పునరుత్థానము
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; యోహాను 20:1-10)
24 1. ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధద్రవ్యమును తీసికొని సమాధివద్దకు వచ్చిరి.
2. సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూచిరి.
3. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు.
4. వారికి ఏమియు తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి, వారిచెంత నిలిచిఉండిరి.
5. వారు భయపడి తలలువంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో, ”మీరు సజీవుడైన వానిని మృతులలో ఏల వెదకుచున్నారు?
6. ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు.
7. మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మూడవ దినమున సజీవుడై లేవవలయునని మీతో చెప్పెను గదా! ఆయన గలిలీయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు” అనిరి.
8. యేసు పలుకులు అపుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి.
9. వారు సమాధి నుండి తిరిగివచ్చి, పదునొకండుమంది శిష్యులకు, మిగతా వారందరికి ఈ విషయములన్నియు తెలియ జేసిరి.
10. అటుల తెలియజేసినవారు: మగ్దలా మరియమ్మ, యోహాన్నా, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు.
11. వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టుకథలుగా భావించిరి.
12. కాని పేతురు లేచి, సమాధివద్దకు పరుగెత్తి పోయి, లోపలకు వంగిచూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగివెళ్ళెను.
ఎమ్మావు మార్గములో యేసు దర్శనము
(మార్కు 16:12-13)
13. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఏడుమైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు, 14. జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి.
15. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారివెంట నడవసాగెను.
16. వారు ఆయనను చూచిరి. కాని గుర్తింప లేక పోయిరి.
17. ”మీరు నడుచుచు దేనినిగురించి మాట్లాడుకొనుచున్నారు?” అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి.
18. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు ”యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా?” అనెను.
19. ”ఏమి జరిగినది?” అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి: ”నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందును వాక్కునందును దేవునియెదుటను, ప్రజలందరి యెదుటను, శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు.
20. మన ప్రధానార్చకులు, అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువవేసిరి.
21. అయితే ఆయనయే యిస్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.
22. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతఃకాలమున సమాధియొద్దకు వెళ్ళగా, 23. అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతే కాకుండ వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగ వారువచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్య పరచిరి.
24. అంతట మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి. కాని యేసును మాత్రము చూడలేదు.”
25. అపుడు యేసు ఆ ఇద్దరితో ”ఓ అవివేకులారా! ప్రవక్తల వచనములను అన్నింటిని నమ్మని మందమతులారా! 26. క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యముకదా?” అనెను.
27. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను.
28. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను.
29. అంతటవారు ”ప్రొద్దు వాలిపోయినది. సంధ్యవేళ అగుచున్నది. మాతో ఉండుడు” అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను.
30. యేసు వారితో కూడ భోజనమునకు కూర్చుండినపుడు ఆయన రొట్టెను తీసికొని ఆశీర్వదించి, త్రుంచి వారికి ఇచ్చెను.
31. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి. కాని ఆయన అదృశ్యుడయ్యెను.
32. అంతట వారు ఒకరితో ఒకరు ”ఆయన మార్గములో మనతో మాట్లాడునపుడు, లేఖనములన్నియు మనకు వివరించునపుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా?” అనుకొనిరి.
33. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగివెళ్ళగా 34. అక్కడ పదునొకండుమంది శిష్యులును, వారితో ఉండిన వారును ”ప్రభువు వాస్తవముగ సజీవుడై లేచెను. సీమోనుకు కనిపించెను” అని చెప్పుకొనుచుండిరి.
35. అపుడు వారుకూడ మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి, ఆయన రొట్టెను విరుచునపుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి.
యేసు శిష్యులకు దర్శనము
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; యోహాను 20:19-23; అ.కా.1:3-5; 1 కొరి 15:5)
36. వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగనే యేసు వారిమధ్య నిలిచి ”మీకు శాంతి కలుగును గాక!” అనెను. 37. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి.
38. అపుడు యేసు వారితో ఇట్లు పలికెను: ”మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి?
39. నా కాళ్ళను చేతులను చూడుడు. నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు, మాంసము ఉండవు”.
40. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా,41. వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అపుడు ఆయన ”మీ వద్ద తినుటకు ఏమైన ఉన్నదా?” అని అడిగెను.
42. వారు ఆయనకు కాల్చిన చేపముక్కను ఇచ్చిరి. 43. యేసు దానిని తీసికొని, వారి ఎదుట భుజించెను.
44. ఆయన మరల ఇట్లు వారితో, ”నేను మీతో ఉన్నపుడు మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనల గ్రంథములలోను, నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి” అని చెప్పెను.
45. అపుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను: 46. ”క్రీస్తు కష్టములు అనుభవించుననియు, మూడవరోజు మృతులలోనుండి లేచుననియు 47. యెరూషలేము మొదలుకొని సకలజాతులకు ఆయన పేరిట హృదయపరివర్తనము, పాపక్షమాపణముప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.
48. వీనికి అన్నిటికిని మీరే సాక్షులు.
49. ఇదిగో, నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కాని, మీరు పైనుండి శక్తిని పొందునంతవరకును నగరముననే ఉండుడు.”
మోక్షారోహణము
(మార్కు 16:19-20; అ.కా.1:9)
50. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసికొనిపోయి, తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.
51. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోక మునకు వెడలిపోయెను.
52. వారు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి.
53. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి.