1              1. దేవుని సంకల్పమువలన యేసుక్రీస్తుయొక్క అపోస్తలుడయిన పౌలు,

               మరియు మన సోదరుడైన తిమోతి,

2.           క్రీస్తునందు విశ్వాసముగల కొలొస్సీలోని

               మన సోదరులైన పవిత్రులకు వ్రాయునది:

               మన తండ్రి అయిన దేవునినుండి

               మీకు కృప, శాంతి కలుగునుగాక!

కృతజ్ఞతా స్తోత్రము

3. మేము మీ కొరకు ప్రార్థించునపుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునకు ఎల్లప్పుడును కృతజ్ఞతలు తెలుపుకొనుచుందుము.

4.  ఏలయన, యేసుక్రీస్తుపట్ల మీకుగల విశ్వాసమును పవిత్రులయెడల మీకుగల ప్రేమనుగూర్చి మేము వినియున్నాము.

5. మీయొద్దకు వచ్చిన సత్య సందేశమైన సువార్తా బోధవలన మీరు ఆ నిరీక్షణను గూర్చి వినియున్నారు. అది మీకొరకు పరలోకములో భద్రపరుచబడియున్నది.

6. మీరు దైవానుగ్రహమును గూర్చి మొట్టమొదటవిని, అది వాస్తవముగా ఏమియో తెలిసికొనిన నాటినుండి, మీ విషయములో జరిగినట్లే, సువార్త ఫలములను ఇచ్చుచు విశ్వమంతటను వ్యాప్తి చెందుచున్నది.

7. మన ప్రియతమ సహసేవకుడగు ఎపఫ్రానుండి దీనిని మీరు తెలిసికొంటిరి. అతడు క్రీస్తునకు విశ్వసనీయుడైన మనతోడి సేవకుడు.

8. అతడు ఆత్మయందలి మీ ప్రేమను గూర్చి మాకు చెప్పియున్నాడు.

9. ఈ కారణముచేత మేము మిమ్ములను గూర్చి విన్నప్పటినుండి మీ కొరకు ఎల్లప్పుడును ప్రార్థించు చున్నాము. మిమ్ములను దేవుని సంకల్పజ్ఞానముతోను, ఆయన ఆత్మ ఒసగు సమస్త వివేకముతోను, అవగాహనతోను, మూర్తీభవింప చేయవలసినదిగా మేము ఆయనను కోరుచున్నాము.

10. అపుడు మీరు ప్రభువు కోరిన విధముగా జీవింపగలరు. ఎల్లప్పుడును ఆయనకు సంతోషమును కలిగించెడి పనిని చేయుదురు. అన్ని విధములైన మంచికార్యములలోను మీ జీవితములు ఫలప్రదమగును. మీలో దేవుని గూర్చిన జ్ఞానము పెంపొందును.

11. ఆయన మహిమాన్విత శక్తివలన లభించెడి బలముతో మీరు బలవంతులు అయ్యెదరుగాక! అన్నిటిని సంతోషముతో కూడిన ఓర్పుతో సహించెదరుగాక!

12. తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యుల నుగా చేసిన తండ్రికి, మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు.

13. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగ తోడ్కొని వచ్చెను.

14. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది. మన పాపములు క్షమింపబడినవి.

క్రీస్తు యొక్క స్వరూపము – కృషి

15.          క్రీస్తు అదృశ్యుడైయున్న

               దేవునియొక్క ప్రత్యక్ష రూపము.

               ఆయన సమస్త సృష్టిలో

               తొలుత జన్మించిన పుత్రుడు.

16.          ఏలన, దేవుడు ఆయనద్వారా

               పరలోక భూలోకములందు

               కంటికి కనిపించెడి, కంటికి కనిపించని,

               అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను,

               ప్రభువులను, పాలకులను, సింహాసనములను,

               అధికారులను కూడ సృజించెను.

               దేవుడు సమస్తవిశ్వమును ఆయనద్వారా,

               ఆయన కొరకు సృష్టించెను.

17.          ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు.

               ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు.

18.          ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు.

               సమస్తమునను ఆయనయే ప్రథముడగుటకు

               ఆయన ఆదియైఉండి

               మృతులనుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు.

19.          దేవుని సొంత నిర్ణయమును

               అనుసరించియే ఈ కుమారునిలో

               దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది.

20.        ఈ కుమారునిద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరచుకొనుటకు

               దేవుడు నిశ్చయించెను.

               పరలోక, భూలోకములయందలి

               సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలిద్వారా

               తనతో సమాధాన పరచుకొనెను.

21. ఒకప్పుడు మీరు దేవునికి చాల దూరముగా ఉంటిరి. మీ దుష్టకార్యములద్వారా, దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి.

22. కాని ఇప్పుడు తన కుమారుని భౌతికమరణముద్వారా దేవుడు మిమ్ములను తన సమక్షములో పవిత్రులుగను, నిర్దోషులుగను, నిరపరాధులుగను చేయుటకు సమాధాన పరచుకొనెను.

23. అయితే మీరు దృఢముగ, నిశ్చలముగ, విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను. మీరు ఈ సువార్త వినినపుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు. ఈ సువార్త ఆకాశము క్రిందనున్న ప్రతి ప్రాణికి బోధింపబడినది. ఈ సువార్త నిమిత్తమై పౌలునైన నేను సేవకుడనైతిని.

దైవసంఘమునకు పౌలు సేవ

24. మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్నవానిని నా శ్రమలద్వారా పూర్తి చేయుచున్నాను.

25. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడనుగా చేయబడితిని. మీకు మేలుచేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమిది.

26. ఈ సందేశమును, ఆయన గతమున అన్ని యుగములలోను మానవాళినుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇపుడు దానిని తన పవిత్రులకు తెలియజేసాడు.

27. ఏలయన అన్యజనులలో తన వద్దగల రహస్యము యొక్క మహిమైశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు. అనగా మీరు దేవుని మహిమలో పాలుపంచుకొనగలరు.

28. ఇట్లు మేము ప్రజలందరికి క్రీస్తును గురించి బోధించెదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతినొందిన వానినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుటకొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతివ్యక్తిని హెచ్చరించి బోధించెదము.

29.  దీనిని నెరవేర్చుటకు క్రీస్తు నాకు ప్రసాదించిన మహత్తరమైన శక్తిని నేను వినియోగించుకొనుచు పాటు పడుచున్నాను.