ముందు చూపుగల గృహనిర్వాహకుడు
16 1. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: ”ఒక ధనవంతునివద్ద గృహనిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను.
2. యజమానుడు అతనిని పిలిచి, ‘నిన్నుగూర్చి నేను వినుచున్నది ఏమి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు’ అని చెప్పెను.
3. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: ‘ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తిలేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది.
4. గృహనిర్వాహకత్వమునుండి తొలగింపబడినప్పుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను’ అని, 5. యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో ‘నీవు నా యజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు?’ అని అడిగెను.
6. వాడు ‘నూరు మణుగుల నూనె’ అని చెప్పెను. అపుడు అతడు వానితో ‘నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము’ అని చెప్పెను.
7. అంతట అతడు రెండవవానితో ‘నీవు ఎంత ఋణ పడి ఉంటివి?’ అని అడిగెను. వాడు ‘నూరుతూముల గోధుమలు’ అని బదులుపలికెను. అపుడు వానితో ‘నీ ఋణపత్రము తీసికొని ఎనుబది అని వ్రాసికొనుము’ అనెను.
8. ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజలకంటె యుక్తిపరులు.
9. ”అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన, ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.
10. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడుగా ఉండును. అల్పవిషయములలో నమ్మదగనివాడు, గొప్ప విషయములలోను నమ్మదగనివాడుగా ఉండును.
11. కనుక, ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగినవారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును?
12. పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగినవారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును?
13. ”ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన, వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును. లేదా, ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును, ద్రవ్యమును సేవింపలేరు.”
మరికొన్ని సూక్తులు
(మత్తయి 11:12-13; 5:31-32; మార్కు 10:11-12)
14. ధనలోభులగు పరిసయ్యులు ఈ మాటలు అన్నియు విని ఆయనను హేళనచేయుచుండగా, 15. యేసు వారితో ఇట్లు పలికెను: ”మనుష్యుల యెదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పు కొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును.
భార్యా పరిత్యాగము
16. ”యోహాను కాలమువరకు మోషే ధర్మ శాస్త్రము, ప్రవక్తల ప్రవచనములు ఉన్నవి. ఆనాటి నుండి, దేవునిరాజ్య సువార్త ప్రచారము చేయబడుచునే ఉన్నది. ప్రతిఒక్కడు అందులో ప్రవేశింపగట్టిప్రయత్నము చేయుచున్నాడు. 17. ధర్మశాస్త్రమునుండి ఒక్క పొల్లుపోవుటకంటె భూమ్యాకాశములు గతించుట సులభతరము.
18. ”తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు. పరిత్యజింపబడిన స్త్రీని వివాహమాడువాడును వ్యభిచరించుచున్నాడు.
ధనికుడు – లాజరు
19. ”ధనవంతుడొకడు పట్టువస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపు చుండెను. 20. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. 21. వాడు ఆ ధనికుని బల్ల మీదనుండి జారిపడు మెతుకులకొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను.
22. ఆ నిరుపేద మరణింపగా, దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
23. అప్పుడతడు బాధపడుచు పాతాళమునుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను.
24. అతడు అంగలార్చుచు ‘తండ్రీ అబ్రహామా! నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడి పోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలోముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము’ అనెను.
25. అందుకు అబ్రహాము, ‘కుమారా! మరువకుము. నీ జీవితములో నీవు సకలసంపదలను అనుభవించు చుండ, లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖ పడుచున్నాడు.
26. అంతేకాక, మనమధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు. ఇచివారు అచటకు పోలేరు’ అని పలికెను.
27-28. అందుకు ధనవంతుడు ‘అట్లయిన నాదొక మనవి. నాకు ఐదుగురు సహోదరులున్నారు. వారు కూడ ఈ ఘోరనరకమునకు రాకుండ హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి యింటికి పంపుము’ అనెను.
29. అందుకు అబ్రహాము ‘వారిని హెచ్చరించు టకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును’ అని సమాధానమిచ్చెను.
30. ‘అది చాలదు తండ్రీ! అబ్రహామా! మృతులలోనుండి ఎవరైన వారి వద్దకు వెళ్ళినయెడల వారికి హృదయ పరివర్తనము కలుగును’ అని అతడు మరల పలికెను.
31. అందులకు అబ్రహాము ‘మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు, మృతులలోనుండి ఒకడు సజీవుడై, వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు’ అని ప్రత్యుత్తరమిచ్చెను”.