సూర్యుడు, చంద్రబింబము, నక్షత్రములు, రంగులధనుస్సు

43 1.      ఆకాశమెంత కాంతిమంతముగాను,

                              ఎంత  నిర్మలముగాను ప్రకాశించును!

2.           ఉదయభానుడు మింట ఎగయుచు

               మహోన్నతుని సృష్టి మహాద్భుతమైనదని

               ప్రకటన చేయును.

3.           మిట్టమధ్యాహ్నమున సూర్యుడు

               భూమిని మాడ్చివేయును.

               తన అగ్నినెవరును భరింపజాలరు.

4.           కొలిమివద్ద పనిచేయువాడు ఒడలిని మాడ్చు

               వేడిమిని సహింపవలెను.

               కాని సూర్యుడు మూడురెట్లు

               అధికముగా పర్వతములను మాడ్చివేయును.

               ప్రొద్దు అగ్నికిరణములను వెళ్ళగ్రక్కును.

               దాని ప్రకాశమును భరింపలేక

               మన కన్నులు గ్రుడ్డివగును.

5.           సూర్యబింబమును చేసిన ప్రభువు మహాఘనుడు. ఆయన ఆజ్ఞపై అది త్వరత్వరగా పయనించును.

6.           చంద్రబింబము కలకాలము మాసములను,

               ఋతువులను సూచించుచుండును.

7.            ఉత్సవదినములను నిర్ణయించునదియు అదియే.

               ఆ తేజోగ్రహము కాంతి పెరిగితరుగుచుండును.

8.           చంద్రుని పేరే మాసము పేరు.

               పున్నమిచంద్రుడు సొగసుతో వెలుగును.

               అది ఆకసమున వెలుగొందుచు

               నక్షత్రరాసులకు దివిీవలె ఒప్పును.

నక్షత్రములు

9.           నక్షత్రకాంతి ఆకాశమునకు శోభనొసగును.

               ప్రభుని ఉన్నతాకాశమునకు తారలు

               దేదీప్యమానమైన అలంకారములు.

10.         పవిత్రుడైన ప్రభువు నిర్ణయించిన

               స్థానమునుండి అవి కదలవు.

               కావలికాయుటను అవి ఎన్నడును మానవు.

రంగులధనుస్సు

11.           రంగులధనుస్సును చూచి

               సృష్టికర్తను కొనియాడుము.

               అది మహాసౌందర్యముతో తళతళలాడుచుండును

12.          ప్రభువు తన చేతితో వంచినవిల్లో అన్నట్లు

               అది ఆకాశమున అర్థచంద్రాకృతితో

               అలరారుచుండును.

ప్రకృతి సౌందర్యము

13. ప్రభువు ఆజ్ఞాపింపగా మంచుపడును.

               ఆయన శాసింపగా మెరుపు మెరయును.

14.          ఆయన ఆకాశపుకొట్లను తెరవగా

               మేఘములు పకక్షులవలె ఎగిరిపోవును.

15.          ఆయన మేఘసముదాయమును

               ప్రోగుజేయును.

               మంచును ముక్కలుముక్కలు చేసి

               వడగండ్లు కురియించును.

16-17. ఆ ప్రభువును చూచి పర్వతములు

               కంపించును.

               ఆయన ఉరుములకు భూమి

               బాధతో ఘూర్ణిల్లును.

               ఆయన ఆజ్ఞాపింపగనే దక్షిణ వాయువు వీచును.

               ఉత్తరమునుండి తుఫాను, గాలి దుమారములు

               బయలుదేరును.

               ఆయన మంచును కురిపించగా

               అది పకక్షులవలె దిగి వచ్చును.

               మిడుతల దండువలె  నేలమీద వాలును.

18.          తెల్లని మంచును చూచి

               మన కన్నులు ఆశ్చర్యము చెందును.

               అది నేలమీద పడుటచూచి

               మనము తన్మయులమగుదుము.

19.          ప్రభువు పొడిమంచును ఉప్పువలె

               నేలమీద చల్లును.

               అది గడ్డక్టి ముండ్ల మొనలవలె కన్పించును.

20.        ఉత్తరమునుండి చలిగాలి వీచును.

               వెంటనే నీరు ఘనీభవించును.

               చెరువులు, సరస్సులు మంచుతో  నిండిపోయి, 

               హిమము అను కవచమును ధరించును.

21.          బెట్టతో ఆయన ఎడారులలోని

               కొండలను మాడ్చివేయును.

               ఆ సెగకు గడ్డి ఎండిపోవును.

22.        కాని పొగమంచుపడి ప్రకృతి మరల తెప్పరిల్లును.

               వేడిమి పోయిన తరువాత ఉపశమనమునొసగు మంచు పడును.

23.        ప్రభువు విజ్ఞానముతో మహాసముద్రములను

               శాంతింపజేసి, వానిలో ద్వీపములను

               నెలకొల్పెను.

24.         నావికులు సముద్రము వలన

               అపాయములను గూర్చి చెప్పుదురు.

               వారి సుద్దులువిని

               మనము ఆశ్చర్యచకితులమగుదుము

25.        ఆ సముద్రములో విచిత్రప్రాణులు జీవించును.

               పలురకముల జీవులును,

               మహాజల జంతువులును వసించును.

26.        ప్రభువు సామర్థ్యము వలన

               అన్ని కార్యములును సవ్యముగా జరుగును.

               ఆయన వాక్కువలన సమస్తవస్తువులు

               ఐక్యమైయుండును.

27.         సృష్టిని గూర్చి ఇంకను

               చాలసంగతులు చెప్పవచ్చును.

               కాని ఈ అంశమును ఎప్పికిని

               ముగింపజాలను.

               కనుక సంగ్రహముగా చెప్పవలెనన్న

               ”సమస్తమును ప్రభువే”.

28.        ప్రభువును స్తుతించు సామర్థ్యము మనకు లేదు.

               ఆయన తాను చేసిన సృష్టికంటె అధికుడు.

29.        ఆయన మహాఘనుడు, మహాభయంకరుడు.

               అద్భుతశక్తి సంపన్నుడు.

30.        నీ శక్తికొలది దేవుని సన్నుతించినను

               నీవు కీర్తించిన దానికంటె

               ఆయన అధికుడుగానుండును.

               అలయక నీ బలముకొలది ప్రభువును

               వినుతించినను ,

               నీవు ఆయనను తగినట్లుగా ప్రస్తుతింపజాలవు.     

31.          కింతో చూచిన వారెవరున్నారు

               కనుక ఆయనను వర్ణింపగలరు?

               సముచితరీతిన ఆయనను ఎవరు కీర్తింపగలరు?

32.        ఇంక మహారహస్యములు చాలగలవు.

               ప్రభువు సృష్టిలో మనకు తెలిసినది అత్యల్పము మాత్రమే.     

33.        సమస్తమును ప్రభువే సృజించెను. ఆయన తన భక్తులకు విజ్ఞానమును దయచేసెను.