ఉపోద్ఘాతము:

పేరు: పునీత పౌలుగారి లేఖలలో వేదాంత నియమబద్ధత గలది ఈ లేఖ. రోము నగరంలోని క్రైస్తవ సంఘానికి వ్రాయడం వలన ఆ పట్టణం పేరుతో పిలిచారు (అ.కా. 2:10). క్రీ.పూ. 2 వ శతాబ్దం నుండి రోము నగరంలో యూదులు నివాసమున్నారు.

కాలము: క్రీ.శ. 56-58ల మధ్య.

రచయిత: పునీత పౌలుగారు (1:1; 16:22).

చారిత్రక నేపథ్యము: పునీత పౌలు గారి లేఖలకు ఆయా సంఘాల పరిస్థితి, సమస్యలు నేపథ్యంగా వున్నాయి. ఆసియా ప్రాంతంలో పౌలు తన క్రైస్తవ సంఘ సేవ ముగించుకొని స్పెయిను దేశానికి వెళ్లడానికి ముందు రోము వెళ్లారు (15:14-23; అ.కా. 19-21). ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ లేఖను రాసివున్నారు.  అన్యజనుల మధ్య తాను చేసిన సువార్తా సేవా ఫలితాలు రోమీయులకు కూడా అందాలని కోరుకున్నారు (1:13). రోము నగరంలో భిన్న మతాలు, విభిన్న భాషలు, సంస్కృతులు, పలురకాల వ్యాపారాలు కనిపిస్తాయి. అచ్చట అనేక బోధనలు, సిద్ధాంతాలు కూడా ప్రచారంలో ఉండేవి.  వాటిలో కొన్ని క్రీస్తుకు, క్రైస్తవత్వానికి వ్యతిరేకమైనవి ఉన్నాయి. ఈ అసత్య ప్రచారాలను తిప్పి కొట్టడానికి సరియైన వాదనలతో ఈ లేఖను రాశారు పునీత పౌలు గారు.

ముఖ్యాంశములు: పునీత పౌలు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను చర్చించారు. అవి: మానవ ప్రవృత్తి (1:21-23, 25, 28, 32). దేవుని దర్శనం (1:24, 26, 28), నీతి, అవినీతి ప్రభావం (1:21, 26-31). దేవుని తీర్పు (2:1-16), నీతిమంతులు (3:1-31). విశ్వాస పిత అబ్రాహాము (4:1-25), ఆదాము-క్రీస్తు (5:12-21), క్రీస్తు నందు బప్తిస్మం (6:1-14), ధర్మశాస్త్రం(7:7-32), ఆత్మగతమగు జీవితం (8:1-17), క్రీస్తునందలి దేవుని ప్రేమ (8:31-38), దేవుని ఆగ్రహం-అనుగ్రహం (9:19-29), సహోదరభావం-తీర్పు (14:1-23).

క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తు రెండవ ఆదాము.  పాప విమోచన ప్రసాదించి విశ్వాసులందరిని నీతిమంతులుగా చేశారు.  క్రీస్తు పాపశిక్షా విధిని తనపై మోపుకొని మనకు తన నీతిని ఉచితముగా అందించారు.  క్రీస్తు మరణ పునరుత్థానాలు మన  పాప విమోచనకు మూలకారణం.