పౌలు, సిలాసులతో తిమోతి

16 1. పౌలు దెర్బె, లిస్త్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లికూడ విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది. కాని అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.

2. లిస్త్రా, ఇకోనియాలలో ఉన్న సోదరులకు తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు.

3. పౌలు, తిమోతిని తన వెంట తీసికొనిపోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలయన, తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియును.

4. వారలు ఆ పట్టణముల మీదుగా పోవుచు యెరూషలేములోని అపోస్తలులచేత, పెద్దలచేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి, వాటిని పాటింపవలెనని చెప్పిరి.

5. కనుక, అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దిన దినాభివృద్ధి చెందుచుండెను.

త్రోయలో పౌలుకు దర్శనము

6. వారు ఫ్రిగియా, గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయ లేదు.

7. వారు మిసియా సరిహద్దును చేరుకొని, బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కాని యేసుఆత్మ వారికి అనుమతిని ఈయలేదు.

8. అందుచే వారు కుడివైపుగా, మిసియా మీదుగా పయనించి, త్రోయకు పోయిరి.

9. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో, మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి, ”మాసిడోనియాకు వచ్చి, మాకు సహాయపడుడు” అని పౌలును బ్రతిమాలు కొనెను.

10. ఈ దర్శనము కలిగిన వెంటనే, మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయన, అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకించుటకు దేవుడు మమ్ములను పిలిచెనని మేము నిశ్చయించు కొంటిమి.

ఫిలిప్పీలో లిదియా స్త్రీ పరివర్తన

11. మేము ఆ ప్రాంతమును వీడి, త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి. మరునాడు నెయాపొలికి వెళ్ళితిమి.

12. అక్కడ నుండి, మాసిడోనియాయొక్క మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళితిమి. అది రోమీయులకు ప్రవాసస్థానముగ ఉండెను. ఆ నగరములో మేము కొన్నిదినములు గడిపితిమి.

13. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీతీరమున ప్రార్థన జరుగునని తెలిసికొని అచటకి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మ్లాడితిమి.

14. మా బోధలు విన్న వారిలో తియతైర నగరమునుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె ఊదా వర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్థురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి, పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను.

15. అప్పుడు ఆమెయు, ఆమె ఇంటివారలును, జ్ఞాన స్నానమును పొందిరి. ”నేను ప్రభువునందు నిజమైన విశ్వాసముగలదాననని, మీరు నిశ్చయించియున్నచో, మా ఇంటికి వచ్చి బసచేయుడు” అని ఆమె ప్రాధేయ పడగా మేము అందులకు సమ్మతించితిమి.

ఫిలిప్పీ చెరసాలలో పౌలు, సిలాసులు

16. ఒకనాడు మేము ప్రార్థనాస్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలిసి కొంటిమి. ఆమె భూతావిష్టురాలై సోదెచెప్పుచు తన యజమానులకు చాల డబ్బు సంపాదించి పెట్టు చుండెను.

17. ఆమె పౌలును, మమ్మును వెంబడించి, ”ఈ మనుష్యులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు. మీరు ఎట్లు రక్షింపబడగలరో, వీరు మీకు తెలియజేయుదురు” అని బిగ్గరగా అరచుచుండెను.

18. ఆమె చాల రోజులు అట్లే అరచుచుండెను. పౌలు విసుగుచెంది వెనుకకు తిరిగి, ”యేసుక్రీస్తు నామమున, నీవు ఈమెనుండి వెడలిపొమ్ము అని నేను ఆజ్ఞాపించు చున్నాను” అని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను వీడిపోయెను.

19. అందుచే, అప్పుడు ఆమె యజమానులు దీని వలన ఇక తాము డబ్బు సంపాదించు అవకాశము పోయెనని తెలిసికొని, పౌలును సిలాసును పట్టుకొని, ప్రజాన్యాయస్థానము లోని అధికారుల వద్దకు ఈడ్చుకొనిపోయిరి. 20. వారు, వారిని న్యాయమూర్తుల సమక్షమునకు తెచ్చి, ”యూదులైన వీరు, మన నగరములోని కలతలకు కారకులైయున్నారు.

21. వీరు మన చట్టమునకు విరుద్ధమైన ఆచారములను ప్రచారము చేయు చున్నారు. మనము రోమీయులము కనుక ఆ ఆచారములను అనుసరింపలేము” అని ఫిర్యాదు  చేసిరి.

22. అపుడు జనసమూహమును, వారితో కలిసి, వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ  న్యాయమూర్తులు పౌలు, సిలాసుల దుస్తులను చింపివేసి, వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.

23. అట్లు క్రూరముగా క్టొట్టిన పిమ్మట, వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గ్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి.

24. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి, వారి కాళ్ళను రెండు కొయ్యదుంగల మధ్య బంధించెను.

25. దాదాపు అర్ధరాత్రివేళ పౌలు, సిలాసులు ప్రార్థించుచు, దైవస్తుతి గీతములను పాడుచుండగా, ఖైదీలు వాటిని వినుచుండిరి.

26. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా, ఆ చెరసాల పునాదులు కంపించి, ఒక్కసారిగా తలుపులన్నియు తెరచుకొనెను. అందలి బంధితుల సంకెళ్ళు భళ్ళున తెగి క్రిందబడెను.

27. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నియు తెరచుకొనుట చూచి ఖైదీలందరు తప్పించుకొని పారిపోయి యుందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని ఒరనుండి లాగి, తనను తాను చంపుకొనబోయెను.

28. అది చూచి పౌలు ఎలుగెత్తి, ”ఓయీ! నీవు ఏ హానియు చేసికొనవలదు. మేమందరము ఇక్కడనే ఉన్నాము” అని బిగ్గరగా అనెను.

29. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి, లోనికి పరుగెత్తి, గడగడ వణకుచు పౌలు, సిలాసుల పాదముల వద్ద పడెను.

30. అతడు వారిని బయటకు తీసికొని వచ్చి, ”అయ్యలారా!  రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను?” అని అడుగగా, 31. ”నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు” అని చెప్పిరి.

32. వారు అతనికిని, అతని ఇంటిలోని వారికిని ప్రభువు వాక్కును బోధించిరి.

33. ఆ రాత్రివేళనే చెరసాల అధికారి వారిని తీసికొని వెళ్ళి, వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడును, అతని కుటుంబమును జ్ఞానస్నానమును పొందిరి.

34. అతడు పౌలును, సిలాసును ఇంటి లోపలకు తీసికొనిపోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబసమేతముగా సంతోషభరితుడయ్యెను.

35. మరునాటి ఉదయమున న్యాయమూర్తులు, ”ఆ మనుష్యులను పోనిండు” అని రక్షకభటులకు ఆజ్ఞాపించిరి.

36. కావున చెరసాల అధికారి పౌలుతో, ”నిన్నును, సిలాసును విడుదలచేయుడని న్యాయ మూర్తులు ఆజ్ఞ పంపియున్నారు. కనుక మీరు ప్రశాంతముగా వెళ్ళిపొండు” అని తెలిపెను.

37. కాని, పౌలు ఆ రక్షకభటులతో, ”తీర్పు విధింపకయే రోము పౌరులమైన మమ్ము వారు బహిరంగముగ కొరడాలతో క్టొట్టి, చెరలో వేసిరి. ఇప్పుడు మమ్ము రహస్యముగా పంపివేయ దలచుచున్నారా? అది ఏ మాత్రము వీలులేదు. వారే స్వయముగా ఇక్కడకు వచ్చి మమ్ము బయటకు తీసికొనిపోవలెను” అని చెప్పెను.

38. రక్షకభటులు ఈ మాటలను న్యాయ మూర్తులకు నివేదించిరి. పౌలు, సిలాసు రోము పౌరులని విన్నప్పుడు ఆ న్యాయమూర్తులు భయపడి, 39. అక్కడకు వెళ్ళి వారిని క్షమాపణ వేడుకొని, చెరసాలనుండి వెలుపలకు తీసికొనివచ్చి, నగరమును విడిచి పొండని బ్రతిమాలుకొనిరి.

40. అప్పుడు పౌలు, సిలాసులు చెరసాలను విడిచి లిదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ వారు సోదరులను కలిసికొని, వారిని ప్రోత్సహించి అటనుండి వెళ్ళిపోయిరి.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము