దైనందిన ప్రార్థన
95 1. రండు, ప్రభువును సంతసముతో స్తుతింతము
మన రక్షణదుర్గమైన దేవుని
ఆనందముతో కీర్తింతము.
2. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము
సంతోషముతో కీర్తనలు పాడుచు
ఆయనను వినుతించుదము.
3. ప్రభువు మహాదేవుడు,
దైవములందరికిని మహారాజు.
4. భూగర్భము మొదలుకొని పర్వతశిఖరములవరకు
అన్నిని ఆయనే పరిపాలించును.
5. సముద్రము ఆయనది, ఆయనే దానిని చేసెను.
ధరణి ఆయనది, ఆయనే దానిని కలిగించెను.
6. రండు, శిరమువంచి ఆయనను ఆరాధించుదము
మనలను సృజించిన
ప్రభువు ముందట మోకరిల్లుదము.
7. ఆయన మన దేవుడు,
మనము ఆయన కాచి కాపాడు ప్రజలము.
ఆయన మేపు మందలము.
నేడు మీరు ఆయన మాట వినిన
ఎంత బాగుండును!
8. ”మెరిబాచెంత మీ పితరులవలె,
నాడు ఎడారిలో మస్సాచెంత
మీ పితరులవలె మీరును
హృదయములను కఠినము చేసికోవలదు.
9. నేను చేసిన కార్యములను చూచినపిదపకూడ
మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురిచేసిరి
10. నలుబదియేండ్లపాటు
ఆ తరమువారు నన్ను విసిగించిరి.
‘ఈ జనులకు నాపట్ల నమ్మకము లేదు.
వీరు నా మార్గములను గుర్తింపరు’ అని
నేను పలికితిని.
11. కనుక నేను వారి మీద ఆగ్రహము చెంది
మీరు నా విశ్రమస్థానమును
చేరజాలరని ప్రతిజ్ఞ చేసితిని.”