5 1. యేసు ఆ జనసమూహములను చూచి పర్వత మును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టుచేరిరి. 2. ఆయన నోరువిప్పి ఉపదేశింప ఆరంభించెను:

అష్ట భాగ్యములు (లూకా 6:20-26)

3.           ”దీనాత్ములు ధన్యులు

               దైవరాజ్యము వారిది.

4.           శోకార్తులు ధన్యులు

               వారు ఓదార్పబడుదురు.

5.           వినమ్రులు ధన్యులు

               వారు భూమికి వారసులగుదురు.

6.           నీతి నిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు

               వారు సంతృప్తి పరుపబడుదురు.

7.            దయామయులు ధన్యులు 

               వారు దయను పొందుదురు.

8.           నిర్మలహృదయులు ధన్యులు

               వారు దేవుని దర్శింతురు.

9.           శాంతి స్థాపకులు ధన్యులు 

               వారు దేవుని కుమారులనబడుదురు.

10.         ధర్మార్థము హింసితులు ధన్యులు

               దైవరాజ్యము వారిది.

11.           నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినపుడు, హింసించినపుడు,                నిందారోపణ గావించినపుడు మీరు ధన్యులు.

12.          మీకు ముందు వెలసిన

               ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి.

               పరలోకములో మీకు గొప్పబహుమానము గలదు.

               కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు.

ఉప్పు వెలుగు (మార్కు 9:50; లూకా 14:34-35)

13. ”మీరు భూమికి ఉప్పువలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయినయెడల దానిని తిరిగి పొందలేదు.అట్టి ఉప్పు బయటపారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని, మరెందుకును పనికిరాదు.

14. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండజాలదు.

15. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు గాని కుంచము క్రింద ఉంచరుగదా!

16. ప్రజలు మీ సత్కార్యములనుచూచి పరలోకమందున్న  మీ  తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారియెదుట ప్రకాశింపనిండు.”

ప్రాత క్రొత్త నియమములు

17. ”నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమొనర్చుటకేగాని, రద్దు చేయుటకుకాదు.

18. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. 

19. కాబట్టిఎవరైన ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోకరాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోకరాజ్యమున అత్యధికునిగా పరిగణించబడును.

20. ధర్మశాస్త్ర బోధకులకంటె, పరిసయ్యులకంటె మీరు నీతిమంత మైన జీవితము జీవించిననేతప్ప  పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను.

ఆగ్రహము – దాని స్వరూపము (లూకా 12:57-59)

21. ”నరహత్య చేయరాదు. నరహత్య కావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారుగదా!

22. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని ‘వ్యర్ధుడా!’ అని అవమానపరచినవాడు న్యాయసభముందుకు తేబడును. తన సోదరుని ‘మూర్ఖుడా’ అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. 

23. కనుక, బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినపుడు నీ సోదరునికి నీపై మనస్పర్థయున్నట్లు నీకు స్ఫురించినచో, 24. ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి, మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. 

25. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి   నిన్ను   పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.

26. నీవు చెల్లింప వలసిన ఋణములో కడపటికాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించు చున్నాను.

వ్యభిచారము – దాని రూపము

27. ” ‘వ్యభిచరింపరాదు’ అను శాసనమును మీరు వినియున్నారుగదా!

28. నేను నొక్కి వక్కాణించునదేమనగా, కామేచ్ఛతో స్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయములో  ఆమెతో వ్యభిచరించియున్నాడు.

29. కనుక, నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకములో త్రోయబడుటకంటె నీ అవయవములలో ఒకదానిని కోల్పోవుట మేలు.

30. నీ కుడిచేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుటకంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు.

భార్యా పరిత్యాగము

(మత్తయి 19:9; మార్కు 10:11-12;  లూకా 16:18)

31. ” ‘తనభార్యను విడువనెంచువాడు విడాకుల పత్రమును ఈయవలెను’ అని మీరు వినియున్నారు గదా!

32. నేనిపుడు చెప్పునదేమనగా: వ్యభిచార కారణమునతప్ప తనభార్యను విడనాడు ప్రతివ్యక్తియు ఆమెను వ్యభిచారిణిని చేసినవాడగును.  అట్లు విడనాడ బడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును.

ప్రమాణములు

33.  ” ‘నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగముచేయక నెరవేర్పవలయును’ అని పూర్వీకు లకు చెప్పబడినదని మీరు వినియున్నారుకదా!

34. కాని నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా:  మీరు ఎంత మాత్రమును ఒట్టుపెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టుపెట్టుకొనరాదు. ఏలయన, అది దేవుని సింహాసనము.

35. భూలోకముపై ఒట్టుపెట్టుకొనరాదు. ఏలయన, అది ఆయన పాదపీఠము. యెరూషలేము పై ఒట్టు పెట్టుకొన కూడదు. ఏలయన, అది ఆ మహారాజు నగరము.

36. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా గాని లేక తెల్లగాగాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టుపెట్టుకొనకుము.

37. మీరు చెప్పదలిచినది  ‘ఔను’ లేదా ‘కాదు’ అనువానితో సరిపుచ్చవలెను. అంతకుమించిన పలుకులు దుష్టునినుండి వచ్చునవే.

ప్రతీకారము (లూకా 6:29-30)

38. ” ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని పూర్వము చెప్పబడిన దానినిమీరు వినియున్నారుగదా!

39. నేనిపుడు మీతో చెప్పునదేమన: నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టినవానికి, నీవు నీ ఎడమ చెంపను కూడ త్రిప్పుము.

40. నీతో తగవులాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు వ్యాజ్యెమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము. 41. ఒకడు నిన్ను తనతో ఒక మైలు రమ్మని బలవంతముచేసిన, వానితో రెండుమైళ్ళు వెళ్ళుము.

42. అడిగిన వానికి లేదనక యిమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిపుడు నొక్కి వక్కాణించుచున్నాను.”

పరిపూర్ణ ప్రేమ (లూకా 6:27-28, 32-36)

43. ” ‘నీ పొరుగువానిని ప్రేమింపుము; నీ శత్రువును ద్వేషింపుము’ అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా!

44. నేనిపుడు మీతో చెప్పునదేమన: మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారికొరకు ప్రార్థింపుడు.

45. అపుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగినబిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన దుర్జనులపై, సజ్జనులపై  సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై, దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు.

46. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టిబహుమానము లభించును? సుంకరులు1 సైతము అటులచేయుట లేదా?

47. మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత యేమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా?

48. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!