వ్యక్తిగతమగు శుభాకాంక్షలు
16 1. కెంక్రేయలోని క్రైస్తవ సంఘపు పరిచారకు రాలు ఫేబీ అను మన సోదరిని మీకు సిఫారసు చేయు చున్నాను. 2. దైవ ప్రజలకు తగినట్లుగ ప్రభువు నామమున ఆమెను స్వీకరింపుడు. ఆమెకు అవసరమైన సాయమును చేయుడు. ఏలయన, ఆమె అనేక మందికిని, నాకును సహాయకురాలు.
3. క్రీస్తు యేసు సేవలో నా తోటిపనివారగు ప్రిస్కాకును, అక్విలాకును నా శుభాకాంక్షలు.
4. ఏలయన, నాకొరకై వారు ప్రాణములకు తెగించిరి. నేను వారికి కృతజ్ఞుడను. నేను మాత్రమే కాదు. అన్యుల సంఘము లన్నియు వారికి కృతజ్ఞతను తెలుపుచున్నవి. 5. వారి యింట సమావేశమైయున్న క్రీస్తు సంఘమునకు శుభాకాంక్షలు.
క్రీస్తును విశ్వసించుటలో ఆసియా మండలములో ప్రథముడును, నా ప్రియమిత్రుడును అగు ఎపైనెతుకు శుభాకాంక్షలు.
6. మీ కొరకై ఎంతయో శ్రమపడిన మరియకు శుభాకాంక్షలు.
7. నాతోపాటు చెర యందున్న నా బంధువులగు అంద్రోనికకును, యూనీయకును శుభాకాంక్షలు. వారు అపోస్తలులలో ప్రసిద్ధి చెందినవారు. పైగా నాకంటె ముందు క్రీస్తును విశ్వసించినవారు.
8. క్రీస్తునందు నా ప్రియుడగు అంప్లీయతునకు నా శుభాకాంక్షలు.
9. అటులనే క్రీస్తు సేవలో నాతోటి పనివాడైన ఉర్బానునకును, మన ప్రియుడగు స్తాకునకును శుభాకాంక్షలు.
10. క్రీస్తునందు ఆమోదింపబడిన అపెల్లెకు శుభాకాంక్షలు. అరిస్టోబూలు కుటుంబమునకు శుభాకాంక్షలు.
11. నా బంధువగు హెరోది యోనునకును, నార్కిస్సు కుటుంబము నందలి క్రైస్తవ సోదరులకును శుభాకాంక్షలు.
12. ప్రభువు సేవలో కృషి చేయుచున్న త్రుఫైనా కును, త్రుఫోసాకును, ప్రభువు కొరకై ఎంతయో శ్రమ పడిన ప్రియమైన పెర్సిసునకును శుభాకాంక్షలు.
13. ప్రభుసేవలో ఉత్తమకృషి చేసిన రూఫసునకును, నన్ను కుమారునిగా చూచుకొనిన అతని తల్లికిని శుభాకాంక్షలు.
14. అసుంక్రితు, ఫ్లెగోను, హెర్మే, పత్రోబ, హెర్మాలకును, క్రైస్తవ సోదరులకు అందరికిని శుభా కాంక్షలు.
15. పిలోలోగు, జూలియాలకును, నెరెయ కును, అతని సోదరికిని, ఒలింపాకును, వారితోటి క్రైస్తవులందరికిని శుభాకాంక్షలు.
16. పవిత్రమగు ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు పలుకుడు. క్రీస్తు సంఘములన్నియు మీకు శుభాకాంక్షలు పంపుచున్నవి.
తుది ఉత్తరువులు
17. సోదరులారా! మిమ్ము ఇట్లు అర్థించు చున్నాను. చీలికలు పుట్టించు వారిని గూర్చియు, ప్రజల విశ్వాసమును తలక్రిందులు చేయువారిని గూర్చియు జాగ్రత్తగా ఉండుడు. అట్టివారు మీరు పొందిన ఉపదేశమునకు విరుద్ధముగనుందురు. వారికి దూరముగ ఉండుడు.
18. ఏలయన, అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువగు క్రీస్తుకు సేవచేయు వారు కాదు. మంచి మాటలద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు.
19. మీ విధేయతనుగూర్చి అందరు వినియేయున్నారు. కనుకనే నేను మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మంచి విషయమున వివేకవంతులై, చెడు విషయమున నిష్కపటులై ఉండవలెనని నా కోరిక.
20. మన సమాధానమునకు మూలమగు దేవుడు, త్వరలో సైతానును మీ పాదముల క్రింద చితుక త్రొక్కును. మన ప్రభువగు యేసు క్రీస్తు అనుగ్రహము మీకు తోడగును గాక!
21. నా తోటిసహచరుడు తిమోతి మీకు శుభాకాంక్షలను అందజేయుచున్నాడు. అటులనే సహ చరులగు యూదులు లూసియ, యాసోను, సోసి పత్రులు కూడ శుభాకాంక్షలు పంపుచున్నారు.
22. ఈ లేఖను వ్రాసిన తెర్తియ అను నేనును మీకు ప్రభువు నందు శుభాకాంక్షలను అందించుచున్నాను.
23. నాకును, తన గృహమున చేరు సంఘము నకు కూడ ఆతిథ్య మిచ్చు గాయియు మీకు శుభాకాంక్షలను అందించుచున్నాడు. నగర కోశాధికారి అగు ఎరాస్తు, మన సోదరుడు క్వార్తు మీకు శుభమను చున్నారు.
(24. మన ప్రభువగు యేసు క్రీస్తు అనుగ్రహము మీ అందరితో ఉండును గాక! ఆమెన్.)
తుది స్తోత్రము
25. దేవునకు మహిమ కలుగునుగాక! ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగ నిలుచునట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరుపబడిన పరమ రహస్యమును అనుసరించియు ఆయన అటుల చేసెను.
26. కాని ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరును విశ్వసించి విధేయులగుటకుగాను నిత్యుడగు దేవునిఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది.
27. అద్వితీయుడును, సర్వజ్ఞుడును అగు దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగును గాక! ఆమెన్.