యేసు నూతన నిబంధన

ప్రధానయాజకుడు

8 1. మనము చెప్పుచున్న విషయసారాంశమిది. పరలోకమున సర్వేశ్వరుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉండెడి ప్రధానయాజకుని మనము పొందియున్నాము.

2. ఆయన పరమపవిత్రమగు, అనగా మానవనిర్మితము కాని, దేవునిచే ఏర్పరుపబడిన నిజమైన గుడారమున ప్రధానయాజకుడుగ ఉండును.

3. ప్రతి ప్రధానయాజకుడును దేవునికి కానుకలను అర్పించుటకును, బలులను సమర్పించుటకును నియమింపబడును. కనుకనే మన ప్రధానయాజకుడు సమర్పించుటకును ఏదియో ఒకటి ఉండవలెను.

4. ఆయన ఇంకను భూమియందే ఉన్నచో, యూదుల నిబంధనల ననుసరించి కానుకలను అర్పించు యాజకులు ఉన్నారు కనుక, ఆయన యాజకుడే కాకపోయి ఉండును.

5. యాజకులుగ వారు చేయుపని యథార్థముగ పరలోకమందుండు దానికి కేవలము అనుకరణమును, ఛాయామాత్రమునై ఉన్నది. మోషే గుడారమును నిర్మించునపుడు ”పర్వతముపై నీకు ప్రదర్శింప బడిన మాదిరిగ అన్ని అమర్చబడునట్లు జాగ్రత్తపడుము” అని దేవుడాతనితో చెప్పెను.

6. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడియున్నందున, దేవునికిని మానవులకును మధ్య, క్రీస్తు ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్ఠమైనది. అటులనే వారి కంటె చాల గొప్పదగు యాజకత్వకార్యము యేసునకు ఇయ్యబడెను.

7. మొదటి నిబంధన కొరత లేనిదైనయెడల రెండవ నిబంధనకు అవసరమే ఉండియుండక పోవును.

8. కాని, దేవుడు తనప్రజలయందు దోషమును ఎత్తి చూపి, యిట్లు చెప్పెను.

               ”ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:

               యిస్రాయేలు ప్రజలతోను, యాదాతెగతోను

               నేను ఒక క్రొత్త నిబంధనను

               చేసికొను దినములు సమీపించుచున్నవి.

9.           ఐగుప్తు దేశమునుండి బయల్వెడలుటకు,

               వారిని నేను చేయిపట్టుకొని నడిపించిననాడు,                       

వారి పూర్వులతో నేనొనర్చుకొనిన

               నిబంధనవలె ఇది ఉండదు.

               నేను వారితో ఒనర్చుకొనిన నిబంధనకు

               వారు కట్టుబడియుండలేదు,

               కావున వారిని గూర్చి నేను శ్రద్ధవహింపలేదు                           

అని ప్రభువు చెప్పుచున్నాడు.

10.         తదనంతరము, యిస్రాయేలు ప్రజలతో

               నేనొనర్చుకొను నిబంధన ఇది

               అని ప్రభువు చెప్పుచున్నాడు:

               నా చట్టములనువారి మనస్సులందు ఉంచెదను.                   

వారి హృదయములపై వానిని వ్రాయుదును.

               నేను వారికి దేవుడనై ఉందును,

               వారు నా ప్రజలై ఉందురు.

11.           ‘ప్రభువును తెలుసుకొనుడు’ అని

               వారి యందెవ్వరును ఇరుగు పొరుగులకు గాని,

               స్వజాతీయులకుగాని బోధింపవలసి ఉండదు.                        

అత్యల్పునినుండి అత్యధికునివరకు

               అందరు నన్ను తెలుసుకొందురు.

12.          వారి దోషములపై నేను దయచూపుదును.

               వారి పాపములనుఇకజ్ఞాపకము ఉంచుకొనను.”

13. క్రొత్తనిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటిదానిని పాతదిగచేసెను. పాతదై  శిథిలమగు  ఏదియైనను త్వరలో కంటికి కనబడకుండ పోవును.