శ్రమలకు గురియైనపుడు ప్రార్థన
ప్రధానగాయకునికి అష్టమ శ్రుతిమీద తంత్రివాద్యములతో పాడదగిన దావీదు కీర్తన
6 1. ప్రభూ! నా మీద కోపించి,
నన్ను చీవాట్లు పెట్టకుము.
నా మీద ఆగ్రహము చెంది,
నన్ను దండింపకుము.
2. ప్రభూ! నేను దుర్బలుడనైతిని.
నన్ను కరుణింపుము.
ప్రభూ! నా ఎముకలు వణకుచున్నవి.
నన్ను స్వస్థపరుపుము.
3. నేను మనసున భయముతో
మిగుల వ్యాకులము చెందితిని.
ప్రభూ! ఇంక నెంతకాలము
నన్ను కరుణింపకయుందువు.
4. దేవా! నీవు శీఘ్రమే విచ్చేసి నన్ను కాపాడుము.
నీవు కృప కలవాడవు కనుక నన్ను రక్షింపుము.
5. మృతులు నిన్ను స్మరింపరు.
పాతాళలోకమున నిన్ను ఎవరు స్తుతింతురు?
6. నేను విచారమువలన కృశించితిని.
ప్రతిరేయి కన్నీితో నా పడక తడిసి,
నా తలదిండు నానుచున్నది.
7. ఏడ్పులవలన నా కళ్ళు గుంటలు పడినవి. శత్రువుల పీడనమువలన
కించూపు కూడ మందగించినది.
8. దుష్టులారా! మీరు నాచెంతనుండి తొలగిపొండు.
ప్రభువు నా రోదనమును ఆలకించెను.
9. ప్రభువు నా మనవి వినెను.
ఆయన నా ప్రార్థనను అంగీకరించును.
10. నా విరోధులెల్లరును
అపజయముతో కలత పడుదురుగాక!
సిగ్గుపడి శీఘ్రమే వెనుదిరిగి పోవుదురుగాక!