ఉత్తరువులు

4 1.  కనుక  సోదరులారా!  మీరు నాకు ఎంతో ప్రియులు. మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా! ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను.

2. ప్రభువునందు ఏకమనస్కులై ఉండుడని యువోదియను, సుంతుకేనును వేడుకొనుచున్నాను.

3. విశ్వాసపాత్రుడవు, నా సహకారివి అగు నిన్ను కూడ అర్థించుచున్నాను. నీవు ఈ స్త్రీలకు సాయపడవ లెనని నా కోరిక. ఏలయన, సువార్త ప్రచారమున వారు నాతోను, క్లెమెంటుతోను, తదితరులగు నా సహప్రచారకులతోను, కలసి కష్టపడి పనిచేసిరి. వారి నామములు దేవుని జీవగ్రంథమునందు చేర్చబడినవి.

4. ప్రభువునందు   మీరు   ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను. ఆనందింపుడు!

5. అందరియెడల సాత్త్వికముగ ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు.

6. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు  ఏమి అవసరమో వానికొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కాని, ఆ విధముగ అర్థించునపుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు.

7. మానవ అవగాహనకు అతీతమైన దేవునిశాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగ ఉంచును.

8. నా సోదరులారా! చివరి మాటగా చెప్పుచు న్నాను. మంచివియు, స్తుతిపాత్రములునైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి.

9. నా మాటలనుండియు, చేతలనుండియు మీరు గ్రహించినవానిని, పొందినవానిని, ఆచరణలో పెట్టుడు. శాంతిని ఒసగు దేవుడు మీకు తోడగునుగాక!

వరమునకు కృతజ్ఞత

10. ఇంతకాలము తరువాత నాయందు మీకు శ్రద్ధ సజీవముగ మారినందుకు, ప్రభువునందు నేను ఎంతయో ఆనందించుచున్నాను. నాయందు మీరు శ్రద్ధ కలిగివున్నను, మీ శ్రద్ధను నిరూపించుకొను అవకాశము ఇంతవరకు లభింపలేదుకదా!

11.నేను ఏదో నిర్లక్ష్యపరచబడితిని అను అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకుట లేదు. ఏలన, నాకు ఉన్నవానితో సంతృప్తిపడుట నేను నేర్చుకొంటిని.

12. కలిమి లేములలో ఉండుట అననేమియో నాకు తెలియును. నాకు ఆకలిగా ఉన్నను, లేక కడుపునిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును, ఎచ్చటను సంతృప్తిగ ఉండుట అను రహస్యమును నేను నేర్చుకొంటిని.

13. క్రీస్తు అను గ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను.

14. కాని నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీ మంచితనమే కారణము.

15. సువార్తను బోధింప నారంభించిన మొదటి దినములలో నేను మాసిడోనియా వదలి వచ్చినపుడు మీ సంఘము మాత్రమే నాకు సాయపడినదని ఫిలిప్పీయులగు మీకే బాగుగా తెలియును. నా లాభనష్టములలో పాల్గొను వారు మీరు ఒక్కరే.

16. తెస్సలోనికలో నాకు సాయము అవసరమైనపుడు పెక్కుమారులు, మీరు నాకు సహాయము పంపితిరి.

17. కానుకలు పొందవలెనని నాకు కోరిక ఉన్నదను కొందురేమో! అటుల కాదు. మీ లెక్కకు విస్తారఫలము కలుగవలెనని కోరుచున్నాను.

18. నేను అన్నియును సమృద్ధిగ పొందితిని. అవసరముకంటె ఎక్కువగనే మీరు నాకు ఒసగితిరి. ఎపఫ్రోదితు మీ కానుకలను నాకు అందించినాడు. ఇవి సువాసనా భరితమై దేవునకు అర్పింపబడినవి. కనుక ఆయనకు ఆమోదయోగ్యమై, ప్రీతికరమై ఉన్నవి.

19. క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యముల కనుగుణముగా నా దేవుడు మీ అవసరములనన్నిటిని తీర్చును. 20. తండ్రియైన మనదేవునికి సదా మహిమ కలుగునుగాక! ఆమెన్‌.

తుది శుభాకాంక్షలు

21. క్రీస్తు యేసునకు చెందిన పవిత్ర ప్రజలందరకు నా శుభాకాంక్షలు. ఇచటనున్న నా సోదరులు మీకు తమ శుభాకాంక్షలను అందజేయుచున్నారు.

22. ఇచటి పవిత్రులందరును, విశేషించి, చక్రవర్తి ఇంటివారును మీకు శుభాకాంక్షలు పలుకుచున్నారు.       

23. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహము మీ ఆత్మతో ఉండునుగాక!