సైతాను శోధన

(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)

4 1. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగివచ్చి, ఆత్మప్రేరణవలన ఎడారి ప్రదేశము నకు నడిపింపబడెను.

2. అచట నలువది దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలిగొనెను.

3. అపుడు సైతాను యేసుతో ”నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము” అనెను.

4. అందుకు యేసు:

” ‘మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు’

అని వ్రాయబడి ఉన్నది”

అని వానికి సమాధానము ఇచ్చెను.

5. అంతట సైతాను ఆయనను పైకి తీసికొని పోయి రెప్పపాటుకాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటినిచూపి.

6. ”ఈ రాజ్యముల సర్వాధికారమును, వాని వైభవములనెల్ల నీకు ఇచ్చెదను. అట్టిఅధికారము నాకు కలదు. నేను కోరినవానికి వాటిని ఈయగలను.

7. కనుక, నీవు నన్ను ఆరాధించినచో ఇదిఅంతయు నీ సొత్తు అగును” అనెను.

8. అందుకు యేసు:

” ‘నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి 

ఆయనను మాత్రమే సేవింపవలయును’

అని వ్రాయబడియున్నది”

అని పలికెను.

9. పిమ్మట సైతాను యేసును యెరూష లేమునకు తీసికొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను:

               ”నీవు దేవుని కుమారుడవైనచో

               ఇచ్చటనుండి  క్రిందికి దూకుము.

10.         ఏలయన, ఇట్లు వ్రాయబడి ఉన్నది:

               ‘నిన్ను రక్షింప దేవుడు తనదూతలకు

               ఆజ్ఞయిచ్చియున్నాడు

11.           మరియు, నీవు రాళ్ళపైపడి గాయపడకుండునట్లు,

               నిన్ను వారు తమచేతులతో

               ఎత్తి పట్టుకొందురు’ ”

12. అందుకు యేసు:

” ‘ప్రభువైన నీ దేవుని శోధింపరాదు’ అని చెప్పబడినది గదా!” అనెను.

13. ఇట్లు ఆ సైతాను అనేకవిధముల శోధించినపిదప, తగిన సమయమునకై ఆయనను విడిచివెళ్ళెను.

వేద ప్రచారారంభము

(మత్తయి 4:12-17; మార్కు 1:14-15)

14.  పిదప యేసు ఆత్మబలముతో గలిలీయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను.

15. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు, ప్రజలందరి మన్నన లను పొందుచుండెను.

నజరేతూరిలో నిరాదరణము

(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)

16. తరువాత యేసు తానుపెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనామందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా, 17. యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచన ములు కనపడెను.

18.          ”ప్రభువు ఆత్మ నాపై ఉన్నది.

                              పేదలకు సువార్తను బోధించుటకై

                              ఆయన నన్ను అభిషేకించెను.

                              చెరలోనున్న వారికి విడుదలను,

                              గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును,

                              పీడితులకు విమోచనమును

                              కలుగ చేయుటకును,

19.          ప్రభుహితమైన సంవత్సరమును

                              ప్రకటించుటకును

                              ఆయన నన్ను పంపెను.”

20. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరి చూచుచుండగా, 21. ఆయన వారితో ”నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది” అని పలికెను.

22. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ”ఇతడు యోసేపు కుమారుడు కాడా?” అని చెప్పుకొనసాగిరి.

23. అంతట యేసు వారితో ‘ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము’ అను సామెతను చెప్పి, ” ‘నీవు కఫర్నాములో ఏ యే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశములో సైతము చేయుము’ అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు.

24. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకు చున్నాను.

25. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరముల ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్పకరువు వ్యాపించినది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది  విధవరాండ్రు  ఉండినను, 26. సీదోనులోని సరెఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను.

27. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరిఎవ్వరును స్వస్థతపొందలేదు” అని పలికెను.

28. అపుడు ప్రార్థనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి.

29. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొనిపోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసికొని వెళ్ళి, అచటనుండి తలక్రిందుగా పడత్రోయతలచిరి.

30. కాని, యేసు వారి మధ్యనుండి తొలగి తనదారిన తాను వెళ్ళిపోయెను.

దయ్యము పట్టినవాడు

(మార్కు 1:21-28)

31.పిదప ఆయనగలిలీయసీమలోని కఫర్నామునకు వచ్చి, విశ్రాంతిదినమున ప్రజలకు బోధించు చుండెను.

32. ఆయన బోధకు వారందరు ఆశ్చర్యపడిరి. ఏలయన, ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను.

33. ఆ ప్రార్థనామందిరములో దయ్యముపట్టిన వాడొకడు కేకలువేయుచు, 34. ”ఆహా! నజరేతు నివాసియగు యేసూ! మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి” అని అరచెను.

35. ”నోరు మూసుకుని వీనినుండి వెడలిపొమ్ము” అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిల లాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను.

36. ఇది చూచి జనులందరు ఆశ్చర్యపడి ”ఇతడు అధికారముతోను, శక్తితోను, అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే అవి వెడలిపోవుచున్నవి” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి.

37. ఆ పరిసరములందంతట ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను.

అనేకులకు స్వస్థత

(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)

38. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి, తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అపుడు సీమోను అత్త తీవ్రమైనజ్వరముతో మంచము పట్టియుండెను. వారు  ఆమెవిషయము ఆయనకు మనవి చేసికొనిరి.

39. అపుడు ఆయన ఆమెచెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను.

40. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగ పీడితులైన వారినందరిని వారివారి బంధువులు యేసు వద్దకు తీసికొనివచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కనిమీద తన హస్తమునుంచి వారినందరిని స్వస్థపరచెను.

41.అనేకులనుండి దయ్యములు ”నీవు దేవుని కుమారుడవు” అని ఆర్భించుచు వదలి పోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానినిగద్దించి, మాటాడనీయలేదు.

వేద ప్రచారము

(మార్కు 1:35-39)

42. వేకువనేలేచి యేసు ఒక నిర్జనప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి, తమను విడిచిపోవలదని అనగా, 43. ఆయన వారితో ”నేను ఇతర పట్టణములలోకూడ దేవునిరాజ్యమును గురించి బోధింపవలసివున్నది. అందులకే నేను పంపబడితిని” అని పలికెను.

44. పిమ్మట యేసు యూదయా ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను.