7 1. ప్రియ మిత్రులారా! ఈ వాగ్దానములన్నియు మనకు ఒసగబడినవే. కనుక శరీరమును గాని, ఆత్మను గాని, అపరిశుద్ధ పరచు సమస్తమునుండి మనలను మనము శుద్ధి చేసికొందము. దేవునియందలి భయముతో పవిత్రముగ ఉండుటకు ప్రయత్నించుదము.

పౌలు ఆనందము

2. మీ హృదయములలో మాకు స్థాన మొసగుడు. మేము ఎవరికిని కీడు చేయలేదు. ఎవరిని పాడుచేయలేదు. ఎవరిని మోసగించుటకు ప్రయత్నింప లేదు.

3. మిమ్ము ఖండించు ఉద్దేశముతో నేను ఇట్లు చెప్పుటలేదు. ఏలయన, నేను ముందే చెప్పినట్లు మీరు మాకు ప్రియులు. అందువలననే మేము మరణించినను జీవించినను మనము ఎప్పుడును కలిసియే ఉందుము.

4. మీయందు నాకు అమిత విశ్వాసము. కనుకనే మిమ్ము చూచి గర్వింతుము. నేను సంపూర్ణ ధైర్యముతో ఉన్నాను. ఇన్ని  కష్టము లలో కూడ నా సంతోషము పొంగి పొరలుచున్నది.

5. మాసిడోనియా చేరిన తరువాత కూడ మాకు ఎట్టి విశ్రాంతియును లేకపోయెను. అన్ని చోటుల ఇబ్బందులు, అన్యులతో కలహములు, మా హృదయములందు భయములు ఉండెను.

6. కాని దుర్బల హృదయులను ఓదార్చు దేవుడే తీతు యొక్క ఆగమనము ద్వారా మమ్ము ఓదార్చెను.

7. అతని ఆగమనమే కాదు, మీరు అతనిని ఓదార్చిన వృత్తాంతము గూడ. నన్ను చూడవలెనను మీ కోరిక, చూడలేనందున మీ విచారము, నన్ను సమర్థించుటకు మీ సంసిద్ధత అతడు మాకు వివరించినాడు. ఇవి అన్నియు నాకు ఎంతయో ఆనందదాయకములైనవి.

8. నేను వ్రాసిన లేఖ మీకు విచారమే కలిగించినను, దానిని వ్రాసినందుకు నేను బాధపడుట లేదు. ఆ లేఖ మీకు క్షణకాలము బాధ కలిగించినదని తెలిసి ఒకవేళ బాధపడి ఉన్నను, 9. ఇప్పుడు మాత్రము నేను ఆనందించుచున్నాను. ఏలయన, మీకు విచారము కలిగించినందులకు మాత్రము కాదు. కాని ఆ విచారము మిమ్ము సన్మార్గమునకు మరల్చెనని మాత్రమే. ఏ విషయములోను మావలన మీరు నష్టపొందకుండుటకై దైవచిత్తానుసారముగ మీరు దుఃఖించితిరి.

10.  దైవ చిత్తానుసారముగా మీరు పొందిన దుఃఖము రక్షణకు దారిచూపు హృదయపరివర్తనమును కలిగించును. కనుక విచారింప పనిలేదు. కాని ప్రాపంచిక దుఃఖమే మృత్యుహేతువగును.

11.మీ ఈ దుఃఖములో దేవుడు ఏమి సాధించెనో గమనింపుడు. అది మీకు ఎంత ఉత్సాహము కలిగించినది! మీ నిర్దోషత్వము నిరూపించుకొనవలెనని మీకు ఎంత ఆతురత! ఎట్టి భయము! ఎట్టి అభిలాష! ఎట్టి ఆసక్తి! దోషములను శిక్షించుటకు ఎట్టి సంసిద్ధత! అన్ని విషయము లందును మీరు దోషరహితులని నిరూపించుకొనినారు.

12. కనుక నేను ఆ ఉత్తరమును అటుల వ్రాసి ఉన్నప్పటికిని దోషమొనర్చినవానిని గూర్చిగాని, దోషమునకు గురియైనవానిని గూర్చిగానివ్రాయలేదు. మమ్ము గూర్చిన మీశ్రద్ధ ఎంతగాఢమైనదో దేవుని దృష్టిలో మీకు స్పష్టము చేయుటకే నేను అది వ్రాసితిని.   

13. అందుచేతనే మేమును ధైర్యము వహించితిమి.

మేము ధైర్యము వహించుటయే కాదు, మీరు అందరును కలసి అతనిని సంతోషప్టిెన వృత్తాంత ముతో, తీతు మమ్ము చాల ఆనందపరచినాడు.

14. మిమ్ము అతని ఎదుట చాల పొగడియుంటిమి. మీరు నాకు ఆశాభంగము కలుగచేయలేదు. మీకు ఎప్పుడును సత్యమునే చెప్పితిమికదా! అట్లే తీతు ఎదుట మేము చేసిన పొగడ్తలు ఋజువైనవి.

15. కనుక మీపై అతనికి ప్రేమ అధికమగును. మీరు అందరును విధేయత చూపుటకు ఎట్లు సంసిద్ధులైనది, భయముతో వణకుచు అతనికి మీరు ఎట్లు స్వాగత మిచ్చినది అతనికి జ్ఞాపకమున్నది.

16. ప్రతి విషయములోను మీయందు నాకు నమ్మకము కలిగి యున్నందులకు నేను ఆనందించుచున్నాను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము