాదుకొనుడు.

               సారవంతమైన పొలములు

               ద్రాక్షతోటలు నాశనమైనవి.

13.          నా జనుల పొలములలో

               ముండ్లపొదలు ఎదుగుచున్నవి.

               సుఖప్రదమైన గృహములును,

               సంతోషప్రదమైన నగరమును పాడువడినవి.

14.          రాజ ప్రాసాదమును విడనాడిరి.

               జనసమర్థమైన పట్టణమును పరిత్యజించిరి.

               కోటలును, బురుజులును ధ్వంసమైనవి.

               అడవిగాడిదలచట తిరుగాడును.

               గొఱ్ఱెలకు ఆ చోటు పచ్చిక పట్టగును.

ప్రభువు నుండి రక్షణ

15.          ప్రభువు పైనుండి తన అనుగ్రహమును

               మనమీద కురియించును.

               ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును.

               పొలములలో పంటలు పుష్కలముగా పండును.

16.          ఎడారిలో న్యాయము నెలకొనును.

               పంట పొలములలో నీతి నిలుచును.

17.          నీతివలన శాంతి కలుగును.

               నీతివలన నిత్యము నమ్మకము,

               నిబ్బరము కలుగును.

18.          దేవుని ప్రజలు చీకుచింతలేకుండ

               శాంతి సమాధానములతో జీవింతురు.

19.          అరణ్యము వడగండ్లచే నాశనమగును.

               పట్టణము ధ్వంసమగును.   

20.        ప్రజలెల్లరు ఏి దాపున పైరులు వేసికొనుచు

               ఎడ్లను, గాడిదలను పచ్చికపట్టులలో త్రిప్పుచు

               ఆనందముతో జీవింతురు.