20 1. నూతన సంవత్సరారంభము రాజులు యుద్ధమునకు పోవుటకు అనువైన కాలము. అప్పుడు యోవాబు సైన్యములతో పోయి అమ్మోనీయుల రాజ్యము మీదపడెను. వారి రాజధాని రబ్బానగర మును ముట్టడించి సర్వనాశనముచేసెను. దావీదు యెరూషలేముననే యుండెను.

2. అమ్మోనీయుల దేవత మిల్కోమునకు రెండుమణుగుల బంగారు కిరీటముకలదు. దానిలో ఒకరత్నము కలదు. దావీదు ఆ కిరీటమును తీసికొని ఆ రత్నమును తన కిరీట మున పెట్టుకొనెను. అతడు రబ్బా నగరమునుండి కొనివచ్చిన కొల్లసొమ్మునుగూడ విస్తారముగా స్వీకరించెను.

3. దావీదు ఆ నగరపౌరులను కొనివచ్చి వారిచే రంపములతో, ఇనుపదంతెలతో,  గొడ్డళ్ళతో చాకిరి చేయించెను. అమ్మోనీయ నగరములు అన్ని పట్ల అతడు ఇదే పద్ధతిననుసరించెను. ఆ పిమ్మట అతడు సైన్యములతో యెరూషలేమునకు తిరిగి వచ్చెను.

4. అటుపిమ్మట గేసేరువద్ద ఫిలిస్తీయులతో పోరు జరిగెను. ఈ యుద్ధమున హూషా నగరవాసియైన సిబ్బెకాయి ఫిలిస్తీయ రాక్షసుడు సిప్పయిని వధించెను. దానితో ఫిలిస్తీయులు లొంగిపోయిరి.

5. ఫిలిస్తీయులతో మరల యుద్ధము జరిగెను. ఈ రణమున యాయీరు కుమారుడైన ఎల్హానాను  అనువాడు లహ్మీని చంపెను. ఇతడు సాలెవాని మగ్గపు బద్దవిం పెద్ద యీటెగల గాతు నివాసి గొల్యాతు తమ్ముడు. 

6. గాతువద్ద మరల సమరము జరిగెను. ఈ యుద్ధమున మిగుల యెత్తరియై రెండు చేతులకును రెండు కాళ్ళకును ఆరేసి వ్రేళ్ళచొప్పున మొత్తము ఇరువదినాలుగు వ్రేళ్ళుగల రెఫాయీయు డొకడుండెను.

7. వాడు యిస్రాయేలీయులను సవాలుచేయగా దావీదు సోదరుడగు షిమ్యా కుమారుడైన యెెూనాతాను వానిని సంహరించెను.

8. పై ముగ్గురు గాతునకుచెందిన రెఫాయీయులు. దావీదు, అతని సైనికులును వారిని హతమార్చిరి.