48 1. తెగలపేరులివి: ”ఉత్తరమున హామాతు మార్గమును హెత్లోనుకు పోవు సరిహద్దువరకును, హాసారుఏనోను అను దమస్కు సరిహద్దువరకును హామాతు సరిహద్దు మార్గమున వ్యాపించి తూర్పు నుండి పడమర వరకు దాను భాగముండును.
2. దాను సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పడమర వరకును ఆషేరు భాగముండును.
3. ఆషేరు సరి హద్దును ఆనుకొని, తూర్పునుండి పడమరవరకును నఫ్తాలి భాగముండును.
4. నఫ్తాలీ సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పడమరవరకును మనష్యే భాగముండును.
5. మనష్యే సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పడమరవరకును ఎఫ్రాయీము భాగ ముండును.
6. ఎఫ్రాయీము సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పడమరవరకును రూబేను భాగ ముండును.
7. రూబేను సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పశ్చిమము వరకును యూదాభాగముండును.
మధ్యలో ప్రత్యేకభాగము
8. యూదా సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పడమర వరకును వ్యాపించియున్న భూమి మీరు ప్రభువునకు నివేదించు ప్రతిష్ఠితస్థలము. అది ఇరువది ఐదువేల మూరల వెడల్పును కలిగియుండి, తక్కిన భాగములవలెనె తూర్పు నుండి పడమర వరకు నిడివి కలిగియుండును. దీని మధ్యన పవిత్రస్థలము ఉండ వలయును.
9. మీరు దేవునికి నివేదించు స్థలము ఇరువది ఐదువేల మూరల పొడవును, పదివేల మూరల వెడల్పును కలిగియుండును.
10. ఈ పవిత్రస్థలమును ఈ విధముగా విభజింపవలయును. ఒకభాగము యాజకులపరము కావలయును. అది ఉత్తరమున ఇరువదిఐదువేల మూరల పొడవును, పశ్చిమము, తూర్పులందు పదివేల మూరల వెడల్పును, దక్షిణ మున ఇరువదిఐదు వేల మూరల పొడవును ఉండును. ప్రభువు మందిరము ఈ నేలనడుమన ఉండును. 11. ఈ పవిత్ర స్థలము సాదొకు వంశజులైన యాజకులకు చెందును. లేవీ తెగలవారివలె వారు దుష్కార్యములు చేసిన యిస్రాయేలీయులతో చేతులు కలపక నన్ను విశ్వాసముతో సేవించిరి.
12. కనుక వారికి ప్రతిష్ఠిత స్థలమునందు లేవీయుల సరిహద్దు దగ్గర ఒక ప్రత్యేక భాగముండవలయును. అది అన్నింకంటె పవిత్ర మైన భాగము.
13. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకును ఒక భాగముండును. అది ఇరువది ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పు ఉండవలయును.
14. అది యావేకు ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏమాత్రపు భాగమునైనను వారు అమ్మకూడదు. మారకము చేయరాదు. ఆ భూమి యొక్క ప్రథమఫలములను ఇతరులను అనుభవింప నీయకూడదు.
15. ఇరువదిఐదువేల మూరల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన ఐదువేలమూరల నేల పవిత్రమైనది కాదు. ప్రజలు దానిని ఇండ్లు, బీళ్ళు మొదలైన సామాన్య అవసరములకు వాడుకోవచ్చును. దాని నడుమ ఒక పట్టణముండును.
16. దాని పరిమాణ వివరమేదనగా: ఉత్తరదిక్కున నాలుగు వేల ఐదువందల మూరలు, దక్షిణ దిక్కున నాలుగువేల అయిదువందల మూరలు, తూర్పుదిక్కున నాలుగువేల అయిదువందల మూరలు, పడమి దిక్కున నాలుగువేల అయిదు వందల మూరలు.
17. పట్టణమునకు చేరిన ఖాళీస్థలము ఉత్తరపు వైపున రెండు వందల ఏబది మూరలు, దక్షిణపు వైపున రెండు వందల ఏబది మూరలు, తూర్పు వైపున రెండు వందల ఏబది మూరలు, పడమి వైపున రెండు వందల ఏబది మూరలు.
18. ప్రతిష్ఠితస్థలమునకు ఆనుకొని మిగిలియున్న భూమిని పట్టణములో కష్టించిజీవించువారు వ్యవ సాయమునకు వాడుకొందురు. అది తూర్పు వైపున పదివేల మూరలు పొడవు, పడమట వైపున పదివేల మూరల పొడవు.
19. పట్టణవాసులు ఏ తెగవారైనను దానిలో కష్టించి సేద్యము చేసికోవచ్చును.
20. ప్రతిష్ఠితభూమియంతయు ఇరువదిఐదు వేల మూరల చతురస్రముగానుండును. దీనిలో ఒక చతురస్రాకారస్థలము నగరమునకు ఏర్పాటు చేయ వలయును.
21. ప్రతిష్ఠితస్థానమునకును, నగరమునకు ఏర్పాటుచేయబడిన భాగమునకును ఇరుప్రక్కల మిగిలియున్న భూమిని అనగా తూర్పుదిశన ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరువదిఐదువేల మూరలు, అదే విధముగా పడమిదిశన ఏర్పడిన ఇరువదిఐదువేల మూరలుగల భూమిని, తెగలభాగమును ఆనుకొని యున్న భూభాగము అధిపతిదగును. ప్రతిష్ఠిత స్థానమును, దేవాలయమునకు నివేదింపబడిన స్థానము దానికి మధ్యగానుండును. 22. తూర్పు పడమరలుగా అధిపతి ఆస్తికి మధ్య లేవీయుల ఆస్తి మరియు నగరపు ఆస్తి యుండును. యూదీయుల సరిహద్దునకును మరియు బెన్యామీనీయుల సరిహద్దు నకును మధ్యగానున్న, లేవీయుల వారసత్వభూమి మరియు నగరమునకు ఏర్పాటైన భూమిని ఆనుకొని యున్న భూమిలో అధిపతి భూమియుండును.
ఇతర తెగలకు నేలపంపకము
23. మిగిలినయున్న తెగల భాగములు: తూర్పు నుండి పశ్చిమము వరకు బెన్యామీనీయులకు ఒక భాగము.
24. బెన్యామీను సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పశ్చిమము వరకు షిమ్యోను భాగము ఉండును.
25. షిమ్యోను సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పశ్చిమమువరకు యిస్సాఖారు భాగముండును.
26. యిస్సాఖారు సరిహద్దునానుకొని తూర్పునుండి పశ్చిమమువరకు సెబూలోను భాగ ముండును.
27. సెబూలోను సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పశ్చిమమువరకు గాదు భాగముండును.
28. గాదు సరిహద్దును ఆనుకొని దక్షిణపు సరిహద్దు నెగెబులో ప్రవేశించును. అది తామారు నుండి కాదేషు చెలమ వరకును పోవును. వాయవ్య దిక్కున ఐగుప్తు పొలిమేరలనుండి మధ్యధరా సముద్రము వరకును పోవును.
29. మీరు ఆయా తెగలకిట్లు భూమిని చీట్లువేసి పంచియీయగా వారు తమ భాగములను భుక్తము చేసికొందురు” ఇది ప్రభుడనైన నా వాక్కు.
యెరూషలేము ద్వారములు
30-31. ”యెరూషలేమునకు పన్నెండు ద్వారము లుండును. ఇవి నగరములోనుండి నిష్క్రమించుటకు మార్గములు. నగరద్వారములు యిస్రాయేలు తెగల పేర్లు కలిగియుండును. నాలుగువేల ఐదు వందల మూరల పొడవు గల ఉత్తరదిశన మూడు ద్వారములు అనగా రూబేను ద్వారము, యూదా ద్వారము, లేవీ ద్వారమును, 32. నాలుగువేల ఐదువందల మూరల పొడవు గల తూర్పుదిశన మూడు ద్వారములు అనగా, యోసేపు ద్వారము, బెన్యామీను ద్వారము, దాను ద్వారమును, 33.నాలుగువేల ఐదువందల మూరల పొడవు గల దక్షిణదిశన మూడు ద్వారములు అనగా షిమ్యోను ద్వారము, యిస్సాఖారు ద్వారము, సెబూలోను ద్వారమును, 34. నాలుగువేల ఐదు వందల మూరల పొడవుగల పశ్చిమదిశన మూడు ద్వారములు అనగా గాదు ద్వారము, ఆషేరు ద్వారము, నఫ్తాలీ ద్వారములుండును.
35. నగరము చుట్టుకొలత పదునెనిమిది వేల మూరలుండును. ఇక మీదట నగరమునకు ‘ప్రభువు ఇచటనున్నాడు’ అని పేరు పెట్టవలయును.”