యుద్ధనాదము
8 1. ప్రభువు ఇట్లనుచున్నాడు:
బాకానూది యుద్ధనాదము చేయుడు.
నా ప్రజలు నేను వారితో
చేసికొనిన నిబంధనమును మీరి
నా ధర్మశాస్త్రమును నిరాకరించిరి.
కనుక శత్రువులు నా దేశముపై
గరుడపక్షివలె దిగివత్తురు.
2. యిస్రాయేలీయులు నేను తమ దేవుడననియు,
తాము నన్నెరుగుదుమనియు వాకొనుచున్నారు.
3. కాని వారు తమకు
హితమైన దానిని నిరాకరించిరి.
కనుక శత్రువులు వారిని వెన్నాడుదురు.
అరాచకత్వము, విగ్రహారాధనము
4. నా ప్రజలు నాకు అనుకూలురుకాని
రాజుల నెన్నుకొనిరి.
నేనెరుగని అధిపతులను నియమించిరి.
వారు తమవెండి, బంగారములతో
ప్రతిమలను చేసికొని
తమ వినాశనమును తామే కొనితెచ్చుకొనిరి.
5. సమరియా ప్రజలు కొలుచు కోడెదూడను
నేను ఏవగించుకొందును.
నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని.
వారు ఎంతకాలము
పవిత్రతనొందకుండ ఉందురు?
6. అది యిస్రాయేలువారి చేతిపనియేకదా!
ఒక కంసాలి దానిని చేసెను.
ఆ బొమ్మ దైవము కాజాలదుకదా!
సమరియా ప్రజలు కొలుచు
కోడెదూడ ముక్కలుముక్కలగును.
7. గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు.
విత్తనిదే పైరు, వెన్ను ఎట్లు పండును?
ఒకవేళ పండినను,
అన్యజాతివారు దానిని అపహరింతురు.
అన్యజాతులతో ఒప్పందము
8. యిస్రాయేలీయులును అన్యజాతుల వింవారైరి.
పగిలిపోయిన కుండవలె నిష్ప్రయోజకులైరి.
9. అడవిగాడిద తనకోరిక తీర్చుకోబోయినట్లు
యిస్రాయేలు అస్సిరియా ఆశ్రయమునకు అర్రులుచాచినది.
ఏలయన ఎఫ్రాయీము బాడుగకు
ప్రియులను రప్పించుకొనుచున్నది.
10. ఆ జనులు అన్యజాతులకు సొమ్ము చెల్లించినను,
నేను వారినెల్లరిని ప్రోగుజేసి దండింతును.
అస్సిరియా చక్రవర్తి తమను పీడింపగా
వారు త్వరలోనే తగ్గిపోవుదురు.
డంబారాధనము
11. ఎఫ్రాయీము పాపనిర్మూలమునకు
పెక్కు బలిపీఠములు నిర్మించెను.
కాని ఆ బలిపీఠములే
అతడు పాపము చేయుటకు ఆధారములయ్యెను.
12. నేను ప్రజల కొరకు
పెక్కు ధర్మశాసనములు వ్రాసితిని.
కాని వారు వానిని అన్యుల శాసనములవలె యెంచి తృణీకరించిరి.
13. వారు నాకు బలిపశువులను అర్పించి
ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు.
కాని యావే ప్రభుడనైన నేను
వారివలన ప్రీతి చెందనైతిని.
నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని
వారిని శిక్షింతును.
వారు మరల ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే.
రాజభవనములు
14. యిస్రాయేలీయులు ప్రాసాదములను నిర్మించిరి.
కాని తమ సృష్టికర్తను విస్మరించిరి.
యూదాప్రజలు సురక్షిత నగరములను క్టిరి.
కాని నేను పంపు అగ్ని వారి ప్రాసాదములను,
వారి నగరములను కాల్చివేయును.