దేవుడు లోకమును
సృజించుట, నడిపించుట
33 1. నీతిమంతులారా!
ప్రభువునుచూచి ఆనందనాదము చేయుడు.
ఋజువర్తనులు ప్రభువును
స్తుతించుట యుక్తము.
2. తంత్రీవాద్యముతో ప్రభువును నుతింపుడు.
థతంత్రుల స్వరమండలముతో
ఆయనను కీర్తింపుడు.
3. ప్రభువునకు నూతనగీతము పాడుడు.
నేర్పుతో వాద్యము మీటుచు
ఆయనకు జేకొట్టుడు.
4. ప్రభువు పలుకులు సత్యమైనవి.
ఆయన కార్యములు నమ్మదగినవి.
5. ఆయనకు నీతిన్యాయములనిన ఇష్టము.
లోకమంతయు ఆయన
అచంచల కృపతో నిండియున్నది.
6. ప్రభువు తనవాక్కుతో ఆకాశమును సృజించెను.
తన పలుకుతో సూర్యచంద్ర
నక్షత్రాదులను చేసెను.
7. ఆయన సముద్రజలములనెల్ల
చర్మపుతిత్తులలో నిల్వచేయును.
సాగరములను తన కొట్టులలో దాచియుంచును.
8. జగమంతయు ప్రభువునుచూచి భయపడునుగాక!
ప్రజలెల్లరు ఆయనను గాంచి భీతిల్లుదురుగాక!
9. ప్రభువు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను.
ఆయన ఆజ్ఞ ఈయగా సమస్తమును కలిగెను.
10. ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును.
ప్రజల పన్నుగడలను వమ్ముచేయును.
11. కాని ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిల్చును.
ఆయన సంకల్పములు కలకాలము చెల్లును.
12. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది.
ఆయన తనవారినిగా ఎన్నుకొనిన
ప్రజలు భాగ్యవంతులు.
13. ప్రభువు ఆకసమునుండి క్రిందికి పారజూచును.
నరులందరిని పరిశీలించిచూచును.
14. ఆయన తాను సింహాసనాసీనుడై ఉన్న తావునుండి
భూలోకవాసులందరిని పరికించిచూచును.
15. నరుల హృదయములయందు
ఆలోచనలు ప్టుించునది ఆయనే.
జనులు చేయుకార్యములన్నియు
ఆయనకు తెలియును.
16. రాజునకు మహాసైన్యము వలననే
విజయము కలుగదు.
వీరునకు గొప్ప బలమువలననే
గెలుపు లభింపదు.
17. అశ్వబలముతో విజయమును
సాధింతుమనుకొనుట వెఱ్ఱి,
గుఱ్ఱమెంత బలము కలదైనను
గెలుపును చేకూర్చిపెట్టలేదు.
18. ప్రభువు మాత్రము తనకు భయపడువారిని,
తన కరుణను నమ్ముకొనిన వారిని
సుస్థిర ఆదరముతో చూచును.
19. వారి ప్రాణములను మరణమునుండి రక్షించును. కరువుకాలమున వారి ప్రాణములను కాపాడును.
20. ప్రభువునందే మా నమ్మకము.
ఆయనే మాకు సహాయము, డాలు.
21. ఆయనయందు మా హృదయము సంతసించును.
ఏలన ఆయన పవిత్రనామమును విశ్వసించితిమి.
22. ప్రభూ! మేము నిన్ను విశ్వసించినట్లే
నీ స్థిరమగు కృప
మమ్ము ఆవరించియుండునుగాక!