మహోన్నతుడైన ప్రభువునకు స్తుతిగీతము

147 1.     మీరు ప్రభువును స్తుతింపుడు.

                              మన ప్రభువును కీర్తించుట మంచిది.

                              ఆయనను కీర్తించుట యుక్తము,

                              మనోరంజిత కార్యము.

2.           ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించెను. యిస్రాయేలు బందీలను

               స్వీయదేశమునకు కొనివచ్చెను.

3.           భగ్నహృదయుల బాధలుతీర్చి

               వారి గాయములకు కట్లుకట్టెను.

4.           ఆయన నక్షత్రములను లెక్కపెట్టును,

               ప్రతి తారకకును పేరు పెట్టును.

5.           మన ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు,

               అపారమైన జ్ఞానముకలవాడు.

6.           ప్రభువు దీనులను లేవనెత్తును.

               దుష్టులను నేలకు అణగద్రొక్కును.

7.            ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు పాడుడు.

               తంత్రీవాద్యముతో ఆయనను వినుతింపుడు.

8.           ఆయన ఆకాశమును మేఘములతో కప్పును.

               నేలపై వానలు కురియించును.

               కొండలపై గడ్డిని ఎదుగజేయును.

9.           పశువులకును, కావుకావుమని అరచు

               కాకి పిల్లలకును గ్రాసమొసగును.

10.         ఆయన అశ్వబలమును మెచ్చడు.

               నరుల శౌర్యమును చూచి మురిసిపోడు.

11.           తనపట్ల భయభక్తులు చూపువారనిన,

               తన కృపకొరకు కాచుకొనియుండు

               వారనిన ఆయనకు ఇష్టము.

12.          యెరూషలేమూ! ప్రభువును స్తుతింపుము.

               సియోనూ! నీ దేవుని కొనియాడుము.

13.          ఆయన నీ కవాటములను బలపరుచును.

               నీ పౌరులను దీవించును.

14.          నీ పొలిమేరలను సురక్షితము చేయును.

               నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును.

15.          ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును.

               ఆయన వాక్యము వడివడిగా పరుగెత్తుకొనివచ్చును

16.          ఆయన నేలపై మంచును దుప్పివలె పరచును.

               నూగు మంచును బూడిదవలె వెదజల్లును.

17.          వడగండ్లను కంకరవలె కురిపించును.

               ఆయన పంపు చలినెవడు భరింపగలడు?

18.          ఆ మీదట ఆయన ఆజ్ఞనీయగా మంచు కరగును.

               గాలి వీచునట్లు చేయగా నీళ్ళు పారును.

19.          ఆయన తన వాక్కును యాకోబునకు విన్పించును.

               తన కట్టడలను, ధర్మవిధులను

               యిస్రాయేలీయులకు ప్రకించును.

20.        అన్యజాతులకు ఆయన ఇి్ట కార్యమును చేయలేదు

               ఆయన ధర్మవిధులు వారికి తెలియవు.

               మీరు ప్రభువును స్తుతింపుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము