యోహాను శిరచ్ఛేదనము
(మార్కు 6:14-29; లూకా 9:7-9)
14 1. ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, 2. ”ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుతశక్తులు ఇతనియందు కనిపించు చున్నవి” అని తన కొలువుకాండ్రతో చెప్పెను.
3. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను.
4. ఏలయన, ”ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు” అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. 5. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను.
6. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, 7. ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్ధానము చేసెను.
8. అపుడు ఆమె తన తల్లి ప్రోత్సాహమువలన ”స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము” అని అడిగెను.
9. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిథుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి, 10. సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్ఛేదనము గావించెను.
11. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను.
12. అంతట యోహాను శిష్యులు వచ్చి, అతని భౌతికదేహమును తీసికొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి.
ఐదువేల మందికి ఆహారము
(మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-14)
13. యేసు ఈ వార్తవిని, అచటనుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్తవిని తమ పట్టణములనుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి.
14. యేసు ఒడ్డునుచేరి గొప్ప జన సమూహమును చూచి, జాలిపడి, వారిలోని వ్యాధి గ్రస్తులను స్వస్థపరచెను.
15. సాయంసమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి ”ఇది నిర్జనప్రదేశము. వేళ అతిక్రమించినది. ఇక వారిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి, వారికి కావలసిన ఆహారపదార్థములను సమకూర్చుకొందురు” అని మనవి చేసిరి.
16. అప్పుడు యేసు ”వీరిని పంపివేయవలసిన అవసరము లేదు. మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు” అని శిష్యులతో అనెను.
17. ”మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప మరేమియు లేవు” అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.
18. ”వాిని ఇచటకు తీసికొని రండు” అని చెప్పి 19. యేసు ఆ జనసమూహము లను పచ్చికబయళ్ళమీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను; ఆ అయిదు రొట్టెలను, రెండు చేపలను తీసికొని ఆకాశమువైపు చూచి వాటిని ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి.
20. వారందరు భుజించి సంతృప్తిచెందిన మీదట మిగిలినముక్కలను పండ్రెండు గంపలనిండ ఎత్తిరి.
21. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక, దాదాపు అయిదువేల మంది పురుషులు వున్నారు.
నీటిపై నడక
(మార్కు 6:45-52; యోహాను 6:15-21)
22. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తన కంటె ముందుగా ఆవలిదరికి చేరవలయునని ఆజ్ఞాపించెను.
23. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండమీదికి వెళ్ళెను. సాయంసమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను.
24. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలదూరము పోయెను.
25. వేకువజామున యేసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను.
26. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ”ఇది భూతము” అని కేకలు వేసిరి.
27. వెంటనే యేసు వారితో, ”భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా!” అని పలికెను.
28. పేతురు అంతట ”ప్రభూ! నిజముగా నీవే అయిన నీిమీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ యిమ్ము” అనెను.
29. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి, నీటిపై నడచి, ఆయన యొద్దకు వచ్చుచుండెను.
30. కాని, ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగి పోవుచు ”ప్రభూ! నన్ను రక్షింపుము” అని కేకలు వేయసాగెను.
31. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, ”అల్పవిశ్వాసీ! నీవేల సందేహించి తివి?” అనెను.
32. అంతటవారు పడవనెక్కగా గాలి అణగి పోయెను.
33. పడవలోనున్న శిష్యులు ”నీవు నిజముగా దేవుని కుమారుడవు” అని పలికి ఆయనను ఆరాధించిరి.
గెన్నెసరేతు ప్రాంతీయ ప్రజలకు స్వస్థత
(మార్కు 6:53-56)
34. వారు దరికిచేరి గెన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి.
35. అచట జనులు ఆయనను గుర్తించినపుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరిని ప్రభుసన్నిధికి తీసికొని వచ్చిరి.
36. వారిని కనీసము ఆయన అంగీ అంచు నైనను తాకనీయుము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకినవారెల్లరును స్వస్థతపొందిరి.