పవిత్రాత్మ పని

16 1. ”మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నియు మీతో చెప్పితిని.

2. వారు మిమ్ము ప్రార్థనామందిరములనుండి వెలివేయుదురు.  మిమ్ము  హత్యచేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచు న్నానని భావించు గడియ వచ్చుచున్నది.

3. వారు తండ్రినిగాని, నన్నుగాని ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు.

4. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచు కొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో  చెప్పలేదు.

5. కాని. ఇపుడు నన్ను పంపినవానియొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడును ‘నీవు ఎక్కడకు పోవు చున్నావు?’ అని నన్ను అడుగుటలేదు.

6. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయ ములు దుఃఖముతో నిండిఉన్నవి.

7. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను.

8. ఆయన వచ్చి పాపమును గురించియు, నీతిని గురించియు, తీర్పును గురిం చియు లోకమునకు నిరూపించును.

9. పాపమును గురించి ఎందుకన, వారు నన్ను విశ్వసించుట లేదు.

10. నీతిని గురించి ఎందుకన, నేను తండ్రియొద్దకు పోవుచున్నాను. ఇక మీరు నన్ను చూడరు.

11. తీర్పును గురించి ఎందుకన, ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది.

12. ”నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇపుడు మీరు వానిని భరింపలేరు.

13. ఆయన, అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చిన పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయ ములను మీకు తెలియచేయును.

14. ఆయన నన్ను మహిమపరచును. ఏలయన, ఆయన నాకున్న దానిని, నానుండి  గైకొనిన దానిని,  మీకు తెలియచేయునని చెప్పితిని.

15. తండ్రికి ఉన్నదంతయు నాది. అందు చేత నానుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని.

నేటి  దుఃఖము – రేపటి  సుఖము

16. ”కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు.” అని చెప్పెను.

17. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, ” ‘కొంత కాలము తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. ఏలయన, నేను తండ్రియొద్దకు వెళ్ళుచు న్నాను’ అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి?

18. కొంతకాలము అని చెప్పుచున్నాడు. ఈయన చెప్పున దేమో మనకు తెలియుటలేదు” అని అనుకొనసాగిరి. 19. వారు తనను ఏదో అడుగదలచుచున్నారని యేసు గ్రహించి వారితో, ”కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరి నొకరు ప్రశ్నించు కొనుచున్నారా?

20. మీరు శోకించి విలపింతురు. కాని, లోకము సంతోషించును.  మీరు దుఃఖింతురు. కాని, మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

21. స్త్రీ ప్రస వించు గడియ వచ్చినపుడు ఆమె ప్రసవవేదనపడును. కాని, బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డపుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును.

22. అట్లే మీరు ఇపుడు దుఃఖముతో ఉన్నారు. కాని, నేను మిమ్ము మరల చూచెదను. అపుడు మీ హృదయములు సంతోషించును.మీసంతోషమును మీనుండి ఎవడును తీసివేయడు.

23. ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.

24. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియు అడుగలేదు. అడుగుడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు.

లోకముపై విజయము

25. ”నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని. కాని, తండ్రిని గురించి దృష్టాంతములతోగాక, తేట తెల్లముగచెప్పు గడియ సమీపించుచున్నది.

26. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుట లేదు.

27. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును.

28. నేను తండ్రియొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను” అని పలికెను.       

29. అందుకు ఆయన శిష్యులు ”ఇపుడు మీరు దృష్టాంతములతోకాక స్పష్టముగా మాట్లాడుచున్నారు.

30. మీరు సర్వజ్ఞులనియు, ఒకరు మిమ్ము అడుగన వసరము లేదనియు ఇపుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవునినుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము” అనిరి.

31. అపుడు యేసు ”ఇపుడు మీరు నన్ను విశ్వసించు చున్నారా?

32. ఇదిగో! మీరు నన్ను ఒంటరిగ వదలి, చెల్లాచెదరై, ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని, నేను ఒంటరిగా లేను. ఏలయన, తండ్రి నాతో ఉన్నాడు.

33. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు కాని, ధైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని” అని చెప్పెను.